Hyper Adi: జగన్ ఇంట్లోనే మంచి జరగలేదు? ఓట్లు ఎందుకేయాలి - హైపర్ ఆది పేలిపోయే పంచ్‌లు
AP Elections 2024: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నాగబాబుతో పాటు హైపర్ ఆది రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై పంచ్ లు వేశారు.
Pithapuram constituency: ఆంధ్రపదేశ్ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉండగా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం చాలా ప్రత్యేకంగా ప్రచారం జరుగుతోంది. అక్కడి నుంచి పోటీ చేయబోతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మద్దతుగా సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. పవన్ కల్యాణ్ తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం (మే 2) జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నాగబాబుతో పాటు హైపర్ ఆది రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హైపర్ ఆది వేసిన పంచ్‌లకు జనం కేరింతలు కొట్టారు.
కల్తీ మద్యం పోవాలన్నా, అలాంటి దోపిడీ ప్రభుత్వాన్ని దూరంగా పెట్టాలంటే ఈసారి కూటమి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. పవన్ కల్యాణ్ కు ఓటు వేసే అదృష్టం తనకు లేదన్నారు హైపర్ ఆది. తాను పిఠాపురంలో పుట్టి ఉంటే బావుండేదని అన్నారు.
‘‘వైసీపీ ప్రభుత్వం ఏం చెప్పి ఓట్లడుగుతోంది. మీ ఇంట్లో మంచి జరిగింది అంటే తమకు ఓటు వేయమని అడుగుతుంది. కానీ, వాళ్లింట్లోనే మంచి జరగలేదు. అందుకే ఇద్దరు చెల్లెళ్లు రోడ్డు మీద తిరుగుతున్నారు. సొంతింట్లోనే మంచి జరగనప్పుడు మన ఇళ్లలో మంచి ఎక్కడి నుంచి జరుగుతుంది? మేం బటన్ నొక్కితే ఉదయం ఆడవాళ్ల అకౌంట్లలో రూ.10 వేల డబ్బులు పడుతున్నాయని అంటున్నారు. కానీ, సాయంత్రం మూత విప్పితే మగవాళ్ల అకౌంట్లలో నుంచి రూ.30 వేలు పోతున్నాయి. ఇవన్నీ గమనించి మీరు ఓటు వేయాలి. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. సైకిల్ బయట ఉండాలి.. గ్లాసు సింక్ లో ఉండాలి అని జగన్ అంటున్నారు. కానీ, ఫ్యాన్ ఎంతలో ఉండాలి నాలుగులోనో 5 లోనో ఉండాలి కానీ.. గత ఎన్నికలప్పుడు మీరే తెలియక 151లో పెట్టారు. అందుకే కరెంటు బిల్లులు పెరిగాయి. కాబట్టి మీరు రెగ్యులేటర్ తగ్గించి మూడులోనో నాలుగులోనో పెట్టాలి.
మేం సింగిల్ గా వస్తున్నాం. మీరంతా కలసికట్టుగా వస్తు్న్నారని జగన్ అంటున్నారు. మన ఇంట్లో దొంగ పడితే ఏం చేస్తాం.. అందరం కలిసి తరిమి కొడతాం కదా.. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ గజ దొంగలను తరిమికొట్టాలనే అందరూ కలిశారు. చెడును అంతం చేయడానికి మంచి ఎప్పుడూ కలిసే వస్తుంది.
వంగా గీత గారు వడదెబ్బ తగిలి పడిపోయారని విన్నాను. మనకు ఈ ఐదేళ్లలో ఎన్నో దెబ్బలు తగిలాయి. వడదెబ్బల కంటే ఎక్కువ పెద్ద దెబ్బలు తగిలాయి. రాబోయే పది రోజుల్లో 151 మంది ఎమ్మెల్యేలు ఎక్కడో ఒక చోట వడదెబ్బ తగిలి పడిపోతుంటారు. ఎన్నో డ్రామాలు చేస్తారు. మా శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా మేం ఇన్ని డ్రామాలు చేయలేదు. కాబట్టి, అందరూ గమనించి గాజు గ్లాసుకు ఓటేయాలి’’ అని హైపర్ ఆది పిలుపు ఇచ్చారు.