AP Pensions: దివ్యాంగుల పింఛన్లపై ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్, తొలగించలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్లారిటీ
Pensions for Disabled in Andhra Pradesh | ఏపీలో దివ్యాంగుల పింఛన్లు తొలగించారని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఎవరి పింఛన్లు కట్ చేయలేదని తెలిపారు.

Andhra Pradesh News | అమరావతి: ఏపీ ప్రభుత్వం వేలాది దివ్యాంగ పింఛన్లు తొలగించిందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు నోటీసులు ఇచ్చిందని తెలుస్తోంది. దాని ప్రకారం వారు పింఛన్ అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్ అధికారులకు సమర్పించాలని అధికారులు వారికి సూచించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు తొలగించిందని, సెప్టెంబర్ నుంచే అమలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న క్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దివ్యాంగులకు శుభవార్త చెప్పారు.
అందరికీ పింఛన్లు ఇవ్వాలని చంద్రబాబు ఆదేశాలు
నోటీసులు అందుకున్న దివ్యాంగ పింఛన్ దారులందరికీ ఈ నెల పింఛన్లు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. నోటీసులు అందుకున్న దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారని ఇందుకు సంబంధించి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబర్ 1న ఉదయం నుంచే యథావిధిగా సచివాలయ సిబ్బంది పింఛన్ పంపిణీ ప్రారంభించనున్నారని ఆయన వెల్లడించారు. పింఛన్ పంపిణీ ప్రక్రియ పూర్తయ్యే వరకు గ్రామ, మండల స్థాయి అధికారులకు ఎలాంటి సెలవులు ఉండవని ఆయన తెలిపారు.
వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోంది
దివ్యాంగుల పింఛన్ తొలగింపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్ కచ్చితంగా అందుతుందని మంత్రి కొండపల్లి స్పష్టం చేశారు. అంగ వైకల్యానికి సంబంధించి సర్టిఫికెట్ సమర్పించిన అర్హులైన లబ్ధిదారుల పింఛన్లను కూటమి ప్రభుత్వం ఎన్నటికీ తొలగించదన్నారు.






















