YS Jagan : వరద విపత్తును ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొలేకపోయిందా ? సీఎం జగన్ తీరుపైనా విమర్శలు ఎందుకు ?
వరద విపత్తును ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు ఎక్కువగా వినిస్తున్నాయి. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం.. సీఎం పెద్దగా దృష్టి పెట్టలేదనే అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తోంది.
రాయలసీమ, నెల్లూరు జిల్లాల వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. విశాఖను వణికించిన హుదూద్, ఉత్తరాంధ్ర ప్రజలకు తీవ్ర నష్టం కలిగించిన తీత్లీ తుఫాన్ విధ్వంసం ప్రజలకు గుర్తుకు వస్తున్నాయి. అదే సమయంలో ప్రజలు ఆ ఉత్పాతాలు వచ్చినప్పుడు ప్రభుత్వం వ్యవహరించిన తీరును .. ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరించిన తీరును బేరీజు వేసుకుంటున్నారు. అది సహజమైన విషయం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎలా స్పందించాయో అన్నది పోల్చి చూడటం సాధారణమే. ఆ పోలికలు ఇక్కడా వస్తున్నాయి. అయితే గత ప్రభుత్వంతేో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం, ముఖ్యమంత్రి పనితీరుపైనా విమర్శలు వస్తున్నాయి. ప్రజలు ఆదుకోవడంలో చూపాల్సినంత శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు బాధితుల నుంచి వినిపిస్తున్నాయి.
Also Read: ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు.. తెలంగాణలోనూ ఓ మోస్తరు వానలు కురిసే ఛాన్స్
హుదూద్,, తీత్లీ విపత్తుల్లో ప్రాణ నష్టం తక్కువ.. ఇప్పుడు ప్రాణ నష్టం ఎక్కువ !
ఏదైనా విపత్తు ముంచుకొస్తుంది అంటే... ప్రపంచవ్యాప్తంగా మొదటగా తీసుకునే ప్రాధాన్యతా నిర్ణయం వీలైనంత వరకూ ప్రాణనష్టం తగ్గించడం. ప్రకృతి విపత్తుల్ని ఊహించగలరు కానీ అడ్డుకోవడం అసాధ్యం. చేయగలిగింది వీలైనంతగా ప్రాణ, ఆస్తి నష్టాలు తగ్గించడం. ఆస్తి నష్టం జరిగినా ... పెద్ద లెక్క కాదు కానీ ప్రాణ నష్టం జరగకుండా ఎవరైనా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వం అయినా చేసేదే. గతంలో హుదూద్ వచ్చినప్పుడు.. తీత్లీ వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఊహించిన దాని కంటే తక్కువ ప్రాణ నష్టమే జరిగింది. పైగా హుదూద్, తీత్లీ ప్రళయ భయంకరమైన తుపానులు...గాలులు. ఇలాంటివి వచ్చినప్పుడు ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతుంది. కానీ రాయలసీమలో వచ్చింది వరదలు మాత్రమే. కానీ ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉంది. చనిపోయిన వారు.. గల్లంతయిన వారు యాభై మందికిపైగా ఉన్నారు. కొన్ని వేల మూగ జీవాలు జల సమాధి అయ్యాయి. ఇంత ప్రాణనష్టం ప్రకృతి విపత్తు వల్ల జరగదు. ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే జరిగింది.
Also Read: Nellore Mayor Election: నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ గా పొట్లూరి స్రవంతి..
ప్రభుత్వం నుంచి అప్రమత్తత తక్కువ.. అధికారుల నిర్లక్ష్యం !
ఓ వైపు తమిళనాడు వరద పరిస్థితిలు కళ్ల ముందు కనిపిస్తున్నా ...భారీ వర్ష హెచ్చరికలు వాతారణ శాఖ వినిపిస్తున్నా... కనీవినీ ఎరుగని వరద వస్తుందని కేంద్ర జలసంఘం చెబుతున్నా ప్రభుత్వం వైపు నుంచి వచ్చిన అప్రమత్తత సంకేతాలు చాలా తక్కువ. అదే సమయంలో అధికారులు కూడా ప్రభుత్వంలాగే ఉన్నారు. రెండు రోజుల ముందు టీటీడీ అధికారులు ప్రమాదాన్ని గుర్తించి దర్శనాలు నిలిపివేశారు. కానీ ఈ మాత్రం చర్యలు అధికారులు తీసుకోలేకపోయారు. ముఖ్యంగా పింఛా, అన్నమయ్య ప్రాజెక్ట్ పర్యవేక్షణా అధికారులు, జల వనరుల శాఖ అధికారులు మాత్రం అలర్ట్ కాలేకపోయారు. ఫలితంగా పింఛ, అన్నమయ్య డ్యాంలు దెబ్బతిన్నాయి. ఆ ఫలితం ఎడెనిది గ్రామాలు తుడిచి పెట్టుకుపోగా... పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వమైన రెండు రోజుల ముందు కంట్రోల్ రూం పెట్టి ప్రతీ విషయాన్ని పరిశీలిస్తూ... సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఆ వ్యూహం ఈ ప్రభుత్వం విపత్తును ఎదుర్కోవడంలో మిస్సయిందన్న అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది.
Also Read: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన... కడప-అనంతపురం మధ్య రాకపోకలు బంద్
అధికార యంత్రాంగం మధ్య సమన్వయ లోపం !
ప్రకృతి విపత్తు సంభవిస్తే ముందుగా యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ ను పునరుద్ధరిస్తారు. ఎందుకంటే విద్యుత్ లేకపోతే ఏ పనీ జరగదు. కానీ తిరుపతిలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణకు రెండు రోజులు పట్టిందంటే ... ఇక కడపలోని గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయడం కష్టం. చాలా ప్రాంతాల్లో ఇంత వరకూ విద్యుత్ పునరుద్ధరణ జరగలేదు. బాధితులకు ఆహారం అందడమే కష్టంగా మారింది.రహదారులు కోతకు గురైన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసి రూట్ క్లియర్ చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోవడంతో కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయి. ఈ విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహిరంచకపోవడంతో సమస్యలు రెట్టింపు అయ్యాయి.
Also Read: చంద్రబాబుకు సోనూసూద్ పరామర్శ... అసెంబ్లీ పరిణామాలపై విచారం వ్యక్తం
ముఖ్యమంత్రి సరిగ్గా దృష్టి పెట్టలేదనే విమర్శలు !
వరద విపత్తను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్‌గా దృష్టి పెట్టలేదనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి . వరదలు వచ్చిన తర్వాత వాటి ప్రభావం ఎంత..? ఎలా ప్రాణ నష్టం తగ్గించాలి ? అన్న అంశాలపై కన్నా నష్టపరిహారం ప్రకటనలకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారన్న భావన వినిపిస్తోంది. ఇంకా పూర్తి స్థాయిలో వరద విరుచుకుపడక ముందే తక మృతుల కుటుంబాలకు రూ ఐదు లక్షల పరిహారం... పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి రూ. వెయ్యి ఇవ్వాలని చెప్పారే కానీ.., ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టమైన దిశానిర్దేశం అధికారయంత్రానికి కొరవడిందనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.
బాధితుల్ని పరామర్శించి ధైర్యం చెప్పడంలోనూ విఫలమయ్యారనే వాదనలు !
గత మూడు, నాలుగు దశాబ్దాల్లో రానంత వరద సీమ, నెల్లూరును అతలాకుతలం చేసింది. అంటే నష్టం ఎంత భారీగా ఉంటుందో ప్రత్యేకగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి సమయంలో ముఖ్యమంత్రి ఆ ప్రాంతంలోనే మకాం వేసి బాధితులకు ధైర్యం ఇస్తారని ఎవరైనా అనుకుంటారు. గతంలో హుదూద్. తీత్లీ వంటివి వచ్చినప్పుడు అప్పటి సీఎం చంద్రబాబునాయుడు అదే చేశారు. కనీస సౌకర్యాలు లేకపోయినా ఆ ప్రాంతంలోనే బస చేసి సహాయ కార్యక్రమాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండేలా.. ఏం జరిగినా ముఖ్యమంత్రి తమ దగ్గర ఉన్నారనే ఓ భరోసా ప్రజల్లో ఉండేలా చేయగలిగారు. ప్రస్తుత సీఎం జగన్ అలా చేయలేదు. ఓ సారి ఏరియల్ సర్వే నిర్వహించారు.. అయితే అదే సమయంలో ఆయన వివాహాలకు హాజరు కావడం మరింత వివాదాస్పదమయింది. వరద బాధితులు అల్లాడిపోతూంటే సీఎం జగన్ పెళ్లిళ్లకు వెళ్తున్నారని విపక్షాలు మండిపడ్డాయి. ఆయన మానసిక పరిస్థితిపై అనుమానంగా ఉందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు.
Can't believe this! When the Rayalaseema and Nellore districts continue to be ravaged by floods and so many people have lost their lives... our honourable Chief Minister is on a spree of attending weddings instead of coming to the rescue of the flood victims. Save Rayalaseema. pic.twitter.com/MO3gMcVqFg
— Lokesh Nara (@naralokesh) November 21, 2021
Also Read: వరద బాధిత ప్రాంతాలకు చంద్రబాబు.. బాధితుల్ని ఆదుకోవాలని పార్టీ శ్రేణులకూ సూచనలు !
పరిహారంపై ఇప్పటికీ లేని స్పష్టత !
రాయలసీమ, నెల్లూరు వరదల్లో కొన్ని వేల మంది సర్వం కోల్పోయారు. వారంతా ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు మాత్రమే సాయం ప్రకటన వచ్చింది. ఇళ్లు, పాడి, పంటలు ఇలా మొత్తం పోగొట్టుకున్న వారికి ఇచ్చే పరిహారంపై ఎలాంటి ప్రకటన రాలేదు. హుదూద్, తిత్లీల వంచి తుపానులు వచ్చినప్పుడు ప్రభుత్వం శరవేగంగా స్పందించి.. ప్రజలకు పరిహారం పంపిణీ చేసి.. ఎంతో కొంత ఊరట నిచ్చింది. అలాంటి ఊరట ఇప్పుడు రాయలసీమ, నెల్లూరు వరద బాధితులు ఆశిస్తున్నారు. ఇలాంటి విషయాల్లోనూ ప్రభుత్వం నుంచి మెరుగైన పనితీరు ఆశిస్తున్నారు.
Also Read: నెల్లూరు వద్ద NH-16 కు గండి, తెగిపోయిన నేషనల్ హైవే.. కి.మీ. మేర నిలిచిన వాహనాలు
విపత్తులు సంభవించినప్పుడు ప్రజల ఆగ్రహం సహజమే. వారి అంచనాలకు తగ్గట్లుగా ఆదుకోలేకపోవచ్చు. కానీ వీలైనంత ఎక్కువగా వారికి సాంత్వన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఆ విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది.
Also Read:అమరావతి రాజధానికే కేంద్రం కట్టుబడి ఉంది... బీజేపీ కార్యాలయం అక్కడే కడుతున్నాం... మహాపాదయాత్రలో పాల్గొన్న బీజేపీ అగ్రనేతలు
విపత్తులు సంభవించినప్పుడు ప్రజల ఆగ్రహం సహజమే. వారి అంచనాలకు తగ్గట్లుగా ఆదుకోలేకపోవచ్చు. కానీ వీలైనంత ఎక్కువగా వారికి సాంత్వన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. ఆ విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది.