Andhra Social Media: సజ్జల భార్గవపై లుకౌట్ నోటీసులు జారీ - సోషల్ మీడియా కేసుల్లో కడప పోలీసులు అరెస్ట్ చేసే చాన్స్
Andhra Pradesh: వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జల భార్గవ విదేశాలకు పారిపోకుడా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కడప పోలీసులు ఆయనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Sajjala Bhargava lookout notices : ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కేసులపై పోలీసులు తీవ్రంగా చర్యలు తీసుకుంటున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే పోస్టులు పెట్టిన వారు, బూతులతో విరుచుకుపడిన వారు, మార్ఫింగ్ పోస్టులు పెట్టిన వారందరితో ఆ పని చేయించింది వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ గా పని చేసిన సజ్జల భార్గవ అని పోలీసులు గుర్తించారు. కడపలో వర్రా రవీంద్రారెడ్డిని అరెస్టు చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో డీఐజీ కోయ ప్రవీణ్ ఈ విషయాన్ని ప్రకటించారు. సజ్జల భార్గవరెడ్డి ఏ వన్ గా కేసులు నమోదయ్యాయి. దాంతో ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read; బూతులు మాట్లాడారో! మీ కెరీర్ ఖతం : ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్
సజ్జల భార్గవరెడ్డితో పాటు అర్జున్ రెడ్డి అనే మరో వ్యక్తి విదేశాలకు పారిపోకుండా ముందస్తుగా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ లుకౌట్ నోటీసులు ఉంటే విమానాశ్రయాల నుంచి ఎక్కడికి అయినా వెళ్లాలనుకుంటే ఇమ్మిగ్రేషన్ సిబ్బంది ఆపేసి ఏపీ పోలీసులకు సమాచారం ఇస్తారు. సజ్జల భార్గవపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. సజ్జల భార్గవ ప్రస్తుతానికి వైసీపీ సోషల్ మీడియాకు ఇంచార్జిగా ఉన్నారో లేదో స్పష్టత లేదు. ఎన్నికల ఫలితాల తర్వతా సజ్జల భార్గవ పెద్దగా బయట కనిపించలేదు. ఇటీవల సోషల్ మీడియాకు ఇంచార్జ్‌గా దొడ్డా అంజిరెడ్డి అనే వ్యక్తిని ప్రకటించినట్లుగా చెబుతున్నారు.
సజ్జల భార్గవ రెడ్డి గతంలో వైసీపీలో లేరు. ఆయన వైసీపీలో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు. పార్టీ విజయం సాధించినప్పుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ఇంచార్జ్ గా ఉండేవారు. తర్వాత ఆ బాధ్యతల నుంచి విజయసాయిరెడ్డిని తప్పించి సజ్జల భార్గవరెడ్డికి ఇచ్చారు. ఆయన నేతృత్వంలో వైసీపీ సోషల్ మీడియా అన్ని గీతలను దాటేసి అసభ్యంగా తయారయిందన్న ఆరోపణలు వచ్చాయి. పార్టీ ఓడిపోవడంతో కొత్త ప్రభుత్వం కేసులు పెడుతుందన్న ఉద్దేశంతోనే ఆయన సైలెంట్ గా వెనక్కి తగ్గారని అంటున్నారు. అయినా ఆయనపై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి.
సజ్జల భార్గవ రెడ్డి ఎప్పుడో భారత్ వదిలి వెళ్లారని ఆయన చాలా రోజుల నుంచి విదేశాల్లోనే ఉంటున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దానికి సాక్ష్యంగా ఇటీవల ఎక్కడా ఆయన బయట కనిపించలేదని అంటున్నారు. మరో వైపు సోషల్ మీడియా అరెస్టులపై వైసీపీ విరుచుకుపడుతోంది. తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మానవ హక్కుల సంఘాలకు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. పలు కేసుల్లో అరెస్ట్ అయిన ఇంటూరి రవికిరణ్ అనే సోషల్ మీడియా కార్యకర్త కుటుంబసభ్యులను వైసీపీ అధినేత జగన్ పిలిపించుకుని భరోసా ఇచ్చారు. అండగా ఉంటామన్నారు.
Also Read: తెరపైకి డిజిటల్ కార్పొరేషన్ స్కామ్ - సోషల్ మీడియా కేసుల్లో అరెస్టయిన వారికి జీతాలుగా ప్రజాధనం ?