AP MLC Death: ఏపీ ఎమ్మెల్సీ సాబ్జీ మరణం పక్కా ప్లాన్‌తో చేసిన హత్యే - ఫ్యామిలీ సంచలన ఆరోపణలు
AP MLC Death: షేక్ సాబ్జీ కుమారుడు మాట్లాడుతూ.. తన నాన్నను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని.. తన తండ్రి మృతిపై అనుమానాలు ఉన్నాయని అన్నారు.
MLC Death News: ఏపీకి చెందిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. తన తమ్ముడి మరణం ప్రమాదం కాదని.. ప్లాన్ చేసి తన తమ్ముడిని చంపారని షేక్ సాబ్జీ సోదరుడు ఆరోపించారు. తన తమ్ముడిపై కక్ష గట్టి.. హత్య చేశారని అన్నారు. షేక్ సాబ్జీ కుమారుడు మాట్లాడుతూ.. తన నాన్నను చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని.. తన తండ్రి మృతిపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన విధానంలోనూ అనుమానాలు ఉన్నాయని.. ఎదుటి వాహనం తన తండ్రి కూర్చొన్న వైపే ఢీకొందని అన్నారు.
ఉండి సమీపంలో రోడ్డు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ చనిపోయారు. ఉండి వద్ద ఓ కారును మరో కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. షేక్ సాబ్జీ ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్ తరపున 2021లో విజయం సాధించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న షేక్ సాబ్జి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం విస్తృతంగా శ్రమించారు. ఏలూరులో అంగన్ వాడీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపి భీమవరం వెళ్తుండగా .. ఈ కారు ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తర్వాత తీవ్ర గాయాల పాలైన ఆయనను ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయారు.
ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా వస్తున్న కారు అదుపుతప్పి వీరి కారు ను ఢీకొనడంతో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ఘటన స్థలంలోనే ఎమ్మెల్సీ మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. గన్‌మెన్‌కి కూడా గాయాలయ్యాయి. వారిని భీమవరం ఆసుపత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధూమంతుని గూడెం గ్రామం.
గుంతల వల్లే కారు అదుపు తప్పిందా?
ఏలూరు - భీమవరం మధ్య రోడ్డు భారీగా గుంతలు పడి ఉంటుంది. ఈ కారణంగా వాహనాలు అదుపు తప్పుతున్నాయని కొంత కాలంగా వాహనదారులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్సీ కారుకు ఎదురుగా వస్తున్న వాహనం కూడా రోడ్ గంతల కారణంగానే అదుపు తప్పినట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.
ఎమ్మెల్సీ సాబ్జీ మృదు స్వభావి. ఉపాధ్యాయుల హక్కుల కోసం ఆయన పోరాడుతూనే ఉన్నారు. గురువుగా ఆయన ఉద్యమంలో కూడా అదే రీతిన వ్యవహరించారు. అందుకే 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన ఏకపక్షంగా గెలిచారు. పలువురు పోటీ పడినప్పటికీ రెండు రౌండ్లలోనే విజయానికి కావాల్సిన యాభై శాతం ఓట్లను సాధించారు. ఆయన మృతితో ఉపాధ్యాయ సంఘాలన్నీ దిగ్భ్రాంతికి గురవుతున్నాయి. మంచి నాయకుడ్ని ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కోల్పోయాయని అనుకుంటున్నాయి.