Dharmana Prasadarao: వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనాలని పిలుపు - మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు
Telugu Desam Party: మంత్రి ధర్మాన ప్రసాదరావుపై ఈసీకి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Atchannaidu Complaint To EC Against Minister Dharmana: రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఎన్నికల విధుల్లో వాలంటీర్లు కూడా పాల్గొనవచ్చంటూ ఇటీవల ఓ సమావేశంలో ధర్మాన చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీశాయి. ఆయన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఇప్పటికే ఈసీతో పాటు కోర్టులు కూడా స్పష్టం చేశాయి. కానీ ఈసీ ఆదేశాలను పట్టించుకోకుండా వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనవచ్చని ధర్మాన చెప్పడం వివాదానికి దారితీసింది. ఈసీ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారంటూ ధర్మానపై గురువారం ఈసీకి ప్రతిపక్ష టీడీపీ ఫిర్యాదు చేసింది.
అచ్చెన్నాయుడు లేఖ
ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ ద్వారా కంప్లైంట్ చేశారు. ఈసీ చెప్పిన తర్వాత కూడా వాలంటీర్లు విధుల్లో పాల్గొనాలని మంత్రి చేసిన వ్యాఖ్యలను లేఖలో ప్రస్తావించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించిన మంత్రిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వానికి అనుకూలంగా వాలంటీర్లు పనిచేయాలని బహిరంగంగా చెప్పడం ఈసీ ఆదేశాలను ఉల్లంఘించడమేనని, వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని అచ్చెన్నాయుడు కోరారు. వైసీపీ నేతలు ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింట్ దరఖాస్తు ప్రక్రియలో వాలంటీర్ల ప్రమేయం లేకుండా చేయాలని, దీనిపై సీఈవో, డీఈవో, ఆర్వోలకు ఆదేశాలు ఇవ్వాలని అచ్చెన్నాయుడు కోరారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనాలని ప్రోత్సహించేలా మంత్రులే వ్యాఖ్యలు చేయడం ఈసీ నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు. వాలంటీర్లను ఏజెంట్లుగా పెట్టుకోవాలని వైసీపీ చూస్తోందని, అలా జరగకుండా చూడాలని కోరారు.
అయితే వాలంటీర్లకు పురస్కారాల ప్రదానోత్సవంలో భాగంగా ఇటీవల శ్రీకాకుళం జల్లాలో జరిగిన కార్యక్రమంలో ధర్మాన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాలంటీర్లకు సర్వీస్ రూల్స్ లేవని, అవసరమైతే ఏజెంట్లుగా పోలింగ్ బూత్‌లో కూర్చోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. వృద్దులకు దగ్గరుండి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం అప్లై చేయించాలని కోరారు. మీకు ఇష్టమైన వారికి ఓటు వేయాలని ప్రజలు చెప్పే హక్కు వాలంటీర్లకు ఉందని, ఏ ప్రభుత్వం ఆకలి తీర్చిందో వారికి ఓటు వేయాలని వాలంటీర్లు చెప్పాలని పిలుపునిచ్చారు. వృద్దులు ఇతర పార్టీలకు ఓటు వేయరని, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించాలని వృద్దులకు చెప్పాలని వాలంటీర్లకు మంత్రి ధర్మాన సూచించారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించిని వ్యక్తులు వాలంటీర్లు అని ప్రశంసించారు.
ధర్మాన వ్యాఖ్యలపై టీడీపీ మండిపడుతోంది. వాలంటీర్లను ఎన్నికల్లో ఉపయోగించుకుని లబ్ధి పొందాలని వైసీపీ చూస్తోందని ఆరోపిస్తున్నారు. కాగా ఇటీవల సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోవాలనే వ్యవహారంపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రధాన విధులు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించవద్దనది, చేతికి ఇంకు పూసే పని మాత్రమే అప్పగించాలని అన్ని జిల్లాలకు అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.