AP News : జనావాసాల్లోకి వన్యమృగాలు, హడలెత్తిపోతున్న ప్రజలు
AP News : ఏపీలోని పలు జిల్లాల్లో వన్యమృగాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. పులి, ఎలుగుబంటి, ఏనుగుల హల్ చల్ వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. జనావాసాల్లోకి వన్యప్రాణులు రావడంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి.
AP News : కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం, శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి దాడులు, విజయనగరం, చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్ చల్ చేస్తున్నాయి. కాకినాడ జిల్లాలో రిజర్వ్ ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చిన రాయల్ బెంగాల్ టైగర్ నెల రోజులుగా ప్రత్తిపాడు, రౌతులపూడి మండలాల్లో మకాం వేసింది. అటవీ అధికారులు, పోలీసులను ముప్పుతిప్పలు పెడుతూ రెండు మండలాలు తిప్పింది. బోనులకు చిక్కకుండా పశువులపై దాడుల చేస్తుంది. ఈ మండలాల్లోని గ్రామస్థులు ఎప్పుడు ఏ పక్క నుంచి పెద్ద పులి దాడి చేస్తుందో అని హడలిపోతున్నారు. తమకు పోషణాధారం అయిన పశువులు కాపాడుకునేందుకు నానా అవస్థతలు పడుతున్నారు. పొలం పనులకు వెళ్లడానికి లేకుండాపోయిందని, బయటకు వెళ్లాలంటే భయంగా ఉందని వాపోతున్నారు. పెద్ద పులి సంచారంతో ఆందోళనలో ఉన్న గ్రామస్థులకు ఇప్పుడు పుకార్లు మరింత భయపెడుతున్నాయి. అదిగో పులి , ఇదిగో పులి అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఎలుగుబంటి దాడులు
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు పరిసర గ్రామాల్లో ఎలుగుబంటి గ్రామస్థులపై దాడి చేసింది. ఈ దాడిలో ఒక రైతు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమీప అటవీ ప్రాంతం నుంచి గ్రామాల్లోకి వచ్చి కనిపించిన వారిపై దాడులు చేస్తుంది. ఎలుగు బంటి దాడులు వరుసగా జరుగుతున్నా అటవీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం పొలం పనులకు వెళ్లాలన్నా, ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా భయంగా ఉందని చెబుతున్నారు. ఎలుగుబంటి ఎక్కడ తమపై దాడి చేస్తుందోనన్న భయమే వారిని ఏ పని చేయకుండా చేస్తుందని వాపోతున్నారు. వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామంలో ఎలుగుబంటి చేసిన దాడిలో కలమట కోదండ రావు(50) అనే అన్నదాత మృతి చెందాడు.
ఏనుగులు హల్ చల్
విజయనగరం జిల్లాలో ఏనుగులు హల్ చల్ చేశాయి. ఐదు ఏనుగులు కళ్లికోట గ్రామంలోనూ, ఒక ఏనుగు స్వామి నాయుడు వలస గ్రామంలో విధ్వంసం సృష్టించాయి. కళ్లికోట గ్రామంలో గురువారం రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఐదు ఏనుగులు విధ్వంసం సృష్టించాయి. రేషన్ వ్యాను, లగేజీ వ్యాను, ఓ కారు ధ్వంసం చేశాయి. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ఒంటరి ఏనుగు హల్ చల్ చేసింది. శుక్రవారం సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డుకు అనుకోని ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు ఒక్కసారిగా ఘాట్ రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించింది. ఒంటరి ఏనుగు ఘీంకారాలకు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. ఎలిఫెంట్ ఆర్చ్ కు సమీపంలో ఒంటరి ఏనుగును చూసిన వాహన చోదకులు వాహనాల ఇంజెన్స్ నిలిపివేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజిలెన్స్ సిబ్బంది వెంటనే అటవీ శాఖా అధికారులకు సమాచారాన్ని అందించారు. వెంటనే అక్కడ చేరుకున్న అటవీ శాఖ అధికారులు భారీగా సైరన్ మోగించి ఒంటరి ఏనుగును అటవీ ప్రాంతంలో పంపే ప్రయత్నం చేస్తున్నారు. తరచూ అదే ప్రాంతంలో ఏనుగులు సంచరించడం గమనార్హం.
చిత్తూరు జిల్లాలో ఏనుగులు
చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య ఇటీవల ఎక్కువైంది. కొన్ని రోజులుగా మామిడి తోటలను ధ్వంసం చేయడంతో పాటు పొలాల్లోని మోటార్లను నాశనం చేస్తున్నాయి. రాత్రుల్లో పంట పొలాల దగ్గర ఉంటున్న రైతులపై దాడి చేస్తున్నాయి. ఈ దాడిలో రైతులు ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. అటవీ అధికారులు ఏనుగుల గుంపులను అటవీ ప్రాంతాల్లోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాత్రుళ్లు ఒంటరిగా పొలాలకు వెళ్లోద్దని అంటున్నారు. ఏనుగుల గుంపు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఉండాలని కోరుతున్నారు.
పలు కారణాలు!
అటవీ ప్రాంతాల్లోకి జనావాసాలు చొచ్చుకుపోవడంతో వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తున్నాయన్న వాదన లేకపోలేదు. మైనింగ్, కలప, ఇతర అవసరాలకు అడవులను విచక్షణారహితంగా కొట్టేయడంతో వన్యప్రాణులు నివాస ప్రాంతాల్లోకి తరచూ వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. అలాగే నీటి కొరత ప్రధాన కారణంగా అడవి జంతువులు సమీప గ్రామాల్లోకి చొరబడుతున్నాయని తెలుస్తోంది. అభివృద్ధి పేరుతో అడవులను నరికివేయడంతో ఈ సమస్య వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.