TDP Work Shop : త్యాగం చేసిన వాళ్లను మరువం - వర్క్ షాప్‌లో చంద్రబాబు హామీ
Andhra News : పొత్తుల కోసం త్యాగం చేసిన వారిని మరువబోమని చంద్రబాబు అన్నారు. అభ్యర్థులకు ఏర్పాటు చేసిన వర్క్ షాప్‌లో చంద్రబాబు ప్రసంగించారు.
Chandrababu Speech : పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయిన వారికి , త్యాగం చేసిన సీనియర్లకు చంద్రబాబు హామీ ఇచ్చారు. కొంత మంది నేతలకు సీట్లు ఇవ్వలేకపోవచ్చు.. కానీ, వాళ్లు చేసిన త్యాగాన్ని నేను మరువలేను అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రం కోసం.. దేశం కోసం జట్టు కట్టాం. సంప్రదాయ రాజకీయాలు ఉండుంటే మనం కూడా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేసేవాళ్లమన్నారు. వైసీపీ ఓడిపోకుంటే రాష్ట్రం నాశనం అవుతుందని పవన్ కల్యాణ్ భావించారు. ఓటు చీలకూడదని పవన్ సంకల్పం తీసుకున్నారని తెలిపారు. పొత్తులతో.. పొత్తుల్లేకుండా కూడా పోటీ చేశామని గుర్తు చేశారు.
మూడు పార్టీలు కలసి పోటీ చేయడం వల్ల పొత్తుల వల్ల కొందరికి టిక్కెట్లు ఇవ్వలేకపోయాం అన్నారు. మూడు పార్టీల్లోనూ పోరాడిన వాళ్లున్నారు. పొత్తుల వల్ల టీడీపీ కోసం పని చేసిన 31 మంది నేతలకు టిక్కెట్లు ఇవ్వలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పొత్తులతో సంబంధం లేకుండా కొందరి సీనియర్లకు కూడా టిక్కెట్లు ఇవ్వలేకపోయామని.. పెట్టిన అభ్యర్థులు గెలిచేలా బేరీజు వేసుకునే మూడు పార్టీల అభ్యర్థులను నిలబెడుతున్నాం అన్నారు. పార్టీ పరంగానే కాకుండా సొంతంగా ఓట్లేయించుకునే అభ్యర్థులను ఎంచుకున్నాం అని తెలిపారు చంద్రబాబు.. సోషల్ ఇంజనీరింగ్ చేపట్టాం.. బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చేలా చూశాం. సోషల్ రీ-ఇంజనీరింగ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
సేవా భావంతో ఉన్న వాళ్లని రాజకీయాల్లో ప్రొత్సహించాల్సిన అవసరం ఉంది అన్నారు. విభిన్న వర్గాల్లో ప్రత్యేకమైన ఆలోచనా ధోరణి ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. వివిధ రంగాల్లో స్థిరపడిన వారికి కూడా రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలనే ఆలోచనలు కలుగుతున్నాయన్నారు. రాజకీయాలను ఇంకా ప్రక్షాళన చేయగలిగితే.. మరింత మంది మంచి వారు వస్తారు. రాగద్వేషాలకు, రికమెండేషన్లకు అతీతంగా అభ్యర్థుల ఎంపిక జరిగింది. ఈ మూడు పార్టీల వేసిన పునాది భవిష్యత్తుకు ఊతమిచ్చేలా ఉండాలని ఆకాక్షించారు.
వైఎస్ జగన్ లాంటి సీఎంను చూడలేదు. జగన్ రాజకీయాన్ని వ్యాపారం చేసేశాడు. జగన్ నోరు తెరిస్తే పచ్చి అబద్దాలే. తప్పు చేశారని ఎవరైనా అంటే కేసులు పెట్టేస్తారు అంటూ మండిపడ్డారు. ప్రతి ఒక్కటీ ఫేక్. బీజేపీ అధ్యక్షురాలు రాజీనామా చేసేశారని ఫేక్ లెటర్ పెట్టేసి ప్రచారం చేశారు. ఇది తాత్కాలిక పొత్తు అని నా పేరుతో ఫేక్ లెటర్లు వదిలారు. పురంధేశ్వరి నా కుటుంబ సభ్యురాలే కావచ్చు.. కానీ, ఆమె ముప్పై ఏళ్లకు పైగా వేరే పార్టీల్లో ఉన్నారు. ఆమె విషయంలో ఎన్నో తప్పుడు వార్తలు రాశారు. జనసేన మీద.. పవన్ మీద అలాగే తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వర్క్ షాప్‌నకు అభ్యర్థులతో పాటు వారు నియమించుకున్న పోల్ మేనేజ్మెంట్ మేనేజర్లను ఆహ్వానించారు. అందరికీ ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నారు. బీజేపీ జనసేన నేతలు కూడా వర్క్ షాప్‌లో పాల్గొన్నారు.