AP DGP Rajendranath Reddy: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ పై ఈసీ వేటు, కీలక ఉత్తర్వులు జారీ
Andhra Pradesh Elections: ఏపీలో ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది.
AP DGP Rajendranath Reddy Transfer: అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ డీజీపీపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసింది. ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన విధుల నుంచి వెంటనే రిలీవ్ కావాలని ఆదేశించింది. డీజీపీ స్థానం కోసం ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల పేర్లు పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వానికి సూచించింది.
ముగ్గురు డీజీ ర్యాంక్ అధికారుల వివరాలు ఇవ్వాలని ఆదేశం
ఏపీలో ఎన్నికల విధుల నుంచి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ తప్పించింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆయనకు ఎలాంటి ఎన్నికల బాధ్యతలు అప్పగించరాదని ఉత్తర్వులలో ఈసీ స్పష్టం చేసింది. ఏపీ డీజీపీగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని సీఎస్ ను ఈసీ ఆదేశించింది. సోమవారం (మే 6) ఉదయం 11 గంటలలోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారులను షార్ట్ లిస్ట్ చేసి తమకు పంపాలని ఆదేశించింది. ఏపీ డీజీపీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాలు ఇదివరకే ఫిర్యాదు చేశాయి. పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో డీజీపీపై ఈసీ చర్యలు చేపట్టింది.
రాజేంద్రనాథ్ రెడ్డిపై ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలు
ఏపీ డీజీపీగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాజేంద్రనాథరెడ్డి వైసీపీకి మద్దతుగా నిలిచారని విమర్శలు ఉన్నాయి. అంతా గమనించేలా ప్రతిపక్షాలపై దాడులు జరిగినా, దాష్టీకాలు జరుగుతున్నా ఏ రోజూ పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏపీ మంత్రుల్ని, వైసీపీ నేతల్ని ప్రశ్నించేవారిని అణగదొక్కేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేశారని అపవాదు ఎదుర్కొంటున్నారు.
వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన వారితో పాటు సోషల్ మీడియాలో సైతం పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేశారని టీడీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తూ వస్తోంది. ఉద్యోగ సంఘాలు తమ న్యాయపరమైన హక్కుల సాధన కోసం నిరసనకు పిలుపునిచ్చిన అణగదొక్కడంపై విమర్శలున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు వరకు ప్రతిపక్షాలకు ఆయన అందుబాటులో లేరని, ఈ మధ్య మాత్రమే ప్రతిపక్షాలకు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారని ప్రచారం జరిగింది.