YS Jagan meets Governor: గవర్నర్‌తో జగన్ దంపతుల భేటీ - లిక్కర్ స్కామ్ అరెస్టులపై ఫిర్యాదు?
AP Governor: ఏపీ గవర్నర్‌తో మాజీ సీఎం జగన్, ఆయన సతీమణి భారతి సమావేశమయ్యారు. లిక్కర్ స్కామ్ పేరుతో ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.

Jagan met AP Governor: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి .. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సమావేశమయ్యారు. ఆయన వెంట సతీమణి భారతి కూడా ఉన్నారు. బెంగళూరు నుంచి సోమవారం ఉదయం తాడేపల్లికి వచ్చిన జగన్ దంపతులు మధ్యాహ్నం గవర్నర్ తో సమావేశం అయ్యారు. ప్రధానంగా లిక్కర్ స్కాం లో జరుగుతున్న అరెస్టులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ పేరుతో భేతాళకథలు చెబుతూ.. లేని స్కాంలో ఆధారాలు సృష్టిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. తమ వాదనకు బలం చేకూర్చేలా కొన్ని డాక్యుమెంట్లను కూడా గవర్నర్ కు జగన్ అందించినట్లుగా చెబుతున్నారు.
లిక్కర్ స్కాంలో వైఎస్ భారతిని కూడా ఇరికించేందుకు సిట్ ప్రయత్నిస్తోందని జగన్ అనుమానిస్తున్నారు. ఇప్పటికే భారతి సిమెంట్స్ కు ఆడిటర్ గా ఉన్న బాలాజీ గోవిందప్పను అరెస్టు చేశారు. ఆయన వైఎస్ భారతికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్ని చూసుకుంటారని చెబుతున్నారు. ఈ క్రమంలో గత వారం.. హైదరాబాద్ సిట్ పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. భారతి సిమెంట్స్ హైదరాబాద్ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. బాలాజీ గోవిందప్ప చాంబర్ లోనూ సోదాలు చేసి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు లిక్కర్ సొమ్ము పెద్ద ఎత్తున భారతి సిమెంట్స్ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారని సిట్ వర్గాలు అనుమానిస్తున్నాయి. నగదుకు సంబంధించిన సమావేశాలు, ఆ నగదును లాండరింగ్ చేయాల్సిన పద్దతుల గురించి.. భారతి సిమెంట్స్ కార్యాలయంలోనే చర్చించినట్లు సిట్ అధికారులు సాంకేతిక ఆధారాలు సేకరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. అందుకే వైఎస్ భారతిని కూడా ఈ కేసులో ఇరికించేందుకు ప్లాన్ చేస్తున్నారన్న అనుమానంతో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు.
లిక్కర్ స్కామ్‌తో పాటు ఏపీలో వరుసగా వైసీపీ నేతలపై కేసులు పెడుతూండటం, అరెస్టులు చేస్తూండటంతో పాటు.. తన పర్యటనకు వెళ్లినప్పుడు ఉద్రిక్తతలు సృష్టిస్తూడటంపైనా గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.గవర్నర్ స్పందన ఏమిటన్నదానిపై స్పష్టత లేదు. మామూలుగా ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేంగా ఫిర్యాదు చేయాలంటే.. పార్టీ నేతలందరితో కలిసి వెళ్తూంటారు. కానీ జగన్ ఈ సారి తన భార్య భారతిని మాత్రమే తీసుకుని వెళ్లి గవర్నర్ ను కలవడం ఆసక్తికరంగా మారింది.
వైఎస్ జగన్ లిక్కర్ స్కామ్ విషయంలో ప్రభుత్వం వేధిస్తోందని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. అసలు లిక్కర్ పాలసీతో సంబంధం లేని వారిని అరెస్టులు చేస్తున్నారని పలుమార్లు ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే గవర్నర్ కు చెప్పుకోవడం వల్ల వైఎస్ జగన్ కు ఏమీ ఉపయోగం ఉండదని.. ఆయన ఏమైనా డాక్యుమెంట్లు ఇచ్చి ఉంటే.. వాటిని పరిశిలించాలని ప్రభుత్వానికే పంపుతారని అంటున్నారు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. గవర్నర్ ద్వారా కేంద్రానికి ఏదైనా విజ్ఞప్తులు పంపాలని అనుకుని ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తంగా సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలో.. గవర్నర్ తో జగన్ దంపతులు సమావేశం కావడం ఆసక్తి రేపుతోంది.





















