Chandrababu Naidu: ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు - 'మిగ్ జాం' ప్రభావిత ప్రాంతాల్లో 2 రోజుల పర్యటన
Chandrababu News: టీడీపీ అధినేత చంద్రబాబు నేటి నుంచి ప్రజా పర్యటనలో పాల్గొననున్నారు. శుక్ర, శనివారాల్లో ఆయన మిగ్ జాం తుపాను ప్రబావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.
Chandrababu Tour in Michaung Affected Areas: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) శుక్రవారం నుంచి ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. నేటి నుంచి ఆయన మిజ్ గాం తుపాను (Michaung Cyclone) ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. శుక్ర, శనివారాల్లో గుంటూరు (Guntur), బాపట్ల (Bapatla) జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది. ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్న చంద్రబాబు నేడు తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెబుతారు. నందివెలుగు నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుండగా, అక్కడి నుంచి అమృతలూరు, నగరం, కర్లపాలెం మండలాల్లో సాగనుంది. రాత్రి బాపట్లలోనే బస చేయనున్న చంద్రబాబు శనివారం పర్చూరు, పత్తిపాడు నియోజకవర్గాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారు.
చాలా విరామం తర్వాత
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కంటికి శస్త్రచికిత్స అనంతరం వారం రోజులు విశ్రాంతి తీసుకున్నారు. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల, బెజవాడ దుర్గమ్మ ఆలయం పుణ్యక్షేత్రాలను సందర్శించారు. దాదాపు 2 నెలల అనంతరం పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.
ప్రభుత్వంపై విమర్శలు
మిగ్ జాం తుపాను ముందస్తు చర్యలపై ప్రజలు, రైతులను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు కనీసం ఆహారం, మంచి నీరు కూడా సకాలంలో అందించలేదని మండిపడ్డారు. ఈ తుపానుతో వేలాది ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వ్యవస్థల నిర్వీర్యం వల్లే నేడు ఈ దుస్థితి ఎదురైందని, వైసీపీ హయాంలో తుపాన్ల సమయంలో సాయం అరకొరగానే బాధితులకు అందుతోందని అన్నారు. టీడీపీ హయాంలో తుపాన్ల సమయంలో ప్రత్యేక జీవోల ద్వారా అన్నదాతలకు సాయం అందించినట్లు వివరించారు. హుద్ హుద్, తిత్లి వంటి తుపాన్లను సమర్థంగా ఎదుర్కొని ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూసినట్లు చెప్పారు. అప్పటితో పోల్చుకుంటే పెరిగిన ఖర్చులు, ఇతర భారాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు పరిహారం మరింత పెంచాలని అన్నారు.
ప్రధాన డిమాండ్స్ ఇవే
తుపాను కారణంగా బాధితులకు అందించే సాయంపై ప్రధానంగా కొన్ని డిమాండ్స్ ను చంద్రబాబు ప్రభుత్వం ముందుంచారు. వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.30,000, ఆక్వా రైతులకు రూ.50,000, అరటికి రూ.40,000, చెరకు పంటకు రూ.30,000, పత్తి, వేరుశనగకు రూ.25,000, జొన్న, మొక్కజొన్న, అపరాలు, పొద్దు తిరుగుడుకు రూ.15 వేలు, జీడి పంటకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు టీడీపీ వర్గాలు వివరాలు వెల్లడించాయి.
'అవన్నీ ఫేక్ హామీలే'
ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శిస్తూ టీడీపీ ట్వీట్ చేసింది. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారని, ఐదేళ్ల పాటు ఈ ప్రభుత్వం నిద్రపోయిందని మండిపడింది. 'మెగా డీఎస్సీ.?, 2.5 లక్షల ఉద్యోగాల భర్తీ.? ఏటా జాబ్ క్యాలెండర్.? ప్రతి జిల్లా ఓ హైదరాబాద్.? జిల్లాకో ఐటీ హబ్? అబ్బో యువతని మోసం చేసిన సీఎం జగన్ ఫేక్ హామీలు చాలానే ఉన్నాయి.' అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించింది.
5 ఏళ్ళు నిద్ర, మార్చిలో ఎన్నికలు అనగా, ఫిబ్రవరిలో పరీక్ష అట..!
— Telugu Desam Party (@JaiTDP) December 8, 2023
2.5 లక్షల ఖాళీలు ?
మెగా డిస్సీ ?
ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్?
ప్రతి జిల్లా ఒక హైదరాబాద్?
ప్రతి జిల్లాలో ఒక ఐటి హబ్?
అబ్బో.. యువతని మోసం చేసిన నీ ఫేక్ హామీలు ఇంకా చాలా ఉన్నాయి..#WhyAPHatesJagan #JaganFailedCM… https://t.co/OLTHSXSf2Z pic.twitter.com/cKGoXUFGDo
Also Read: Cyber Fraud: అనంతపురం పోలీసుల సాహసం- వెలుగులోకి 300 కోట్ల రూపాయల సైబర్ ఫ్రాడ్