CM Jagan: రాష్ట్రం శ్రీలంకలా ఉందట, ఉచిత పథకాలు ఆపేయాలట- విపక్షంపై జగన్ పంచ్‌లు
Ongole: ఒంగోలులో శుక్రవారం (ఏప్రిల్ 22) నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు.
ఏపీలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాల ద్వారా ఈ మూడేళ్ల కాలంలో ఏకంగా రూ.1,36,694 కోట్లను ప్రజల సంక్షేమం కోసం ఖర్చు చేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రక్రియలో ఎక్కడా లంచాలకు తావు ఇవ్వలేదని, నేరుగా లబ్ధిదారులకు మేలు జరిగిందని అన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా ఏ సంక్షేమ పథకానికీ లోటు రానివ్వలేదని అన్నారు. ఒంగోలులో శుక్రవారం (ఏప్రిల్ 22) నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు.
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద నేడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నారు. తద్వారా 9.76 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని కోటికి పైగా మహిళలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలగనుంది. ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో రూ.1,261 కోట్ల వడ్డీ సొమ్మును జమ చేయనున్నారు. ఈ సొమ్ముతో కలిపి ఇప్పటి దాకా వైఎస్ఆర్ సున్నా వడ్డీల పథకం కింద రూ.3,615 కోట్లు సాయం అందించినట్లు అవుతుంది.
ఒంగోలులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. ఏపీని శ్రీలంకను చేస్తున్నారని చంద్రబాబు దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుతో పాటు కొన్ని మీడియా సంస్థలు కలిపి దుష్టచతుష్టయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేదలకు మంచి చేయొద్దనే ఉద్దేశం వారిదని.. అలాంటి రాక్షసులు, దుర్మార్గులతో తాము యుద్ధం చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు.
సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటిదాకా రూ.3,615 కోట్లు
‘‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద తొలి ఏడాది రూ.1258 కోట్లు, రెండో విడత కింద రూ.1,096 కోట్లు, మూడో ఏడాది రూ.1261 కోట్లు చెల్లిస్తున్నాం. ఈ మూడేళ్లలో ఈ పథకం కోసం రూ.3,615 కోట్లను మహిళల సంక్షేమం కోసం ఖర్చు చేశాం. మొత్తం 1.2 కోట్ల మందికి పైగా మహిళలకు దీనివల్ల మేలు కలిగింది. గతంలో 12 శాతం దాకా వడ్డీలు కట్టాల్సి వచ్చినా కూడా.. వారికి మంచి జరగాలని గత ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచించలేదు. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిన పరిస్థితులు ఉన్నాయి.
‘‘రాష్ట్రంలో మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. మహిళల్ని గత ప్రభుత్వం నట్టేట ముంచింది. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. మహిళలకు రూ. 3,036కోట్లు ఇస్తామని ఎగనామం పెట్టింది.’’ అని సీఎం జగన్ విమర్శించారు.