Kadapa Rains: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన... కడప-అనంతపురం మధ్య రాకపోకలు బంద్
కడప జిల్లా కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై ఉన్న వంతెన కూలిపోయింది. దీంతో కడప-కమలాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
కడప జిల్లాలో పాపాగ్ని నది వరద ఉద్ధృతికి కమలాపురం బ్రిడ్జి కుంగిపోయింది. కొంత మేర కూలిపోయింది. వరద ధాటికి చీలిపోయిన బ్రిడ్జి క్రమ క్రమంగా కుంగిపోయింది. బ్రిడ్జి మధ్య భాగంలో ఆరు స్లాబులు చీలిపోయి నీటిలోకి క్రమంగా కుంగిపోతున్నాయి. వంతెన కుంగిపోవడంతో శనివారం రాత్రి అప్రమత్తమైన పోలీసులు బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. కడప-కమలాపురం మధ్య రాకపోకలు బంద్ చేస్తున్నట్లు తెలిపారు. ఇరువైపులా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కడప-అనంతపురం జిల్లాల మధ్య రాకపోకలు బంద్
కమలాపురం, వల్లూరు మార్గ మధ్యలోని వంతెన శనివారం సాయంత్రం కుంగిపోయింది. రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వంతెన పలు చోట్ల నెరలిచ్చింది. వెలిగల్లు జలాశయం నుంచి నాలుగు గేట్లు ఎత్తేయడంతో భారీగా వరద నీరు వంతెన పై అంచు వరకు రెండు రోజులుగా ప్రవహించింది. దీంతో వంతెన బాగా నానిపోయి కూలిపోయే స్థితికి చేరింది. విషయం తెలుసుకున్న వల్లూరు, కమలాపురం, ఎస్.ఐ.విష్ణువర్ధన్, కొండారెడ్డి తమ సిబ్బందితో వంతెన వద్ద పరిస్థితిని పరిశీలించారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఆరు స్తంభాల వరకు వంతెన కూలిపోయింది. 1977లో నిర్మించిన వంతెన కావడంతో భారీ వర్షాల కారణంగా కూలిపోయినట్లు జాతీయ రహదారి ఈఈ ఓబుల్‌రెడ్డి తెలిపారు. దీంతో కడప-అనంతపురం జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరమ్మతులు చేసేంత వరకు వాహనదారులు ప్రత్నామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరుకోవాలని కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి కోరారు.
Also Read: నెల్లూరు వద్ద NH-16 కు గండి, తెగిపోయిన నేషనల్ హైవే.. కి.మీ. మేర నిలిచిన వాహనాలు
కోవూరు హైవేకి గండి
నెల్లూరు జిల్లా గూడూరు వద్ద రోడ్డుపైకి వరదనీరు రావడంతో ప్రయాణాలు నెమ్మదిగా సాగుతున్నాయి. మరోవైపు కోవూరు వద్ద హైవేకి గండిపడి రోడ్డు కొట్టుకుపోవడంతో అసలు కదల్లేని పరిస్థితి. దీంతో హైవేకి అటు వైపు, ఇటువైపు వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి కనపడుతున్నాయి. కావలి ప్రాంతంలో రోడ్డుపైనే లారీలు, బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాలు ఆగిపోయాయి. చెన్నై, తిరుపతి వైపు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎక్కడా తినడానికి ఏమీ దొరక్కపోవడంతో పసిపిల్లల్ని తీసుకొస్తున్నవారు మరీ ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరు, చెన్నై, తిరుపతి ప్రయాణాలు పెట్టుకున్నవారు ఎక్కడికక్కడ ఆగిపోవడం మంచిదని చెబుతున్నారు పోలీసులు. ట్రాఫిక్ సమస్యలు దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు సాగించాలని, మధ్యలో ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు.
Also Read: ఏపీ వరద బాధితులకు అండగా ఉండండి... సహాయక చర్యల్లో పాల్గొనాలని రాహుల్ గాంధీ ట్వీట్