Google Data Center in Vizag:విశాఖకు గూగుల్...ఆసియాలో అతిపెద్ద పెట్టుబడి...50వేల కోట్లతో డేటా సెంటర్
విశాఖలో గూగుల్ Google Data Center 6 బిలియన్ డాలర్ల ఒప్పందం ఖరారు అయితే కనుక ఇది ఇండియాలో గూగుల్ (ఆల్ఫాబెట్) ఏక మొత్తంలో పెట్టబోయే అతిపెద్ద పెట్టుబడి కానుంది.

Google Data Center in Vizag: వైజాగ్‌లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. Google మాతృసంస్థ ఆల్ఫాబెట్ Alphabet విశాఖలో 1గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 6బిలియన్ డాలర్ల పెట్టుబడి (షుమారు 50వేలకోట్లకు పైన)తో ఇది ఏర్పాటు కానుందని రాయిటర్స్ (Reuters) వార్తా సంస్థ పేర్కొంది. ఈ ఒప్పందం ఖరారు అయితే కనుక.. ఇండియాలో గూగుల్ ఒకేసారి పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదే అవుతుంది. ప్రభుత్వంలో ఈ ప్రక్రియలో పాలుపంచుకుంటున్న ముఖ్యమైన సోర్సుల ద్వారా ఈ విషయం తెలిసిందని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.
విశాఖపట్నంలో గూగుల్ ఏర్పాటు చేయబోయే డేటాసెంటర్ అతిపెద్దది. 1 గిగావాట్ సామర్థ్యంతో… 6బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్ గూగుల్ ఆసియాలో నిర్మిస్తున్న అతిపెద్ద డేటాసెంటర్. ఇందులో 2బిలియన్ డాలర్లను పునరుత్పాదక ఇంధనం (Renewable energy) ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకే వినియోగించనుంది. డేటా సెంటర్ల నిర్మాణంపై 75బిలియన్ డాలర్లు ( దాదాపు 6లక్షల కోట్లు) ఖర్చు చేయాలన్న తమ నిర్ణయానికి ఇంకా తాము కట్టుబడే ఉన్నామని గూగుల్ ఈ ఏప్రిల్‌లో మరోసారి స్పష్టం చేసింది. దీనిని బట్టి చూస్తే గూగుల్ డేటా సెంటర్ల ఏర్పాటుపై చాలా కచ్చితమైన నిర్ణయంతో ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.
డేటా సెంటర్ ఏర్పాటుపై గూగుల్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఏపీ ఐటీ మంత్రి నారాలోకేశ్ కూడా బహిరంగంగా చెప్పడం లేదు. తాము ఇప్పటివరకూ అధికారికంగా ఖరారు అయిన ఒప్పందాలు గురించి మాత్రమే మాట్లాడతామని చెప్పారు. వచ్చే ఐదేళ్లలో 6గిగావాట్ల సామర్థ్యం ఉన్న డేటా సెంటర్లు ఇక్కడ కార్యకలాపాలు సాగించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈమధ్యనే మరో ఐటీ దిగ్గజం Sify వైజాగ్‌లో 500MW డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ముందకు వచ్చింది.
గూగుల్ డేటా సెంటర్ అంటే ఏంటి..?
మన ఇంటర్నెట్ వ్యవస్థకే గుండెకాయ లాంటిది డేటాసెంటర్. గూగుల్ అయినా.. మరో సంస్థది అయినా డేటా మొత్తం అక్కడే నిల్వ చేస్తారు. మనం Youtubeలో ఏదైనా వీడియోను ఓపెన్ చేసినా.. Google Photos క్లౌడ్ డేటా నుంచి ఫోటోలు డౌన్ లోడ్ చేసినా.. మన Gmail ఉపయోగించా మొత్తం బ్యాక్ ఎండ్ అంతా అక్కడే జరుగుతుంది. డేటా సెంటర్ అంటే సంక్షిప్తంగా చెప్పాలంటే.. మన డేటాను నిర్వహించి, భద్రపరిచే ప్రదేశం. దీనికి పెద్ద ఎత్తున స్థలం, విద్యుత్ అవసరం అయితాయి.
Google Data Center ఏముంటాయేంటే:
- లక్షల సంఖ్యలో సర్వర్లు ఉంటాయి. వీటి మీదే Youtube, Gmail, Google Photos పనిచేస్తాయి.
- డేటా స్టోరేజ్ వ్యవస్థ కూడా ఉంటుంది. గూగుల్ ప్రొడక్ట్స్‌లోని వీడియో, డాక్యుమెంట్ డేటా అంతా ఈ క్లౌడ్ స్టోరేజ్‌లో నిక్షిప్తం అవుతుంది
- హై స్పీడ్ నెట్‌వర్కింగ్ ఎక్విప్‌మెంట్ ఉంటుంది.
- ఇంటర్నెట్ సర్వర్లు, క్లౌడ్ బ్యాకప్‌లు వేడెక్కకుండా పనిచేయడానికి కూలింగ్ వ్యవస్థ అవసరం అవుతుంది. ఆ ఏర్పాట్లు ఉంటాయి.
- ఈ వ్యవస్థ మొత్తం నిరంతరాయంగా పనిచేయడానికి డ్యూయల్ పవర్ లైన్లు,జనరేటర్ బ్యాకప్, సోలార్ యుపీఎస్ వంటివి అవసరం. దీనిని సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు గూగుల్ తానే స్వయంగా 2బిలియన్ డాలర్లతో సొంత రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది.

విశాఖ అనుకూలత ఏంటి..?
దేశాల మధ్య ఇంటర్నెట్ వ్యవస్థ అండర్‌గ్రౌండ్ సీ కేబుల్స్ ద్వారా పనిచేస్తుంది. సముద్ర తీర నగరాల్లో వీటిని అనుసంధానించేందుకు కేబుల్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. ఇండియాలో అత్యధిక కెపాసిటీ ఉన్న కేబుల్ స్టేషన్లు విశాఖలో ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. అనేక సంస్థలు విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల ఇప్పటికే అక్కడ ఓ ఎకోసిస్టమ్ ఏర్పాటైంది. కాబట్టి గూగుల్ విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి సానుకూలంగానే స్పందించవచ్చు.
విశాఖపట్టణాన్ని ఐటీ, నాలెడ్జ్ హబ్‌గా మార్చడం తమ ఉద్దేశ్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో తన విజన్‌ను చెప్పారు. అలాగే ఆంధ్రకు వస్తున్న పలు భారీ ఐటీ పరిశ్రమలను కూడా విశాఖలోనే ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్ర్రప్రదేశ్‌లో భారీ డేటా సెంటర్లను రప్పించాలనుకుంటున్న ప్రభుత్వం విశాఖను ప్రతిపాదిస్తోంది. ఇప్పటికే పలు సంస్థలతో విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. ఇప్పుడు అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసిందంటే వైజాగ్ అంతర్జాతీయ ఐటీ అరెనాలోకి వచ్చేస్తుంది





















