Andhra Pradesh: ఏపీ ప్రజలకు శుభవార్త- రైతుబజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయం: నాదెండ్ల మనోహర్
Rice and Kandipappu at Rythu Bazar | ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. జూలై 11 నుంచి రైతు బజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయించనున్నారు.
Nadendla Manohar About Ration Items: అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డు దారులకు తక్కువ ధరకు కందిపప్పు, బియ్యం విక్రయించడంపై ఫోకస్ చేసింది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రేషన్ దుకాణాలలో సరుకుల పంపిణీ, నాణ్యత పరిశీలిస్తూ అధికారులను పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ఏపీ ప్రజలకు మంత్రి నాదెండ్ల శుభవార్త చెప్పారు. జులై 11 నుంచి రేషన్ షాపుల్లో తక్కువ ధరకు కందిపప్పు, బియ్యం సరఫరా చేయడానికి నిర్ణయించారు.
రాష్ట్రంలో ధరల స్థిరీకరణపై జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్ష నిర్వహించారు. సామాన్యులకు బియ్యం, కందిపప్పు తక్కువ ధరలకే ఇచ్చేలా చేయడంలో భాగంగా వ్యాపారులతో సమావేశమయ్యారు. బ్లాక్ మార్కెట్ లో విక్రయాలు లాంటివి చేయవద్దని సూచించారు. జులై 11 నుంచి రైతు బజార్లలో బియ్యం, కందిపప్పు విక్రయించనున్నట్లు మంత్రి నాదెండ్ల తెలిపారు. రూ.160 కిలో కందిపప్పు, రూ.49కే స్టీమ్డ్ రైస్, రూ.48కి ముడి బియ్యం విక్రయించాలని మంత్రి నాదెండ్ల నిర్ణయించారు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ కందిపప్పు రూ.180 ఉండగా, స్టీమ్డ్ రైస్ రూ.55, 56 ఉంది. ముడి బియ్యం కేజీ ధర రూ.52.40కి విక్రయాలు జరుగుతున్నాయి.
బియ్యం అక్రమాల కేసు సీఐడీకి అప్పగింత
కాకినాడ కేంద్రంగా రేషన్ బియ్యం అక్రమాలను చంద్రబాబు ప్రభుత్వం కదుపుతోంది. ధాన్యం కొనుగోళ్ల నుంచి మిల్లర్లు ఎగుమతుల వరకు రేషన్ బియ్యం సేకరించి మళ్లీ ఆ బియ్యాన్ని రీసైకిల్ చేసి ఎగుమతులు చేశారని ఏపీ ప్రభుత్వం గుర్తించింది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపడిని ఇరుకున పెట్టేలా మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడలో రివ్వూల నుంచి తనిఖీలు చేశారు. సివిల్ సప్లై అధికారులు నాదెండ్ల దూకుడు చూసి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ చేపట్టిన తనిఖీల్లో బియ్యం ఎగుమతుల అనేక అక్రమాలు వెలుగుచూశాయి. త్వరలోనే వీటి వివరాలు బయట పెట్టి, అక్రమార్కుల ఆట కట్టిస్తామని సైతం ఏపీ ప్రభుత్వం హెచ్చరించింది. తనిఖీల వ్యవహారం అప్ డేట్స్, ముందస్తు సమాచారాన్ని అధికారులు చేరవేస్తున్నారని గుర్తించిన మంత్రి వారిని హెచ్చరించారని గట్టిగానే వినిపిస్తోంది. బియ్యం అక్రమాల కేసుపై సీఐడీ దర్యాప్తు చేపట్టి నిజాలు బయటకు తేనుందని ఏపీ మంత్రులు చెబుతున్నారు.