Avanthi Srinivas Audio Tape: మంత్రి ఆడియో టేప్ హల్‌చల్.. మహిళతో ఆ మాటలు, స్పందించిన అవంతి శ్రీనివాస్
ఆడియో టేప్ విషయం తెలుసుకున్న మంత్రి అవంతి శ్రీనివాస్ గురువారం రాత్రి 10 గంటల సమయంలో అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు.
ఏపీ మంత్రికి చెందిన ఓ ఆడియో టేపు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ అవుతోంది. ఓ మహిళతో ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఆ ఆడియో టేపు వైరల్ అయింది. ఈ వ్యవహారం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) గురువారం రాత్రి బాగా పోద్దుపోయాక అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. సదరు ఆడియో టేపుపై వివరణ ఇచ్చారు.
రాజకీయంగా తాను ఎదగడం చూసి ఓర్వలేక కొందరు నకిలీ ఆడియోతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి వివరణ ఇచ్చారు. అది కావాలనే తయారు చేసిన ఆడియో టేపు అని కొట్టిపారేశారు. నకిలీ ఆడియో టేపులు తయారు చేసి సోషల్ మీడియా ద్వారా తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నారని వివరించారు. గతంలో ఎంపీగా పనిచేసి, ఇప్పుడు ఎమ్మెల్యేగా జిల్లా నుంచి ఏకైక మంత్రిగా సేవలు అందిస్తున్నప్పటికీ ఇప్పటిదాకా తనపై ఎలాంటి ఆరోపణలు రానిచ్చుకోలేదని గుర్తు చేశారు. పార్టీకి మహిళల్లో బాగా ఆదరణ పెరుగుతుందని, ఆ ఉద్దేశంతోనే తనపై ఈ తరహాలో బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి మంచితనంతో క్రమంగా ఎమ్మెల్యే నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగానని గుర్తు చేసుకున్నారు.
Also Read: Weather Updates: ఏపీకి వర్ష సూచన.. మరింత బలపడనున్న అల్పపీడనం, తెలంగాణలో ప్రభావం ఇలా..
వైరల్ అవుతున్న తప్పుడు ఆడియో టేపు గురించి తనకు ఎవరో ఫోన్ చేసి చెప్పడం వల్ల తెలిసిందని అన్నారు. ఇంకా ఎవరెవరో ఫోన్ చేసి అడుగుతుంటే బాధగా ఉంటోందని అన్నారు. ఈ విషయం తెలిసి తానే స్వయంగా విశాఖపట్నం నగర పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హాకికు ఫిర్యాదు చేశానని చెప్పారు. సైబర్ క్రైం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని, నిందితులెవరో పోలీసులే తేలుస్తారని మంత్రి వివరించారు. తాను రాజకీయంగా తనపై పోటీచేసిన ప్రత్యర్థులను కూడా మిత్రులుగానే చూసే వ్యక్తినని అన్నారు. దేవుడి ఆశీస్సులు, ప్రజల అభిమానం ఉన్నంతవరకు ఎవరూ తన ఎదుగుదలను అడ్డుకోలేరని చెప్పారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నట్లు మంత్రి చెప్పారు.
Also Read: Petrol-Diesel Price, 20 August: హైదరాబాద్‌లో స్థిరంగా పెట్రోల్ ధర.. మిగతా నగరాల్లో తాజా ధరలు ఇలా..
ఆడియోలో ఏముందంటే..
ఆడియోలో ఉన్న మాటల ప్రకారం.. ‘పిచ్చివేషాలు వేయకుండా ఇంటికి రా, నా మాట విను, అన్ని రకాలుగా బాగానే ఉంటది. అరగంటలో పంపించేస్తా.. చెప్పిన మాట విను. నా కోసం అరగంట సమయం కూడా కేటాయించలేవా? ఏం చేస్తున్నావ్? రాకపోతే నీ ఇష్టం.. వస్తే మంచి భవిష్యత్తు బాగుంటుంది’ అని ఓ మహిళతో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో టేపు గురువారం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేగింది. దీంతో ఇది రాజకీయవర్గాల్లోనూ చర్చకు దారి తీసింది.
Also Read: Hyderabad: ఇంట్లోకి చొరబడి దొంగతనం.. కానీ మంచోడట! అవాక్కైన బాధితుడు.. ఎలాగంటే..