APPSC Recruitment 2021: ఏపీలో కొత్తగా 1,180 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 1,180 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆయుష్, రెవెన్యూ శాఖలతో పాటు పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 1,180 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆయుష్, రెవెన్యూ శాఖలతో పాటు పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులను జాబ్ క్యాలెండర్‌లో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. వీటి భర్తీ ప్రక్రియ చేపట్టాల్సిందిగా ఏపీపీఎస్సీని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టు నెలలో వచ్చే అవకాశం ఉంది.
కాగా.. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్ సలాంబాబు గతంలో వెల్లడించారు. గ్రూప్ 1, 2 సహా పలు విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు గుర్తించామని.. పోస్టుల సంఖ్య పెంచి ఆగస్టులో గ్రూప్స్ సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు.
ఏపీ ప్రభుత్వం ఇటీవల జాబ్‌క్యాలెండర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పోస్టులు తక్కువగా ఉన్నాయని కొత్త జాబ్ క్యాలెండర్‌ను రూపొందించి విడుదల చేయాలని నిరుద్యోగులు పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు.
జాబ్ క్యాలెండర్ ద్వారా 10,143 ఉద్యోగాల భర్తీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 10,143 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన జాబ్ క్యాలెండర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ క్యాలెండర్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 2022 మార్చి వరకు భర్తీ చేయబోయే ఉద్యోగాల వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీలో ఎలాంటి పైరవీలకు తావు లేదని స్పష్టం చేశారు. రాత పరీక్షలో పొందిన మెరిట్ ప్రాతిపదికన మాత్రమే అర్హులను ఎంపిక చేస్తామని, ఇంటర్వ్యూ ఉండదని జగన్ తెలిపారు.
మరింత చదవండి.. ఏపీ జాబ్ క్యాలెండర్ విడుదల.. 10,143 ఉద్యోగాల భర్తీ..