(Source: ECI/ABP News/ABP Majha)
KTR News: మీరు ఒకజాతి పక్షులే, సర్టిఫికేట్’ లు ఇచ్చుకోండి - కేటీఆర్‌పై ఏపీ మంత్రి సెటైర్లు
Telugu News: ‘‘అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని, మీ ప్రియ మిత్రులు జగన్, కేతిరెడ్డిని ముంచాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు సర్టిఫికేట్లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి’’ అని ఏపీ మంత్రి సెటైర్లు వేశారు.
AP Minister on KTR: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఏపీ మాజీ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి అసలు ఎలా ఓడిపోయారో అర్థం కావడం లేదని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ సెటైర్లు వేశారు. అంతేకాక, తనను కేటీఆర్ గతంలో ఓసారి బ్లాక్ చేశారని కూడా సత్యకుమార్ యాదవ్ గుర్తు చేశారు.
ఏపీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ఓటమి, ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఓడిపోవడంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ.. కేటీఆర్ చిలకపలుకులు పలుకుతున్నారని అన్నారు. ఏపీలో వైఎఎస్ఆర్ సీపీ ఓడిపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని.. అలాగే ఎప్పుడూ ప్రజల్లో ఉండే కేతిరెడ్డి.. ధర్మవరంలో ఎలా ఓడిపోయారో తెలియడం లేదని కేటీఆర్ అన్నారు. దీనిపై సత్యకుమార్ సెటైర్ వేస్తూ.. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో భూములను ఎలా కాజేశారో ధర్మవరం ప్రజల్ని అడగాలని కేటీఆర్ కు సూచించారు.
‘‘ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారు. ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియా లాగానే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూభకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను కూడా కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా-కలెక్షన్-కరప్షన్-కమీషన్లే.
ఫాంహౌస్ కు పరిమితమైన మీరు X లో అడిగినా ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు. మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు ట్విటర్ లో 4 సంవత్సరాల క్రితం నన్ను బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని, మీ ప్రియ మిత్రులు జగన్, కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు ‘సర్టిఫికేట్’ లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి’’ అని సత్యకుమార్ యాదవ్ సెటైర్లు వేశారు.
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమి పై తెలంగాణా మాజీ మంత్రి @KTRBRS చిలక పలుకులు పలుకుతున్నారు..
— Satya Kumar Yadav (@satyakumar_y) July 10, 2024
ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియా లాగానే ధర్మవరం లో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూభకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజలు ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు కొండలను… pic.twitter.com/Hb9wUTYuGB