AP Hates Jagan : చెప్పిన హమీల్లో ఒక్కటీ అమలు చేయని సీఎం - ఏపీ హేట్స్ జగన్ పుస్తకం రిలీజ్ చేసిన టీడీపీ !
ఏపీ హేట్స్ జగన్ పుస్తకాన్ని టీడీపీ విడుదల చేసింది. ప్రజల్ని సీఎం జగన్ రాబందులా పీడించుకు తింటున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు.
AP Hates Jagan : ఏపీ హేట్స్ జగన్ పేరుతో టీడీపీ పుస్తకాన్ని విడుదల చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. విద్యుత్ ఛార్జీల భారం రూ.64 వేల కోట్లు వేశారని.. నాసిరకం మద్యంతో 35 లక్షల మందిని రోగాల బారిన పడేలా చేశారని పుస్తకంలో వివరించారు. రాష్ట్రాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా భ్రష్టు పట్టించారని ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు అన్నారు. నాసిరకం మద్యం వల్ల 30 వేలమంది ప్రాణాలు పోయాయన్నారు. ఉచిత ఇసుక విధానం రద్దు వల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని టీడీపీ ఆరోపించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని జగన్ చెప్పారని.. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దుచేస్తామన్నారు.. చేశారా? అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు.. ఇస్తున్నారా? 25 మంది ఎంపీలనిస్తే ప్రత్యేక హోదా తెస్తానన్నారు.. తెచ్చారా? – పోలవరం పూర్తి చేస్తానన్నారు.. చేశారా? అని ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో.. ఒక్కటైనా నెరవేర్చారా చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.5కే అన్నం పెడుతుంటే దాన్ని రద్దుచేసి పేదల కడుపు కొట్టారని మండిపడ్డారు. 2.30 లక్షల ఉద్యోగాలన్నారు.. నాలుగేళ్లు దాటింది.. ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును సున్నా నుంచి 74 శాతం పూర్తిచేశాము కానీ.. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరాన్ని పూర్తి చేయట్లేదన్నారు. ఉచితంగా ఇసుక ఇస్తుంటే రద్దుచేసి కార్మికుల పొట్టకొట్టారన్నారు. ఏడాదికి 5 లక్షల ఇళ్లన్నారు.. కనీసం 2 లక్షలు ఇళ్లైనా కట్టారా చెప్పాలన్నారు. చంద్రబాబును ఎలాంటి ఆధారం లేకుండా అక్రమ కేసులో అరెస్ట్ చేశారని, గత 40 రోజులుగా రాజమండ్రి జైల్లో ఎలా నిర్బంధించిందీ గవర్నర్ కి వివరించామని తెలిపారు.
బీసీల నోరునొక్కడమే జగన్ రెడ్డి లక్ష్యమా? అని అచ్చెన్నాయుడు ప్రశఅనించారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుపై వరుస కేసులు బనాయించిన బీసీల ద్రోహి జగన్ రెడ్డి అని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాలపై అరాచకాన్ని సృష్టిస్తున్న జగన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నందుకు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వరుస కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురి చేస్తూ జగన్ పెత్తందారి తనం మరొక సారి రుజువు చేసుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసన తెలిపినందుకు అక్రమ కేసు పెట్టడం హేయం. అన్ని కేసుల్లోనూ కాలవనే మొదటి ముద్దాయిగా చేర్చారు పోలీసులు. శాంతియుత నిరసనలపై పోలీసులు కావాలనే కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ చేసి మరీ చిందులేసిన వైసీపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చట్టం అందరికీ సమానమైనప్పుడు కేవలం ప్రతిపక్ష నాయకులపై కేసులెందుకు పెడుతున్నారు. ఆదివారం అర్ధరాత్రి రాయదుర్గం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉన్న టీడీపీ దీక్షా శిబిరాన్ని బలవంతంగా ఖాళీ చేయించారని మండిపడ్డారు అచ్చెన్నాయుడు.
వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయినింగ్‌కు కౌంటర్ గా ఏపీ హేట్స్ జగన్ పేరుతో జగన్‌కు కౌంటర్ క్యాంపెయిన్ చేయాలని నిర్ణయించారు. ఈ క్యాంపెయిన్ ద్వారా జగన్‌ను ఏపీ ప్రజలు ఎందుకు ద్వేషిస్తున్నారనే అంశాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ నిర్ణయానికి వచ్చినట్టు.. సోషల్ మీడియాలో కూడా ఏపీ హేట్స్ జగన్ అనే హ్యాష్ ట్యాగుతో ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంస్‌పై ప్రచారం చేపట్టనున్న టీడీపీ ప్రకటించింది.