Jagan Delhi Tour : ఢిల్లీలో సీఎం జగన్ - మూడు రోజుల పాటు కీలక సమావేశాలు !
సీఎం జగన్ ఢిల్లీలో మూడు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు.
Jagan Delhi Tour : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. శనివారం ఢిల్లీ వేదికగా జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం జగన్ హాజరయ్యేందుకు వెళ్లారు. దేశ రాజధాని వేదికగా ఈ ఈనెల 27న జరగబోయే నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లపై ముఖ్యమంత్రి గళం విప్పుతారని చెబుతున్నారు. రాష్ట్రం ఎదుర్కొంటోన్న విభజన సమస్యల పరిష్కారంతో పాటు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వివరించనున్నారు. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ప్రధాని మోడీ, హోం శాఖా మంత్రి అమిత్ షాలతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఆర్థికశాఖ మంత్రులు పాల్గొనున్నారు. సీఎం జగన్ ఈనెల 26వ తేదీ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అదే రోజు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుసుకునే అవకాశం ఉంది. మరుసటి రోజు విజ్ఞాన్ భవన్‌లో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు.ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలు చేయడంపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. అలాగే విభజన సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్ట్, నిధులు విధుల విభజన, ప్రత్యేక హోదా గురించి మాట్లాడనున్నారు. పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9లో పొందుపరిచిన 91 సంస్థల ఏర్పాటు, షెడ్యూల్ 10 కింద చేర్చిన 142 ఇతర సంస్థల విభజన అంశాన్ని ప్రస్తావించనున్నారు..
అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం కూడా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ , కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరితో పాటు కీలక శాఖల మంత్రుల అపాయింట్మెంట్‌ను కూడా కోరినట్లు సమాచారం. ఈ భేటీలకు సంబంధించి వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నీ దగ్గరుండి చూస్తున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మొదట అమిత్ షా.. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలుసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో పునర్విభజన చట్టంలో పొందుపరిచిన మెజారిటీ అంశాలు పరిష్కారం లభించలేదు. విభజన తర్వాత ఎక్కడి ఆస్తులు అక్కడే ఉన్నాయి. వాటి విలువ సుమారు లక్షన్నర కోట్ల రూపాయలు ఉంటుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. విభజన సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలో ఆస్తుల విభజన చర్యలను వేగం చేసేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు సైతం దాఖలయ్యాయి. అయితే ఇటీవల విభజన ఏడాది నాటి లోటును భర్తీ చేస్తూ.. రూ. పది వేల కోట్లకుపైగా మంజూరు చేశారు. దీనిపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.