CM Jagan: నేటి నుంచి కడప జిల్లాలో సీఎం జగన్, 3 రోజులు అక్కడే.. పర్యటన వివరాలు ఇవీ..
మొదటిరోజు ప్రొద్దుటూరు, బద్వేల్, కడప ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు.
సీఎం జగన్ కడప జిల్లాలో నేటి నుంచి 3 రోజుల పాటు పర్యటించనున్నారు. మొదటిరోజు ప్రొద్దుటూరు, బద్వేల్, కడప ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో నిర్వహించే బహిరంగసభలో పాల్గొంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. బద్వేల్ గోపవరంలో రూ.956 కోట్లతో ఏర్పాటు చేయబోయే పరిశ్రమకు శంకుస్ధాపన చేస్తారు. కడప నగర శివారుల్లోని కొప్పర్తి వద్ద మెగా పరిశ్రమకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు.
పర్యటన వివరాలు ఇవీ..
డిసెంబరు 23 గురువారం ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్ కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రొద్దుటూరు మండలం గోపవరం చేరుకుంటారు. అక్కడ స్థానిక నాయకులతో కాసేపు ముచ్చటిస్తారు. 11.10 గంటలకు బొల్లవరం హెలిప్యాడ్ నుంచి బయలుదేరి 11.15 గంటలకు ఆ గ్రామంలోని బహిరంగ సభ ప్రాంతానికి చేరుకుంటారు. 11.20 నుంచి 11.35 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు ఉండనున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 1.35 గంటలకు గోపవరం ప్రాజెక్టు కాలనీ-1కు చేరుకుంటారు. అక్కడ స్థానిక నాయకులతో కాసేపు ముచ్చటిస్తారు.
1.50 నుంచి 1.55 గంటల వరకు బద్వేలు రెవెన్యూ డివిజన్ కొత్త కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. 1.55 నుంచి 2.25 గంటల వరకు మెజర్స్ సెంచురీ ప్లై పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారు. 2.35 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 2.55 గంటలకు సీకే దిన్నె మండలం కొప్పర్తికి వెళ్తారు. 3.10 గంటలకు కొప్పర్తి గ్రామంలోని వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ర్టియల్ హబ్ ఆర్చ్‌ను ప్రారంభిస్తారు. 3.25 గంటలకు వైఎస్సార్ ఈఎంసీ ఇండస్ర్టియల్ ఎన్‌క్లేవ్ వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం ప్రారంభిస్తారు. 5.05 గంటలకు ఇడుపుల పాయలోని హెలిప్యాడ్‌కు చేరుకొని.. గెస్ట్‌హౌస్‌కు చేరుకొని రాత్రికి అక్కడే బస చేస్తారు.
డిసెంబరు 24న..
24వ తేదీ శుక్రవారం ఉదయం 9.05 గంటలకు వైఎస్ జగన్ పర్యటన మొదలవుతుంది. వైఎస్‌ఆర్ ఘాట్ వద్దకు చేరుకొని 9.40 గంటల వరకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడే ప్రార్థనల్లో పాల్గొంటారు. 1.40 గంటలకు పులివెందుల పట్టణ పరిధిలోని ఇండస్ర్టియల్ పార్కుకు వెళ్తారు. 2.10 నుంచి 2.35 గంటల వరకు ఇండస్ర్టియల్ పార్కులోని ఆదిత్యా బిర్లా యూనిట్‌కు శంకుస్థాపన ఉంటుంది. 2.40 గంటలకు వైఎస్‌ఆర్ జగనన్న హౌసింగ్ కాలనీలో ఇళ్ల పట్టాల పంపిణీ, బహిరంగ సభలో లబ్ధిదారులతో మాట్లాడతారు. 3.35 గంటలకు మార్కెట్ యార్డ్‌కు చేరుకొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. 3.55 నుంచి 4.05 గంటల వరకు మోడల్ పోలీస్‌స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. 5.05 గంటలకు ఇడుపులపాయ హెలీప్యాడ్‌లో పార్టీ నాయకులతో మాట్లాడతారు. 5.25 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకొని రాత్రికి బసచేస్తారు.
డిసెంబరు 25న..
డిసెంబరు 25వ తేదీ శనివారం ఉదయం 9.05 గంటలకు ఇడుపులపాయ హెలీప్యాడ్ నుంచి బయలుదేరి 9.25 గంటలకు పులివెందులకు చేరుకుంటారు. 9.45 నుంచి 11.05 గంటల వరకు సీఎస్‌ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. 11.15 గంటలకు సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌లో ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభ కార్యక్రమం ఉంటుంది. 11.25 గంటలకు విజయా గార్డెన్స్‌లో ఓ వివాహ రిసెప్షన్‌కు వెళ్తారు. 11.50 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భాకరాపురంలోని సొంత ఇంట్లో ఉంటారు. 1.35 గంటలకు కడప ఎయిర్ పోర్టుకు చేరుకొని విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళతారు.