AP Employees : 75 శాతం జీతాల బిల్లులు ప్రాసెస్ చేయని ఉద్యోగులు.. ఇక ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందా ?
జీతాల బిల్లులు ప్రాసెస్ చేయకపోతే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించినా ఉద్యోగులు వినలేదు. బిల్లులు ప్రాసెస్ చేయలేదు. దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అనే చర్చ ప్రారంభమయింది.
కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలివ్వాలని ఏపీ ప్రభుత్వం పట్టుదలగా ఉంది. కానీ ఉద్యోగులు మాత్రం తాము ప్రాసెస్ చేయబోమని స్పష్టం చేశారు. జీతాల చెల్లింపునకు సంబంధించి బిల్లులు తయారు చేయడానికి శుక్రవారాన్ని డెడ్‌లైన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం కల‌్లా జీతాల బిల్లులన్నీ ప్రాసెస్ కావాలని కలెక్టర్లు కూడా ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చారు. అయితే డెడ్‌లైన్ ముగిసే సమయానికి కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే ప్రాసెస్ అయ్యాయి. మొత్తం 4.50 లక్షల బిల్లులు పాస్ చేస్తేనే ఉద్యోగులందరికీ జీతాలు వస్తాయి. అంటే పావు వంతు మాత్రమే బిల్లులు రెడీ అయ్యాయి.
ఇప్పటికి సిద్ధం అయిన బిల్లుల్లో అత్యధికం పోలీస్ శాఖకు సంబంధించిన బిల్లులే ఉన్నాయి. పోలీసు విభాగానికి చెందిన వారు ఉద్యోగుల ఆందోళనల్లో పాల్గొనడం లేదు. ఆర్థికశాఖ ఉన్నతాధికారులు ఒత్తిడి తేవడంతో కలెక్టర్లు జిల్లా స్థాయిలో కొన్ని బిల్లులను తయారుచేయించారు. దీనికోసం జిల్లా కలెక్టర్లు ట్రెజరీ అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. మరో రెండు రోజులు కూడా బిల్లుల తయారీకి అవకాశం ఉందని వారు చెబుతున్నప్పటికీ నిర్ధేశించిన సమయానికి బిల్లులు సిద్ధం కాకపోవడం పట్ల ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. జీతాలు బిల్లులు ప్రాసెస్ చేయడానికి మరో రెండు రోజులు గడువు కలెక్టర్లు ఇచ్చారు. అయితే అప్పటికీ బిల్లులు ప్రాసెస్ చేసినా జీతాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
జీతాల బిల్లులు ప్రాసెస్ చేయకపోవడం క్రమశిక్షణా రాహిత్యమని.. చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఉద్యోగులపై చర్యలు తీసుకుంటుందా అనే చర్చ ప్రారంభమమయింది. అయితే ఒక్కరిపై చర్యలు తీసుకున్నా తక్షణమే సమ్మె ప్రారంభిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ కారణంగా ప్రభుత్వం చర్యల విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే కొత్త పీఆర్సీ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. సీఎంఎఫ్‌ఎస్ ద్వారా కొత్త పీఆర్సీ ప్రకారమే పెన్షన్లను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. పెన్షనర్లకు సంబంధించి సమస్య లేదని ఉద్యోగుల బిల్లులతోనే ఇబ్బంది అని.. రెండు, మూడురోజులు ఆలస్యంగా అయినా సరే ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే జీతాలు బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే పాత జీతాలు ఇస్తే తీసుకుంటాం కానీ.. కొత్త పీఆర్సీ ప్రకారం అయితే అంగీకరించే ప్రశ్నే లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఒకటో తేదీ తర్వాత ఈ జీతాల వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.