Nellore Rains: నెల్లూరు జిల్లాను చుట్టుముట్టిన వరదనీరు.. ఊళ్లకు ఊళ్లనే తరలిస్తున్న అధికారులు..
నెల్లూరు జిల్లాలో వర్షం కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఊళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది.
సోమశిలనుంచి పెన్నాకు భారీగా నీటిని వదిలిపెట్టడంతో పెన్నా నది ఊళ్లను చుట్టేసింది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ముంపు గ్రామాల వాసుల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మొత్తం 9 మండలాల పరిధిలోని 40 గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు అధికారులు. ముంపు ప్రాంతాల వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.
నెల్లూరు రూరల్ మండలం, ఇందుకూరుపేట, కోవూరు, విడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం, సంగం, అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల.. మండలాల పరిధిలో ఉన్న గ్రామాలకు ముంపు ముప్పు ఎక్కువగా ఉన్నట్టు హెచ్చరించారు అధికారులు.
వర్షం తగ్గినా వదలని వరద..
మరోవైపు నెల్లూరు జిల్లాలో వర్షం దాదాపుగా తగ్గిపోయింది. అక్కడక్కడ చిరుజల్లులు మినహా ఈరోజు ఉదయం నుంచి వర్షం పెద్దగా లేదు. అయిదే వరద ముంపు మాత్రం రాత్రి నుంచి ఎక్కువైంది. ఉదయం నిద్ర లేచి చూసే సరికి చాలా ఊళ్లలోకి వరదనీరు వచ్చి చేరింది. రాత్రే అధికారులు ముంపు ప్రాంతాల వాసుల్ని తరలించాలని చూసినా.. కొంతమంది పునరావాస కేంద్రాలకు వచ్చేందుకు ఇష్టపడటంలేదు. ఊళ్లలోకి నీరు వచ్చిన తర్వాత వారంతా ఉరుకులు పరుగులు పెడుతూ మోకాలి లోతు నీళ్లలో ఇళ్లలోనుంచి బయటపడ్డారు.
జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఎక్కడికక్కడ రెవెన్యూ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తహశీల్దార్ లు, వీఆర్వోలు, స్థానికంగా అందుబాటులో ఉండాలని చెప్పారు. అటు సచివాలయం సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశాలిచ్చారు.
నెల్లూరు - చెన్నై, నెల్లూరు-ముంబై హైవే లపైకి వరదనీరు రావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నెల్లూరు నగరంతో ఇతర ప్రాంతాలకు రవాణా ఆగిపోయింది.
నగరంలోనూ వరద ప్రభావం..
నెల్లూరు నగరం, రూరల్ ప్రాంతాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. రంగనాథస్వామి ఆలయం సమీపంలోని కాలువ నుంచి నీరు దిగువకు వదిలారు. దీంతో సర్వేపల్లి కాల్వకు నీరు పోటెత్తింది. వెంకటేశ్వరపురం, అహ్మద్ నగర్, జనార్దన్ రెడ్డి కాలనీ, భగత్ సింగ్ కాలనీ, బోడిగాడితోట, రంగనాయకులపేట, పొర్లుకట్ట, అరవపాళెం ప్రాంతాల్లో వరదనీరు వచ్చి చేరింది. ముంపు ప్రాంతాల వారందర్నీ పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. వీరికోసం నెల్లూరు నగరంలో 8 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక శనివారం ఉదయం నుంచి వరద ఉద్ధృతి తగ్గడంతో.. సోమశిల ప్రాజెక్ట్ కి వచ్చే ఇన్ ఫ్లో తగ్గింది. దీంతో ఔట్ ఫ్లోను స్వల్పంగా తగ్గించారు అధికారులు.
Also Read: Weather Update: ఇప్పటికే ముంచేసిన వాన.. ఇవాళ మళ్లీ భారీ నుంచి అతిభారీ వర్షాలు
Also Read: Anantapur Rains: కదిరిలో కూలిన భవనాలు.. ముగ్గురు చిన్నారులు మృతి.. శిథిలాల్లో మరికొంత మంది