DSP Jayasuriya issue: డీఎస్పీ జయసూర్య మంచి అధికారి - డిప్యూటీ స్పీకర్ కితాబు - కూటమిలో మరో కుంపటి ఖాయం !
Deputy Speaker Raghurama: భీమవరం చుట్టుపక్కల ఎలాంటి పేకాట శిబిరాలు జరగడం లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామ అన్నారు. డీఎస్పీ జయసూర్య మంచి అధికారి అని ప్రకటించారు.

Deputy Speaker Raghurama supports DSP Jayasuriya: భీమవరం డీఎస్పీ జయసూర్యపై వచ్చిన ఆరోపణలను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తోసిపుచ్చారు. ఆయన మంచి అధికారి అని మీడియా ప్రతినిధులతో ఆయన వ్యాఖ్యానించారు. 13 ముక్కలాట నేరం కాదని సుప్రీంకోర్టు చెప్పిందని.. అయినా ఇలాంటి వాటిని ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేసిందన్నారు. భీమవరం చుట్టుపక్కల ఎలాంటి పేకాట స్థావరాలు లేవని రఘురామ స్పష్టం చేశారు. అయితే డీఎస్పీ జయసూర్యపై పవన్ కల్యాణ్‌కు ఎవరు ఫిర్యాదు చేశారో.. ఎవరేం చెప్పారో తనకు తెలియదన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
భీమవరం డీఎస్పీ తీరుపై పవన్ కల్యాణ్ ఆగ్రహం - ఎస్పీకి ఫిర్యాదు
రఘురామ స్పందనతో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆయన అసాంఘిక శక్తులకు అండగా నిలుస్తున్నారని.. సెటిల్మెంట్లకు తన పేరు వాడుతున్నట్లుగా డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులు రావడంతో ఆయన పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. హోంమంత్రి అనిత, డీజీపీలకూ సమాచారం ఇచ్చారు. పేకాట శిబిరాలు డీఎస్పీ కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు వచ్చాయి.ఈ అంశంపై హోంమంత్రి అనిత స్పందించారు.
డీఎస్పీ జయసూర్య అసలేం చేశారు.. వివాదాలేంటి ?
పవన్ కల్యాణ్ తనకు వచ్చిన సమాచారాన్ని ఇచ్చారని. డీఎస్పీ జయసూర్యపై విచారణ చేయిస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఈ అంశంపై చర్యలు తీసుకుంటామన్నారు. అసలు డీఎస్పీ జయసూర్య ఏం చేశారన్నదానిపై రాజకీయవర్గాల్లో చర్చ ప్రారంభమైనంది. నేరుగా పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారంటే.. ఏదో పెద్ద ఇష్యూనే అయి ఉంటుందని అనుకుంటున్నారు.
డీఎస్పీకి రఘురామ సపోర్టుతో కూటమిలో కలకలం
రఘురామకృష్ణరాజు డీఎస్పీకి మద్దతుగా మాట్లాడటంతో జయసూర్య వ్యవహారం కూటమిలో కీలక అంశంగా మారే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో రఘురామ కృష్ణరాజు..స్వయంగా పవన్ కల్యాణ్ వ్యతిరేకించిన, ఆరోపణలు చేసిన డీఎస్పీకి మద్దతుగా నిలవడం హాట్ టాపిక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు జయసూర్యపై వచ్చిన నిర్దిష్టమైన ఆరోపణలేంటో స్పష్టతలేదు. పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాబట్టి ఆ డీఎస్పీని బదిలీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కానీ ఆయన చేసిన తప్పులేమిటన్నదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఆయనపై నివేదిక తమ వద్ద ఉందని.. హోంమంత్రి అనిత చెబుతున్నారు. కానీ అసలు ఆరోపణలేంటో బయటకు రాలేదు.
ప్రస్తుతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నారు. అందుకే ఈ అంశంపై ప్రస్తుతానికి ఎవరూ మాట్లాడే అవకాశం లేదు. అయితే తర్వాత జరిగే సాధారణ బదిలీల్లో జయసూర్యను బదిలీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.





















