Viveka Cbi : కడప ఎంపీ తండ్రిని ప్రశ్నించిన సీబీఐ ! తర్వాత ఎవరు..?
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రితో పాటు పలువురు కీలక అనుమానితుల్ని సీబీఐ ప్రశ్నించింది. సునీల్ యాదవ్‌కు నార్కో టెస్టులు చేయాలన్న ఆలోచనతో సీబీఐ ఉంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు ఇప్పుడు ఎక్కువగా వైఎస్ కుటుంబసభ్యులనే ప్రశ్నిస్తున్నారు. మంగళవారం రోజంతా కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రశ్నించారు. సీబీఐ రెండు టీములుగా మారి విచారణ జరుపుతోంది. ఓ బృందం కడపలో... మరో బృందం పులివెందులలో ఉండి అనుమానితుల్ని ప్రశ్నిస్తోంది. మరో వైపు సునీల్ కుమార్ యాదవ్‌ను కస్టడీలోకి తీసుకుని వివరాలు రాబడుతున్నారు. ఈ వివరాల ఆధారంగా పులివెందులలో రెండో బృందం.. ఇతర అనుమానితుల్ని పిలిచి ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు ఆయన ఇంటి వద్దకు మొదటగా వెళ్లిన వ్యక్తుల్లో వైఎస్ భాస్కర్ రెడ్డి ఒకరన్న ప్రచారం ఉంది. వివేకా కుమార్తె సునీత ఇచ్చిన 15మంది అనుమానితుల లిస్టులో కూడా భాస్కర్ రెడ్డి పేరు ప్రముఖంగా ఉంది.
అయితే సీబీఐ అధికారులు ఇంత వరకూ ఒక్క సారి కూడా వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రశ్నించలేదు. విచారణ ప్రారంభమైన చాలా కాలం తర్వాత తొలి సారిగా ఆయనను విచారణకు పిలిచారు. వైఎస్ వివేకానందరెడ్డితో భాస్కర్ రెడ్డికి ఉన్న విబేధాలు.. రాజకీయ వివాదాలు, ఆర్థిక లావాదేవీలపై భాస్కర్ రెడ్డిని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మరో వైపు సునీల్ కుమార్ యాదవ్‌కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని సీబీఐ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కోర్టు అనుమతి కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే సునీల్ యాదవ్ మాత్రం నార్కో పరీక్షలు వద్దని కోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రిని ప్రశ్నించాడనికి ముందు రోజే.. అంటే సోమవారం.. ఎంపీ పెదనాన్నలైన వైఎస్ ప్రకాశ్ రెడ్డి, వైఎస్ ప్రతాప్ రెడ్డిలను సీబీఐ అధికారులు పులివెందులలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విచారించారు. అలాగే పులివెందులలో సీఎం జగన్ క్యాంఫాఫీస్‌ను చూసే వ్యక్తిని కూడా సీబీఐ పిలిపించి ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు పులివెందులకు వచ్చి 73 రోజులవుతోంది. ఇప్పటి వరకూ ఒక్క సునీల్ యాదవ్‌ను మాత్రమే అరెస్ట్ చేయగలిగారు. ఆయన దగ్గర్నుంచి ఎలాంటి సమాచారం రాబట్టారో కానీ పది రోజుల పాటు కస్టడీకి తీసుకుని.. సమయం అయిపోతున్న సందర్భంలో మళ్లీ కస్టడీ పొడిగింపు కోసం కోర్టులో పిటిషన్ వేశారు. కానీ కోర్టు అంగీకరించలేదు. దీంతో సీబీఐ అధికారులు ఈ పది రోజుల్లో సునీల్ యాదవ్ చెప్పిన అంశాలపైనే దర్యాప్తు చేయాల్సి ఉంది. సీబీఐ అధికారులు ఇప్పుడిప్పుడే వైఎస్ కుటుంబసభ్యులను ప్రశ్నిస్తున్నారు. ముందు ముందు మరికొంత మంది కీలక వ్యక్తుల్ని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది.