AP PRC: జీతాల ప్రాసెస్ పై వీడని ఉత్కంఠ... ట్రెజరీ ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం ఆదేశం... డీడీవోలు, ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ..
ఏపీలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ జగడం ముదురుతోంది. తాజాగా ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. జీతాలు ప్రాసెస్ చేయని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
కొత్త పీఆర్సీ అమలుకు ప్రభుత్వం ఎక్కడా తగ్గేదేలే అంటుంది. పీఆర్సీ జీవోలు రద్దు సాధ్యం కాదని స్పష్టం చేసిన ప్రభుత్వం.. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు ప్రాసెస్ చేస్తామని తెలిపింది. ఈ వ్యవహారంపై తాజాగా ట్రెజరీ ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది. ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. తక్షణమే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. బిల్లులు ప్రాసెస్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించింది. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తప్పవన్న ప్రభుత్వం... బిల్లులు ప్రాసెస్ చేయని డీడీవోలు, ట్రెజరీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖను ఆదేశించింది. శనివారం సాయంత్రం 6 గంటల వరకు విధుల్లో విఫలమైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కొత్త పే స్కేళ్ల ప్రకారం జీతాల చెల్లింపులు ప్రాసెస్ చేయాలని అధికారులను ఆదేశించింది. ట్రెజరీ సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలివ్వాలని ఏపీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. కానీ ఉద్యోగులు మాత్రం తాము ప్రాసెస్ చేయబోమని స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకూ కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే ప్రాసెస్ అయినట్లు తెలుస్తోంది. మొత్తం 4.50 లక్షల బిల్లులు పాస్ చేస్తేనే ఉద్యోగులందరికీ జీతాలు వస్తాయి.
పట్టువీడని ఉద్యోగ సంఘాలు
ఫిబ్రవరి 1వ తేదీ వస్తుండడంతో ఉద్యోగుల జీతాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. పాత పీఆర్సీ ప్రకారమే జీతాలు ఇవ్వాలని ఉద్యోగులు పట్టుపడుతున్నారు. కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ఉంటాయని ప్రభుత్వం అంటోంది. అయితే ఉద్యోగుల జీతాలు ప్రాసెస్ చేయాలంటూ ఇప్పటికే ట్రెజరీ ఉద్యోగులకు, డీడీవోలకు పలుమార్లు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. అయితే తాజాగా ట్రెజరీ ఉద్యోగులకు మెమోలు జారీ చేసింది. తక్షణమే జీతాలు ప్రాసెస్ చేయాలని ఆదేశించింది. లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. పీఆర్సీపై ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్న ఉద్యోగ సంఘాలు, 7వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు రంగం సిద్ధం చేస్తున్నాయి.
హెచ్ఆర్ఏ పెంపు
మరో వైపు హెచ్ఆర్ఏ పెంపుపై ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం హెచ్వోడీ కార్యాలయాల్లో హెచ్ఆర్ఏ 8 నుంచి 16 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన హెచ్వోడీ కార్యాలయాల్లోని ఉద్యోగులకు ఈ హెచ్ఆర్ఏ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
Also Read: 75 శాతం జీతాల బిల్లులు ప్రాసెస్ చేయని ఉద్యోగులు.. ఇక ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందా ?