Danda Nagendra Kumar: ఏపీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన దండా నాగేంద్ర కుమార్ అరెస్ట్
Danda Nagendra Kumar: పల్నాడు జిల్లా అమరావతికి చెందిన వైసీపీ మాజీ నేత దండా నాగేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Danda Nagendra Kumar: పల్నాడు జిల్లా అమరావతికి చెందిన వైసీపీ మాజీ నేత దండా నాగేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాత కేసుల విషయంలో నాగేంద్రను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని నెలల కిందట రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై నాగేంద్ర జాతీయ హరిత ట్రైబ్యునల్ (NGT)లో కేసు దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన గ్రీన్ ట్రిబ్యునల్ ఇసుక తవ్వకాలు ఆపేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వైసీపీ కార్యకర్త ఒకరు నాగేంద్రపై అమరావతి పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు. నాగేంద్రపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది.
ఈ కేసులో నాగేంద్ర బెయిల్ తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నాగేంద్ర గతంలో పెదకూరపాడు వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్‌రావుతో ఉండే వారు. హరిత ట్రైబ్యునల్‌లో కేసు దాఖలు తర్వాత శంకర్‌రావుకు దూరమయ్యాడు. ఆ తర్వాత నాగేంద్రపై పలు కేసులు నమోదయ్యాయి. అమరావతిలో నాగేంద్ర అతిథి గృహానికి నోటీసులు ఇచ్చారు. దీంతో కొంతకాలం నాగేంద్ర అజ్ఞాతంలోకి వెళ్లారు. కొద్ది కాలం తరువాత అజ్ఞాతం వీడి బయటకు వచ్చిన నాగేంద్ర టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించిన సమాచారాన్ని చంద్రబాబుకు అందించినట్లు సమాచారం. దీంతో నాగేంద్రను పాత కేసులో అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం నాగేంద్రపై పీడీ యాక్టు ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. అయితే, ఈ విషయం బయటకు రానీయకుండా జాగ్రత్త పడ్డారని తెలిసింది. హరిత ట్రైబ్యునల్‌లో కేసు విషయంలో నాగేంద్రను ప్రోత్సహించిన కంచేటి సాయిని ఇప్పటికే పోలీసులు పీడీ యాక్టు కింద అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైల్లో ఉంచారు.
ఎవరీ నాగేంద్ర కుమార్?
పల్నాడు జిల్లా ధరణి కోటకు చెందిన వైసీపీ నాయకుడు దండా నాగేంద్ర కుమార్ పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అనుచరుల్లో ఒకరు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై గతంలో జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేశారు. దీనిని పరిశీలించిన ఎన్‌జీటీ.. ఇసుక తవ్వకాలు ఆపాలని, జరిమానాలు విధించాలని ఆదేశించింది. ఐతే ఎమ్మెల్యే శంకర్రావు ఆదేశాలతోనే తాను ఎన్‌జీటీని ఆశ్రయించానని నాగేంద్ర కుమార్ వివరించారు. గతంలో జేపీ వెంచర్స్ సంస్థ ఇసుక తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మెల్యే.. ఇప్పుడు తానే తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా.. జేపీ వెంచర్స్ ప్రతినిధుల్ని ఎమ్మెల్యే బెదిరించిన వీడియోలను ఆయన బయటపెట్టారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై నాగేంద్రకుమార్ జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. రాష్ట్రంలోని 110 ఇసుక రీచ్‌లలో వెంటనే తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఆదేశాలను తీర్పులో పేర్కొన్న ఎన్జీటీ గత ఉత్తర్వులు అరణియార్ నదిలోని 18 రీచ్‌లకే పరిమితం కాదని స్పష్టం చేసింది.
రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటీ ఉత్తర్వులను అమలు చేయాలన్నఎన్జీటీ సూచించింది. పర్యావరణ అనుమతులు తీసుకునే వరకు తవ్వకాలు చేపట్టరాదని ఆదేశించింది. గతంలో తాము జారీ చేసిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రిబ్యునల్ తీర్పునకు ఏపీ ప్రభుత్వం వక్రభాష్యం చెప్పిందని మండిపడింది. రాష్ట్ర పర్యావరణ అంచనా కమిటీ ఆదేశాల తర్వాత ఇసుక తవ్వకాలపై నివేదించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇసుక తవ్వకాలపై జేపీ వెంచర్స్ కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.