AP MLAs Disqualified: 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన ఏపీ స్పీకర్
AP MLAs disqualification News: ఏపీ అసెంబ్లీ స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. న్యాయ నిపుణుల సలహాతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
AP speaker Tammineni disqualifies 8 MLAs: 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అనర్హత పిటిషన్ లపై స్పీకర్ తమ్మినేని విచారణను ముగించారు. వైసీపి, టీడిపి పార్టీలు ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరవాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి స్పీకర్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ పిటిషన్‌తో ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై అనర్హత వేటు వేశారు. టీడీపీ పిటిషన్‌తో మద్దాలగిరి, కరణం బలరాం, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌పై వేటు వేశారు.
ఇటీవల రాజ్యసభ ఎన్నికల సమయంలో అధికార వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు సందర్భంగా పార్టీ లైన్ దాటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓట్లేశారంటూ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆ తరువాత వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అనూహ్యంగా రాజ్యసభ ఎన్నికల టైంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై చర్యలకు అధికార పార్టీ సిద్ధమైంది. ఈ మేరకు స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో స్పీకర్ కార్యాలయం వారికి నోటీసులు పంపించింది. అదే సమయంలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీతో సన్నిహితంగా మెలిగిన వారికి స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందాయి. రెండు పార్టీలకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ కార్యాలయంలో విచారించారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తరువాత స్పీకర్ తమ్మినేని 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు.
ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకుగానూ అధికార పార్టీ ఇదివరకే 7 విడతలుగా ఇంఛార్జ్ ల జాబితాలను విడుదల చేసింది. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీతో పొత్తుతో ఎన్నికలకు వెళ్తోంది. టీడీపీ, జనసేన తొలి విడత అభ్యర్థులుగా 99 మంది పేర్లను శనివారం ప్రకటించారు. ఇందులో 94 మంది టీడీపీ అభ్యర్థులు కాగా, జనసేన నుంచి 5 మంది ఉన్నారు.