Atchannaidu: నాలుగున్నరేళ్లలో రూ.40 వేల కోట్లు దోచింది ఎవరు జగన్ రెడ్డి? - అచ్చెన్నాయుడు ఫైర్
Atchannaidu: నాలుగున్నరేళ్లలో ఇసుక విక్రయాల పేరుతో రూ.40 వేల కోట్లు దోచింది ఎవరు జగన్ రెడ్డి? అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
Atchannaidu: నాలుగున్నరేళ్లలో ఇసుక విక్రయాల పేరుతో రూ.40 వేల కోట్లు దోచింది ఎవరు జగన్ రెడ్డి? అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఇసుక తవ్వకాల్లో అక్రమాల పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం కేసులు నమోదు చేయడాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు ఒక ప్రకటనలో వైసీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడుకు ప్రజల్లో ఉన్న ఆదరణను ఓర్వలేక జగన్ రెడ్డి ప్రభుత్వం రోజుకో కేసు నమోదు చేసి కక్ష పూరిత చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.
‘ఇసుకాసురుడు జగన్ రెడ్డి’
నాలుగున్నరేళ్ల నుంచి జగన్ రెడ్డి ల్యాండ్, శాండ్, వైన్, మైన్‌లలో చేసిన దోపిడి ఒక్కోటీ భయటపడుతుండటంతో వాటిని దోపిడిని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు నాయుడిపై రోజుకోక అక్రమ కేసు బనాయిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. టీడీపీ హయాంలో పారదర్శకంగా ఇచ్చిన ఉచిత ఇసుకను రద్దు చేసి, ఇసుక మాఫియా ద్వారా నాలుగున్నరేళ్లలో రూ.40 వేల కోట్లు దోచేసిన ఇసుకాసురుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. సిగ్గులేకుండా టీడీపీ హయాంలో ఇసుకలో అక్రమాలంటూ చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసు పెట్టడం దుర్మార్గపు చర్య అన్నారు.
‘ఇంతకంటే రుజువులు ఏం కావాలి’
జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే ఉచిత ఇసుక రద్దు చేసి దోపిడికీ తెరతీశారని అచ్చెన్న ఆరోపించారు. అధికారికంగా 110 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు అని చెబుతూ అనధికారికంగా 500కు పైగా రీచ్‌లలో ఇసుక దోపిడీ జరుగుతున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఉత్వర్వులిచ్చిందంటే జగన్ ఇసుక దోపిడికి ఇంతకంటే ఏం సాక్ష్యం కావాలని నిలదీశారు.
‘మీపై ఎన్ని కేసులు పెట్టాలి’
ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టారని, మరి పేదల కడుపు కొట్టి.. టన్నుకు రూ.1000 చొప్పున రూ.40 వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, జే గ్యాంగ్‌లపై ఏ కేసులు పెట్టాలి? వారిని ఏం చేయాలి? అని అచ్చెన్న ప్రశ్నించారు. ఉచిత ఇసుక విధానం రద్దు చేసి, 40 లక్షల మంది కార్మికుల్ని రోడ్డున పడేసి 160 మంది భవన నిర్మాణ కార్మికుల్ని బలిగొన్న దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో 3 సార్లు ఇసుక పాలసీ మార్చారని విమర్శించారు.
‘జగన్ కొత్త నాటకం’
అయిన వారికి దోచిపెట్టేందుకు జగన్ పాలసీలు మారుస్తున్నారంటూ ఆరోపించారు. తమ్ముడైన అనిల్ రెడ్డికి ఇసుక కాంట్రాక్టు కట్టబెట్టేందుకు జగన్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారని, ఏకంగా టెండర్ డాక్యుమెంట్ ధరను రూ.29.5 లక్షలుగా నిర్ధారించడమే కాకుండా టెండర్ నియమ నిబంధనలను మార్చేశారని విమర్శించారు. ఉన్న ఆరు నెలల్లో రాష్ట్రంలో ఉన్న ఇసుకంతా దోచేయాలన్నదే జగన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని, అందుకే ఈ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ప్రకృతి ప్రసాదించిన సహజవనరులైన ఇసుకతో పాటు బైరైటీస్, బాక్సైట్, లేటరైట్, రాక్సీ గ్రానైట్, సిలికా దేనిని జే గ్యాంగ్ దేనిని వదలటం లేదని, అన్నీ దోచేస్తున్నారని ఆరోపించారు.
జన సునామీలో కొట్టుకుపోవడం ఖాయం
జగన్ ఇసుక దోపిడి చేస్తూ చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు అవినీతి చేస్తే నాలుగున్నరేళ్ల నుంచి మీరేం చేశారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో నిజయితీగా గెలిచే సత్తా లేకనే వైసీపీ అక్రమ కేసులు బనాయించి చంద్రబాబుని జైల్లో నిర్భందించాలని ప్రణాళిక రూపొందించిందని ఆరోపించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజా బలం ఉన్నంతవరకు చంద్రబాబును ఏమీ చేయలేరని అన్నారు. రాజమండ్రి, విజయవాడ ర్యాలీకి వచ్చిన జన సునామీలో వైసీపీ కొట్టుకుపోవటం ఖాయమన్నారు.