Nellore Mayor Election: నెల్లూరు నగర కార్పొరేషన్ కొత్త మేయర్ పేరు ఖరారు.. ఎవరంటే..
నెల్లూరు 12వ వార్డు కార్పొరేటర్ గా గెలుపొందిన పొట్లూరి స్రవంతి మేయర్ గా ఎన్నిక కాబోతున్నారు. మేయర్ పదవి ఎస్టీ-జనరల్ కేటగిరీకి రిజర్వ్ కావడంతో సీఎం జగన్ స్రవంతిని ఎంపిక చేశారు.
నెల్లూరు నగర కార్పొరేషన్లో 54 స్థానాలకు 54 కైవసం చేసుకున్న వైసీపీ, ఈ రోజు మేయర్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించబోతోంది. ఇప్పటికే అభ్యర్థి పేరు ఖరారైందని, స్వయంగా సీఎం జగన్ వద్దే మేయర్ అభ్యర్థి గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 12వ వార్డు కార్పొరేటర్ గా గెలుపొందిన పొట్లూరి స్రవంతి ఈసారి మేయర్ గా ఎన్నిక కాబోతున్నారు. మేయర్ పదవి ఎస్టీ-జనరల్ కేటగిరీకి రిజర్వ్ కావడంతో స్రవంతిని ఎంపిక చేశారు సీఎం జగన్. నెల్లూరు కార్పొరేషన్ గా మారిన తర్వాత నాలుగో మేయర్ గా స్రవంతి బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
నెల్లూరు నగర కార్పొరేషన్ కు ఎన్నికైన 49మంది కొత్త కార్పొరేటర్లలో స్రవంతి కూడా ఒకరు. ఆమె భర్త జయవర్దన్.. విద్యార్థి నాయకుడిగా పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రధాన అనుచరుడు. రూరల్ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ గెలుపులో చురుకైన పాత్ర పోషంచారు జయవర్ధన్. కార్పొరేటర్ టికెట్ ఖరారైనప్పటినుంచి 12వ డివిజన్లో జయవర్దన్, స్రవంతి ఉధృతంగా ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు కావడం వీరికి అదనపు బలమైంది. అయితే అనూహ్యంగా పోలింగ్ ఎదుర్కోకుండానే ఆమె ఏకగ్రీవంగా గెలుపొందారు. ఇప్పుడు మేయర్ పీఠం కైవసం చేసుకుంటున్నారు.
పోటీలో ముగ్గురు.. స్రవంతికే ఓటు..
నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ పీఠం ఎస్టీకి రిజర్వ్ కావడంతో.. మొత్తం ముగ్గురు అభ్యర్థులు చివరి వరకు పోటీలో ఉన్నారు. 12వ డివిజన్ కార్పొరేటర్ స్రవంతితోపాటు, 5వ డివిజన్ నుంచి ఓబిలి రవిచంద్ర, 53వ డివిజన్ నుంచి దేవరకొండ సుజాత మేయర్ రేసులో ఉన్నారు. అయితే ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే, మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. సీఎం జగన్ ని కలిసి మేయర్ ఎంపిక గురించి చర్చించారు. సీఎం జగన్ సూచనల ప్రకారం స్రవంతికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. మేయర్ పదవి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి, రెండు డిప్యూటీ మేయర్ పదవులు సిటీ నియోజకవర్గానికి అనేలా.. జగన్ వద్ద ఒప్పందం జరిగింది.
2019 జులై నుంచి ప్రత్యేకాధికారి పాలనలో ఉన్న నెల్లూరు నగర పాలక సంస్థ ఈ రోజు నుంచి మేయర్ పాలనలోకి వెళ్తుంది. వైసీపీ మొత్తం 54 డివిజన్లను గెలుపొందగా.. ఈరోజు అయిదుగురిని కోఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటారు. కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక అనంతరం మేయర్ ను ఎన్నుకుంటారు. ఇప్పటికే పొట్లూరి స్రవంతి పేరు ఖరారు కావడంతో ఆమె ఎన్నిక లాంఛనంగా మారింది.
రూరల్ కు మేయర్, సిటీకి డిప్యూటీ మేయర్లు..
నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మేయర్ పదవి వెళ్లడంతో, సిటీ నియోజకవర్గానికి 2 డిప్యూటీ మేయర్ పదవులు దక్కబోతున్నాయి. ఇందులో ఒక డిప్యూటీ మేయర్ గా గతంలో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన రూప్ కుమార్ యాదవ్ ఎంపికవుతారని తెలుస్తోంది.
అంతా కొత్తవారే..
నెల్లూరు కార్పొరేషన్ లో ఈసారి అంతా కొత్త వారే కనిపిస్తాయి. 54మంది కార్పొరేటర్లలో ఐదుగురు మినహా మిగతా 49మంది తొలిసారిగా ఎన్నికైన కార్పొరేటర్లే. చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా కూడా తొలిసారిగా వీరంతా కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. రూప్ కుమార్ యాదవ్, ఓబిలి రవిచంద్ర, దామవరపు రాజశేఖర్, బొబ్బల శ్రీనివాస్ యాదవ్, ఖలీల్ గతంలో కూడా కార్పొరేటర్లుగా పనిచేశారు. వీరు మినహా ఈసారి ఎన్నికైన అభ్యర్థులంగా కార్పొరేటర్లుగా తొలిసారి బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
54 వార్డులకు 54 వార్డులు వైసీపీ కైవసం చేసుకోవడంతో మేయర్ ఎన్నిక సహా, కార్పొరేషన్ సమావేశాలు ప్రశాంతంగా సాగుతాయని తెలుస్తోంది. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం లేకపోవడంతో కార్పొరేషన్ తీసుకునే నిర్ణయాలన్నీ దాదాపుగా ఏకగ్రీవం కాబోతున్నాయి. మేయర్ ఎన్నిక కూడా హడావిడి లేకుండా ప్రశాంతంగా జరగబోతోంది.
Also Read: వరద సహాయక చర్యల్లో పాల్గోండి... ఎమ్మెల్యేలు, అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు..
Also Read: కమలాపురం వద్ద పాపాగ్ని నదిపై కూలిన వంతెన... కడప-అనంతపురం మధ్య రాకపోకలు బంద్