AP POLAVARAM : ఏపీ సర్కార్ ముందు పోలవరం సవాల్..!
పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య వెంటాడుతోంది. ఏపీ ప్రభుత్వం ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా సవరించిన అంచనాలను ఆమోదించేందుకు అంగీకరించడం లేదు.
పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - కేంద్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్న చర్చల ప్రక్రియలో ఎలాంటి ముందడుగు కనిపించడం లేదు. సవరించిన అంచనాలు ఆమోదించాలని ఏపీ ప్రభుత్వం.. కుదరదని కేంద్రం ఒకే మాట మీద ఉంటున్నాయి. దీంతో పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి డొలాయమానంలో పడింది. పోలవరం ప్రాజెక్టు డిజైన్లు మార్చినప్పటికీ 2014 ఏప్రిల్ నాటి అంచనా వ్యయమే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత మిగిలిన ఏపీకి నికరంగా ఇచ్చింది ఒక్క పోలవరం ప్రాజెక్ట్ మాత్రమే. మిగతావన్నీ హామీలే. పోలవరం జాతీయ ప్రాజెక్ట్. ప్రతి పైసా కేంద్రమే చెల్లించాలి.
పోలవరం నిధులకు కేంద్రం కొర్రీలు..!
పోలవరం నిర్మాణ వ్యయం... 2010- 11 లెక్కల ప్రకారం వ్యయం రూ.16,010 కోట్లు. 2017-18 ధరలను పరిగణనలోకి తీసుకుని సవరించిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు సవరించారు. సవరించిన అంచనాలను ఆమోదింపచేసుకోవడానికి గత ఏపీ ప్రభుత్వం ... ప్రయత్నించింది. కేంద్ర జలసంఘం పరిధిలోని సాంకేతిక సలహా సంఘం ఆమోద ముద్ర వేసింది. ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉంది. ఈ లోపు ప్రభుత్వం మారింది. హెడ్ వర్క్స్‌తో పాటు డిజైన్లను ఏపీసర్కార్ మార్చింది. అంచనాలు పెంచింది. రివర్స్ టెండరింగ్ పేరుతో తగ్గించిన మొత్తాన్ని రూ.5,535 కోట్ల నుంచి రూ.7,192 కోట్లకు పెరిగిందని ఏపీ సర్కార్ సమాచారం పంపింది. అయితే అదనంగా నిధులు కేటాయించబోమని కేంద్రం స్పష్టం చేసింది. అసలు అదనం కాదు.. సవరించిన అంచనాలను కూడా కేంద్రం ఆమోదించడంలేదు. ఈ విషయంపై వైసీపీ ఎంపీలందరూ నిర్మలా సీతారామన్‌తో సమావేశమైనా ప్రయోజనం లేకపోయింది.
అసలు అంచనా.. రూ. 55,548 కోట్లు..! సగం కూడా ఇవ్వరట..!
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ.. విడుదల చేసే వార్షిక నివేదికలో కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వ్యయం రూ. 55,548 కోట్లుగా ఈ నివేదికలో కేంద్ర జలశక్తి శాఖ గుర్తించింది. 2017-18 ధరల పట్టిక ప్రకారం పోలవరం వ్యయాన్ని 55,548 కోట్లుగా పేర్కొన్నారు. కానీ 2014 ధరల ప్రకారమే రీఎంబర్స్ చేస్తామని.. కేంద్రం కొద్ది రోజుల కిందట స్పష్టం చేసింది. ఇది ఇరవై వేల కోట్ల వరకే ఉంటుంది. ఈ మొత్తంతో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం లేదు. కేంద్రంతో గొడవలు పెట్టుకునే పరిస్థితి లేకపోవడంతో... అదే పనిగా విజ్ఞప్తులు చేసేందుకు ఏపీ ప్రభుత్వ పెద్దలు... ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. నేడో రేపో సవరించిన అంచనాలకు ఆమోదం లభిస్తుందని ప్రకటనలు చేస్తున్నారు.
అంచనాలపై గతంలో జగన్ విమర్శలు బూమరాంగ్..!
కేంద్ర ఆర్థిక శాఖ 20వేల కోట్లకే పరిమితమైనట్లుగా తేల్చేసి.. అనుమతించాల్సిందేనని ఏపీ సర్కార్ పై ఒత్తిడి తెస్తోంది. అయితే విభజన చట్టం ప్రకారం.. పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని.. మొత్తం ఖర్చు భరించాలని ఏపీ సర్కార్.. కేంద్రం వద్దకు విజ్ఞాపనలు తీసుకెళ్తోంది. మంత్రులు బుగ్గన, అనిల్ పదే పదే కేంద్రమంత్రుల్ని కలిసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ముఖ్యమంత్రి జగన్ అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేశారు. కానీ అక్కడా హామీ లభించలేదు. ఆర్థిక శాఖ మాత్రం.. ఈ అంశంపై నోరు విప్పడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అంచనాలను ఏపీ ప్రభుత్వం పెంచడాన్ని.. వైసీపీ తీవ్రంగా తప్పు పట్టింది. రూ. పదహారు వేల కోట్ల నుంచి.. ఏకంగా.. యాభై ఐదు వేల కోట్లకు అంచనాలు పెంచడం అంటే... మొత్తం దోపిడీనేనని విమర్శలు గుప్పించారు. కేంద్రానికి కూడా ఫిర్యాదులు చేశారు. ఇప్పుడు అవే అంచనాలను ఆమోదించాలని పట్టుబడుతూండటంతో ఏపీలోనూ చర్చనీయాశం అవుతోంది.
కేంద్రమైనా పోలవరం పూర్తి చేస్తేనే దేశానికి ప్రయోజనం..!
గత ప్రభుత్వంలో రూ. పదకొండు వేల కోట్లు ఇచ్చినా ఈ రెండేళ్లలో కేంద్రం అసలు పోలవరానికి నిధులు ఇవ్వడానికే సిద్ధపడటం లేదు. దీంతో అసలు ప్రాజెక్ట్ భవితవ్యంపైనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. చివరికి కేంద్రం నిధులు ఇవ్వకపోతే... పూర్తి స్థాయిలో నీళ్లు నిల్వ చేయలేమన్న ఉద్దేశంతో పోలవరం నుంచి డెడ్‌స్టోరేజీ నుంచి నీరు ఎత్తిపోతలకు ఆమోదం తెలిపి.. ఓ ఎత్తిపోతలకు మార్చే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. పోలవరం ఏపీ జీవనాడి .. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రజలు ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారు.