APSRTC Sankranti Buses: సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ 1266 స్పెషల్ బస్సులు... హైదరాబాద్ నుంచి 362 సర్వీసులు... ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు
సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఏపీఎస్ ఆర్టీసీ 1266 స్పెషల్ బస్సులు నడపనుంది. విజయవాడ, హైదరాబాద్ మధ్య 362 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
సంక్రాంతి పండుగకు పల్లెలు సిద్ధమవుతున్నాయి. భోగి మంటలు, కోళ్ల పందేలు, పిండి వంటలతో కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి జరుపుకునేందుకు చాలా మంది పల్లెలకు క్యూకడతారు. ఉద్యోగాల నిమ్మిత్తం పట్టణాలకు వచ్చిన వారు ఏడాదికొకసారైనా సొంత ఊరికి వెళ్లాలని భావిస్తుంటారు. సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. సంక్రాంతి సమయంలో టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుందంటుంది. పండుగకు ఊర్లకు వెళ్లే వారు ముఖ్యంగా ప్రజారవాణాపైనే ఆధారపడుతుంటారు. దీంతో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ పండుగ స్పెషల్ బస్సులు ఏర్పాటుచేస్తాయి. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ బస్సులు ఏర్పాటుచేసింది.
Also Read: క్రిస్మస్ ని డిఫరెంట్ గా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..
సంక్రాంతికి స్పెషల్ బస్సులు
పట్టణాల నుంచి సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్లే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ 1266 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసింది. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమండ్రి తదితర ప్రాంతాలకు పండుగ స్పెషల్ బస్సులు తిరగనున్నాయి. జనవరి 7 నుంచి 17 వరకు ప్రత్యేక బస్సులను నడపనున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు 362 ప్రత్యేక బస్సులు, బెంగళూరు 14, చెన్నై 20 ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరానికి 390 బస్సులు, విజయవాడ, రాజమండ్రి మధ్య 360 బస్సులు నడవనున్నాయి. ఇతర ప్రాంతాలకు 120 బస్సులు నడుస్తాయని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రత్యేక బస్సుల్లో ముందస్తుగా టికెట్ రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రయాణికులు ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.
Also Read: కొంచెం తీపి.. ఏంతో చేదు ! 2021లో ఆంధ్రప్రదేశ్ మైలు రాళ్లేంటి ? మర్చిపోవాల్సినవి ఏంటి ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి