Weather News: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, ఆదివారం తీరం దాటనున్న రెమాల్: IMD అలర్ట్
AP weather: తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. ఆదివారం అర్దరాత్రి సాగర్ ద్వీపం- ఖేపుపరా మధ్య రెమాల్ తుపాను తీరం దాటనుందని భారత వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
Rains In Andhra Pradesh and Telangana Weather News Updates: అమరావతి: తూర్పు మధ్య బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్ర వాయుగుండం శనివారం (మే 25) రాత్రి తుపానుగా బలపడుతోంది. ఈ తుపానుకు ఒమన్ ''రెమాల్'' గా నామకరణం చేసింది. రెమాల్ తుపాను ఉత్తరం వైపు కదులుతూ ఆదివారం ఉదయానికి తీవ్రతుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆదివారం అర్ధరాత్రి బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో సాగర్ ద్వీపం- ఖేపుపరా మధ్య రెమాల్ తుపాను తీరం దాటే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏపీ విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. మత్స్యకారులు సోమవారం (మే 27) వరకు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.
ఒకేసారి రెండు ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు
ఉపరితల ఆవర్తనం దక్షిణ కేరళ పరిసరాల్లో సముద్ర మట్టానికి సగటున 5.8కిమీ విస్తరించి ఉంది. అదే సమయంలో మరో ఉపరితల ఆవర్తనం ఈశాన్య మధ్యప్రదేశ్ సమీపంలో విస్తరించిందని కూర్మనాథ్ తెలిపారు. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని చెప్పారు. రెండు ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడన ద్రోణుల ప్రభావంతో ఆదివారం (మే 26) ఆంధ్రప్రదేశ్‌లో పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు కురుస్తాయి కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
శనివారం సాయంత్రం 6 గంటల వరకు అనంతపురం జిల్లా రాయదుర్గంలో 38.5 మిమీ, విజయవాడ తూర్పులో 34.5 మిమీ, గుంటూరు జిల్లా తాడేపల్లిలో 30.5 మిమీ వర్షపాత నమోదైంది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 30.5 మిమీ, విజయవాడ సెంట్రల్ లో 30.2 మిమీ, కృష్ణా జిల్లా ఉంగుటూరులో 29.2 మిమీ, ఏలూరు జిల్లా నూజివీడులో 27.2మిమీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు కూర్మనాథ్ తెలిపారు.
తెలంగాణలో వేడెక్కుతున్న వాతావరణం, మరోవైపు వర్షాలు
తెలంగాణలో ఓ వైపు ఎండ కాస్తుంటే, మరోవైపు కొన్నిచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు రాకముందే వర్షాలు కురవడంతో తెలంగాణలో ఉష్ణోగ్రతలు దిగొచ్చాయి. కానీ వడగాల్పులు ప్రభావం అధికంగా ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాలో వర్షాలు కురవనున్నాయి. దాంతో పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెయిన్ అలర్ట్ జారీ చేసింది. శనివారం అర్ధరాత్రిగానీ, ఆదివారంగానీ హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షం కురవనుంది.
ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవనుండగా, కొన్నిచోట్ల ఎండ దెబ్బకు భారీ ఉష్ణోగ్రతతో వడగాల్పులు వీచనున్నాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్డ్ జారీ చేశారు. ఉత్తర తెలంగాణలో ఎండల తీవ్రత అధికంగా ఉండనుంది.