CM Jagan: 'కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశాం' - కుప్పానికే నీళ్లవ్వలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారంటూ సీఎం జగన్ విమర్శలు
Andhrapradesh News: కుప్పానికి హంద్రీనీవా కాలువ ద్వారా నీళ్లివ్వడం ఓ చారిత్రక అధ్యాయమని సీఎం జగన్ అన్నారు. కుప్పంలో శాంతిపురం సభలో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
![CM Jagan: 'కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశాం' - కుప్పానికే నీళ్లవ్వలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారంటూ సీఎం జగన్ విమర్శలు cm jagan comments in santhipuram in kuppam meeting CM Jagan: 'కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూశాం' - కుప్పానికే నీళ్లవ్వలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారంటూ సీఎం జగన్ విమర్శలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/26/2a52e10b50b00d0074ffc70d82182e741708933838285876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
CM Jagan Comments on Chandrababu in Kuppam Meeting: కుప్పం ప్రజలను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నామని.. కులం, మతం, ప్రాంతం, పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమం అందించామని సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. సోమవారం హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేసిన ఆయన.. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి కుప్పం బ్రాంచ్ కెనాల్ ను జాతికి అంకితం చేశారు. కుప్పం (Kuppam) ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. '672 కిలోమీటర్లు దాటుకుని, 1600 అడుగులు పైకెక్కి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రీనీవా సుజల స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పంలోకి ప్రవేశించింది. చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామం. చంద్రబాబు హయాంలో దోచేసుకుని, దాచేసుకుని ఆనాటి ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తే.. ఈరోజు మీ అందరి ప్రభుత్వం దాన్ని సగర్వంగా పూర్తి చేసింది. మరో 2 రిజర్వాయర్లు ప్రారంభించేందుకు కూడా శ్రీకారం చుట్టాం. కుప్పంకే నీళ్లివ్వలేని చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేస్తారు.? ఇన్నేళ్లూ ఆయన్ను భరించిన కుప్పం ప్రజల సహనానికి నా జోహార్లు.' అంటూ సీఎం వ్యాఖ్యానించారు.
'కుప్పం ప్రజల కల సాకారం'
2 లక్షల మంది ప్రజలకు సాగు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో మీ బిడ్డ ప్రభుత్వం కుప్పం ప్రజల కల సాకారం చేసిందని సీఎం జగన్ తెలిపారు. ‘చంద్రబాబు హయాంలో లాభాలు ఉన్న పనులు మాత్రమే చేశారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు 34 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 14 ఏళ్లు సీఎంగా చేశారు. అయినా బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేకపోయారు. కుప్పానికి కృష్ణమ్మ నీరు తెచ్చింది. కుప్పాన్ని మున్సిపాలిటీగా మార్చింది. రెవెన్యూ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ ఇచ్చింది ఎవరంటే.? మీ బిడ్డ జగన్. చిత్తూరు డెయిరీని తెరిపించడమే కాకుండా, దేశంలో అతిపెద్ద సహకార సంఘం డెయిరీ అమూల్ ను తీసుకొచ్చి పలమనేరు పాడి రైతులందరికీ గిట్టుబాటు ధర అందించేలా ఏర్పాటు చేశాం. ఇదే చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మక సంస్థ వెల్లూరు మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశాం. ఈ నియోజకవర్గంలోని అక్క చెల్లెమ్మల ఖాతాల్లో రూ.1400 కోట్లను జమ చేశాం.’ అని జగన్ వివరించారు.
'మీ బిడ్డను గెలిపించండి'
ప్రజలకు మంచి చేసుంటే చంద్రబాబుకు పొత్తులెందుకని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. ‘కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలి. భరత్ ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించండి. ఆయన గెలిచిన తర్వాత మంత్రిని చేస్తాను. మీ బిడ్డను గెలిపిస్తేనే పేదవారికి మంచి జరుగుతుంది. కేవలం అవసరానికి వాడుకుని వదిలేసే చంద్రబాబు ఎందుకు.?. ప్రజలను మోసం చేయడానికే ఆయన రంగుల మేనిఫెస్టోతో వస్తారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క స్కీమ్ అయినా ఉందా.?. కుప్పం ప్రజలు చంద్రబాబును నిలదీయాల్సిన అవసరం ఉంది’ అంటూ జగన్ పిలుపునిచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)