AP Power Charges Hike : ఏసీల వాడకాన్ని తగ్గించి ఫ్యాన్లు వేసుకోండి, విద్యుత్ వినియోగంపై అధికారుల సలహాలు
AP Power Charges Hike : ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై పెద్ద రగడే జరుగుతోంది. విపక్షాలు లాంతర్లు, విసనకర్రలతో నిరసలు చేస్తున్నాయి. అయితే విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సెలవిచ్చారు విద్యుత్ అధికారులు.
AP Power Charges Hike : ఏపీలో వేసవి కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిపోతుందని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథ్ రావు అన్నారు. విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన సూచించారు. ఏసీలు, వాషింగ్ మిషీన్ల వాడకాన్ని తగ్గించాలని, ఫ్యాన్లు మాత్రమే వేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ఉదయం 5 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 10 వరకు విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదు అవుతుందని ఆయన చెప్పారు. ప్రజలు ఏసీలు వినియోగం తగ్గించి సహకరించాలని కోరారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగినా కోతలుండవని వెల్లడించారు. విద్యుత్ వాడకంలో ప్రజలు నియంత్రణ పాటించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. కానీ రాష్ట్రంలో అనధికారిక కోతలు విధిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
లాంతర్లు, విసనకర్రలతో విపక్షాల నిరసనలు
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. సీఎం జగన్ ఉగాది కానుక విద్యుత్ ఛార్జీల పెంపు అని ఎద్దేవా చేశారు. లాంతర్లు, విసనకర్రలు పట్టుకుని వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేశారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లే పరిస్థితి వచ్చిందని, విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న జగన్ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని టీడీపీ ఆరోపించింది. గిరాగిరా తిరుగుతుందని ఫ్యాన్ గుర్తుకి ఓట్లేసిన జనాలు ఇప్పుడు ఫ్యాన్ ఇచ్చిన షాక్ తో విలవిల్లాడిపోతున్నారని జనసేన విమర్శిస్తుంది. ఎన్నికల ముందు బాదుడే బాదుడు అంటే జగన్ గెలిస్తే విద్యుత్ ఛార్జీలతో బాదేస్తారని తాము అర్థం చేసుకోలేదని జనసేన నేతలు చెప్పారు. ఉగాది కానుకగా పేద, మధ్యతరగతి జనాలకు భారీ షాక్ ఇచ్చిన జగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధనార్జనే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని, ఉదయం లేస్తే కొత్త పన్ను విధిస్తారేమోనని జనం భయపడిపోతున్నారని అన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
అనివార్యమై స్వల్పంగా పెంచాల్సి వచ్చింది : అంబటి రాంబాబు
గత మూడేళ్లుగా చంద్రబాబుకు షడ్రుచుల ఉగాది పచ్చడిలో చేదు మాత్రమే తగులుతుందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు కాలంలో వచ్చిన తెలుగు సంవత్సరాది పేర్లు దుర్ముఖి, వికారి అనే వికారమైన పేర్లతో తెలుగు సంవత్సరాదులు వచ్చాయని, అదే జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఫ్లవ నామ సంవత్సరం, శుభకృత్ సంవత్సరం రావడం మంచి పరిణామం అన్నారు. జగన్ పరిపాలనలో గ్రామాల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతోందన్నారు. స్వల్పంగా విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దేశవ్యాప్తంగా అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకున్న కారణంగా గత రెండేళ్ల నుంచి కరోనా వల్ల ఆదాయాలు పడిపోయాయన్నారు. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోందని, దీనివల్ల బొగ్గు రేట్లు, రవాణా చార్జీలు పెరిగిపోయాయని అంబటి రాంబాబు అన్నారు. తెలంగాణాలో మాదిరిగా ఏపీకి సొంత బొగ్గు గనులు లేవన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అనివార్యంగా స‍్వల్పంగా ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.