Chandrababu: స్కూల్‌లో 9ఏళ్ల బాలుడి హత్యపై చంద్రబాబు ఆగ్రహం, పిల్లలకీ రక్షణ కరవైందని ట్వీట్
రాష్ట్రంలో పిల్లలకు రక్షణ కరవైందనడానికి మరో ఉదాహరణ అని చంద్రబాబు అన్నారు. ఈ అతి క్రూరమైన చర్యను ఖండిస్తున్నానని అన్నారు.
ఏలూరులో గిరిజన సంక్షేమ హాస్టల్ లో గోగుల అఖిల్ అనే నాలుగో తరగతి విద్యార్థి దారుణ హత్య ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. రాష్ట్రంలో పిల్లలకు రక్షణ కరవైందనడానికి మరో ఉదాహరణ అని అన్నారు. ఈ అతి క్రూరమైన చర్యను ఖండిస్తున్నానని అన్నారు. నిష్పక్షపాత దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నానని, బాధిత కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
The horrific murder of Gogula Akhil, a 4th-grade student from Girijan community, at the Eluru tribal welfare ashram is a stark reminder of the state's alarming lack of safety for children. I vehemently denounce this heinous act and demand an unbiased investigation. My heart and…
— N Chandrababu Naidu (@ncbn) July 11, 2023
ఏపీలో ఓ గిరిజన సంక్షేమ శాఖ బాలుర హాస్టల్ లో నాలుగో తరగతి చదువుతున్న బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలోని పులిరామన్నగూడెంలో ఈ ఘటన జరిగింది. అదే జిల్లా ఉర్రింత గ్రామానికి చెందిన అఖిల్ వర్ధన్ రెడ్డి అనే విద్యార్థి గిరిజన సంక్షేమ శాఖ బాలుర హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. ఇతను హత్యకు గురి కావడం సంచలనంగా మారింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నేడు (జులై 11) తెల్లవారుజాము 5:30 గంటలకు నైనగోగుల అఖిల వర్ధన్ రెడ్డి మృతదేహం హాస్టల్ ఆవరణలోనే లభ్యమైంది. అతని చేతుల్లో ఓ లేఖ ఉంది. అందులో ‘‘బ్రతకాలనుకున్న వాళ్లు వెళ్లిపోండి ఎందుకంటే ఇక నుండి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి’’ అని రాసి ఉంది. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయింది. బాలుడి శవానికి మెడ చుట్టూ గాయాలు ఉన్నాయి. కుడి కన్ను వద్ద చిన్న స్క్రాచ్ గుర్తించారు. రోజులానే మరో పది మందితో కలిసి డార్మిటరీలో నిద్రించేందుకు రాత్రి వెళ్లినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అదే గదిలో నిద్రిస్తున్న మరో బాలుడు ఎవరో కిటికీ ద్వారా ప్రవేశించి మరొకరి సాయంతో అఖిల్ ను గది నుంచి తీసుకెళ్లిపోయినట్టుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఆ సమయంలో భయంతో ఆ బాలుడు ఎవరికీ చెప్పలేదు. ఉదయం లేచేసరికి అఖిల్ చనిపోయినట్టు తెలిసింది. మృతుడి అన్నయ్య అదే స్కూల్ లో చదువుతూ, అదే హాస్టల్ లో ఉంటున్నాడు. తల్లిదండ్రులు ఎవరి మీదా అనుమానం వ్యక్తం చేయలేదు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై మండిపడుతూ హాస్టల్ గేట్ వద్ద బైఠాయించారు.