Amara Raja Investment : ఏపీలో రూ.250 కోట్లతో కొత్త ప్లాంట్, అమరరాజా సంస్థ కీలక నిర్ణయం!
Amara Raja Investment : ఆంధ్రప్రదేశ్ లో అమరరాజా మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించుకుంది. అమరరాజా గ్రూప్ కి చెందిన మంగళ్ ఇండస్ట్రీస్ 250 కోట్ల రూపాయల పెట్టుబడితో చిత్తూరు జిల్లాలో నూతన ప్లాంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది.
![Amara Raja Investment : ఏపీలో రూ.250 కోట్లతో కొత్త ప్లాంట్, అమరరాజా సంస్థ కీలక నిర్ణయం! Chittoor district Amara Raja industries committed Rs 250 crore investment in AP DNN Amara Raja Investment : ఏపీలో రూ.250 కోట్లతో కొత్త ప్లాంట్, అమరరాజా సంస్థ కీలక నిర్ణయం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/12/e69212755c88d8ffbdeba19c473fe9c91670851090643235_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Amara Raja Investment : అమరరాజా గ్రూప్‌లో రెండో అతి పెద్ద అనుబంధ సంస్థ అయిన మంగళ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఐఎల్) సోమవారం చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తెనెపల్లి వద్ద మంగళ్ ఇండస్ట్రీయల్ కాంప్లెక్స్ లో నూతన ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈ నూతన ప్లాంట్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్‌లో అమరరాజా మరిన్ని పెట్టుబడులు కొనసాగించడానికి కట్టుబడి ఉన్నామని తెలియజేసింది. ఏపీలో మూడు దశాబ్దాలకు పైగా 15 వేల మంది ఉద్యోగులతో అమరరాజా గ్రూప్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఏపీలో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న సంస్థల్లో ఒకటిగా అమరరాజా ఉంది. తమ నూతన ప్లాంట్ ని 250 కోట్ల రూపాయల పెట్టుబడితో అభివృద్ధి చేయనునట్లు అమరరాజా యాజమాన్యం ప్రకటించింది. దాదాపు 2.15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించనున్నట్లు వెల్లడించారు. డిజైన్ ఆధారిత తయారీ కంపెనీ మంగళ్ ఇండస్ట్రీస్.. ఆటో విడిభాగాలు, మెటల్ ఫ్యాబ్రికేషన్, బ్యాటరీ విడిభాగాలు, టూల్ వర్క్స్, స్టోరేజీ పరిష్కారాలు, కస్టమ్ ఫ్యాబ్రికేషన్ వంటి విభాగాలలో విస్తృత స్థాయి సేవలు అందిస్తుంది. నైపుణ్యంతో విభిన్న పరిశ్రమలకు మంగళ్ ఇండస్ట్రీస్ తమ సేవలను అందిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. బహుళ ఉత్పత్తుల కంపెనీగా ఇది దేశంలో అతి పెద్ద బ్రాండ్లను తమ వినియోగదారులుగా కలిగి ఉందని తెలిపారు. ఈ కంపెనీలో 3 వేల మంది ఉద్యోగులు, తొమ్మిది తయారీ కేంద్రాలలో విధులను నిర్వహిస్తున్నారు.
వలసలు తగ్గించడమే లక్ష్యం
అమర రాజా గ్రూప్ కో–ఫౌండర్ జయదేవ్ గల్లా మాట్లాడుతూ.. "ఆంధ్రప్రదేశ్ లో మా తయారీ కార్యకలాపాలను వృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నాం. తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు సైతం గణనీయంగా పెరుగుతాయి. వలసలను నిర్మూలించే లక్ష్యంతో పనిచేస్తున్నాం. తెనెపల్లి వద్ద ఈ నూతన కేంద్రంతో అదనంగా ఈ ప్రాంతంలో 1000 ఉద్యోగాలను సృష్టించనున్నాం’’ అని అన్నారు. మంగళ్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ హర్షవర్ధన్ గౌరినేని మాట్లాడుతూ ‘‘ సస్టెయినబల్ ఎనర్జీ పట్ల మా దృష్టిని కొనసాగిస్తూ, ఈ ప్లాంట్‌లో పునరుత్పాదక ఇంధన రంగాలైనటువంటి సౌర శక్తి కస్టమ్ ఫ్యాబ్రికేషన్ ఉత్పత్తులకు విడిభాగాలను తయారుచేయనున్నాం. నూతన వ్యాపారాలు, ఉత్పత్తులలో ప్రవేశించాలనే మా ప్రయత్నాలకు ఇది మద్దతునందించనుంది’’ అని అన్నారు. ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు అందుకున్న వెంటనే ఈ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలియజేశారు.
తెలంగాణలో పెట్టుబడులు
తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది అమరరాజా బ్యాటరీస్. విద్యుత్ వాహనాలకు అవసరమయ్యే బ్యాటరీల యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకుంది. ఇందు కోసం రూ. 9,500 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. దీనికి సంబంధించి అమరరాజా సంస్థ, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఇటీవల అవగాహనా ఒప్పందం జరిగింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన అమరరాజా సంస్థకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు పెట్టుబడులకు అమరరాజా ముందుకొచ్చిందన్నారు. సుమారు రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టడం గొప్ప విషయమని.. తెలంగాణలో మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. పారిశ్రామిక వేత్తలకు అన్ని వసతులు కల్పిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)