APPSC: 28 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు పరీక్షలు.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ నెల 28వ తేదీ నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీపీఎస్సీ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరి రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రొబేషన్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. డిపార్ట్‌మెంట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏపీపీఎస్సీ ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ నెల 28వ తేదీ నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయాన్ని అభ్యర్థులకు కల్పించింది. ఓటీపీ ద్వారా ఇందులో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఓటీపీ ద్వారా వచ్చే యూజర్ ఐడీతో ఈ నెల 13వ తేదీ నుంచి 17 వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ పరీక్ష 100 మార్కులకు నిర్వహించనున్నారు. 100కు 40 మార్కులు వస్తేనే ఉద్యోగులు తమ ప్రొబేషనరీకి అర్హత సాధిస్తారని ఏపీపీఎస్సీ పేర్కొంది.
రెండేళ్ల సర్వీసు పూర్తవుతుండటంతో..
ఏపీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రికార్డు స్థాయిలో పలు ఉద్యోగాలను భర్తీ చేసిన విషయం విదితమే. అప్పుడు ఉద్యోగాలు సాధించిన వారంతా.. 2019 అక్టోబర్ 2వ తేదీన విధుల్లో చేరారు. ఈ ఉద్యోగులందరికీ రెండేళ్ల పాటు ప్రొబేషన్ పీరియడ్ విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రెండేళ్ల సర్వీసు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం వీరికి ప్రొబేషన్ డిక్లేర్ చేయడంతో పాటు పే స్కేలు అమలు చేయాలి. ఈ ప్రొబేషన్ డిక్లేర్ చేయడం కోసం శాఖాపరమైన (డిపార్ట్‌మెంట్) పరీక్షలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
1.34 లక్షల మంది..
ప్రస్తుతం ఏపీలో ఉన్న15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వీరంతా 9 ప్రభుత్వ శాఖలకు అనుబంధంగా పని చేస్తున్నారు. ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి గత కొద్ది నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయితే విధుల నుంచి తొలగిస్తారనే వాదనలు కూడా వినిపించాయి. దీంతో వీటిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ పరీక్షలో ఎవరైనా ఉద్యోగులు పాస్ కాకపోతే ప్రొబేషన్ పీరియడ్ పొడిగిస్తారని.. పాస్ అయితే వారికి వెంటనే ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తారని చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తోన్న ఏ ఒక్కరి ఉద్యోగం పోదని భరోసా ఇచ్చింది.