అన్వేషించండి
Advertisement
Three Capitals Chronology: మూడు రాజధానుల నిర్ణయం నుంచి ఉపసంహరణ వరకూ ఎప్పుడు ఏం జరిగింది..?
మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. అసలు మూడు రాజధానులపై ఎప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లులను ఉపసంహరించుకున్నట్లుగా హైకోర్టుకు తెలిపింది. మూడు రాజధానుల బిల్లులు, సీఆర్డీఏ రద్దు వంటి అంశాలపై హైకోర్టులో రోజువారి విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. నిజానికి బిల్లులు ఎప్పుడో పాసైపోయాయి. గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. ఆ సమయంలో కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో ఆచరణ ఆగిపోయింది. ఇప్పుడు వాటి చట్టబద్ధతపైనే విచారణ జరుపుతున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ రెండు బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలని సీఎం జగన్ నిర్ణయించడం రాజకీయవర్గాల్లో సంచలనానికి కారణం అవుతోంది. అసలు మూడు రాజధానుల అంశం ఎప్పుడు మొదలైంది. ఏం జరిగిందో చూద్దాం.
- సెప్టెంబర్ 13, 2019:
రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం సూచనలు ఇవ్వడం కోసం రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జీఎన్ రావు అధ్యక్షతన నిపుణుల కమిటీని జగన్ సర్కారు ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అక్టోబర్ 3వ వారం నుంచి పని ప్రారంభించింది. డిసెంబర్ తొలి వారంలో జీఎన్ రావు కమిటీ సీఎం జగన్ కు మధ్యంతర నివేదిక సమర్పించింది. - డిసెంబర్ 17, 2019 :
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని విషయంలో దక్షిణాఫ్రికా మోడల్ అవలంబించాలని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికాకు మూడు రాజధానులున్నాయి. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ పెట్టొచ్చు, అసెంబ్లీ పెట్టొచ్చు విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ పెట్టొచ్చు అని జగన్ అన్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చన్నారు. 'బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తాయేమో మూడు రాజధానులు రావలసిన అవసరం ఉంది' అని జగన్ అన్నారు. - డిసెంబర్ 18, 2019:
2019 డిసెంబరు 17న సాయంత్రం అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన మూడు రాజధానుల ప్రస్తావనపై అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మర్నాటి నుంచే రాజధాని గ్రామాల్లో ఉద్ధృతంగా అమరావతి పరిరక్షణ ఉద్యమం చేపట్టారు. డిసెంబరు 18న వెలగపూడిలో తొలి దీక్షా శిబిరం ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి రాజధాని గ్రామాల ప్రజలు, రైతులు అమరావతే ఆశ, శ్వాసగా పోరాటం చేస్తున్నారు. - డిసెంబర్ 20, 2019 :
ఏపీ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ సీఎం జగన్‌కు పూర్తి నివేదిక సమర్పించింది. ఈ కమిటీ సీఎం క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రిని కలిసి నివేదిక అందించింది. - డిసెంబర్ 27, 2019 :
జీఎన్ రావు కమిటీ నివేదిక, బీసీజీ(బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్) నివేదికలపై అధ్యయనం కోసం హైపవర్ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. - డిసెంబర్ 29, 2019:
హైపవర్ కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. - జనవరి 3, 2020:
రాష్ట్ర సమగ్ర, సమతుల అభివృద్ధికి పరిపాలన వికేంద్రీకరణ ఏకైక మార్గమని పేర్కొంటూ మూడు రాజధానుల ఏర్పాటుకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సమగ్ర నివేదిక అందించింది. - జనవరి 17, 2020:
సీఎం వైఎస్ జగన్‌కు హైపవర్ కమిటీ నివేదిక అందించింది. హైపవర్ కమిటీ కూడా మూడు రాజధానులకే ఓకే చెప్పింది. - జనవరి 20, 2020:
హైపవర్ కమిటీ నివేదికపై చర్చించి పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. దీనికోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేశారు. వికేంద్రీకరణ బిల్లును సభలో ఆర్థిక మంత్రి బుగ్గన ప్రవేశ పెట్టారు. సీఆర్డీఏ రీపీల్ యాక్ట్ 2020 బిల్లును మున్సిపల్ శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రతిపాదించారు. ఏపీ ప్రభుత్వం ముందు నుంచి చెబుతున్న విధంగానే మూడు రాజధానుల ప్రతిపాదనను బిల్లు రూపంలో అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన సభలో ప్రవేశ పెట్టిన ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రిజీయన్స్ బిల్-2020 లో అంశాలను ప్రస్తావించారు. - జనవరి 22, 2020:
శాసనసభ ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపించారు. - జూన్ 16, 2020:
అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును మరోసారి అసెంబ్లీ ఆమోదించింది. - జూన్ 17, 2020:
శాసనసభ రెండోసారి ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసనమండలిలో ఆమోదించకుండా తిరస్కరించకుండా నిరవధికంగా వాయిదా పడింది. - జూలై 18, 2020:
శాసనమండలిలో రెండుసార్లు ఆమోదించని బిల్లుల్ని శాసనమండలితో పనిలేకుండా గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. - జూలై 31, 2020:
పరిపాలన వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. సీఆర్‌డీఏ స్థానంలో ‘ఏఎంఆర్‌డీఏ’ సీఆర్‌డీఏ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) రద్దు బిల్లును గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదించారు. ఆ స్థానంలో ఏఎంఆర్‌డీఏ (అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీఆర్‌డీఏ కార్యకలాపాలన్నీ ఇకపై ఏఎంఆర్‌డీఏ నిర్వహిస్తుంది. సీఆర్‌డీఏ ఉద్యోగులంతా ఏఎంఆర్‌డీఏ ఉద్యోగులుగా మారతానరి ప్రకటించింది. - 22 నవంబర్, 2021:
మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమవారం అసెంబ్లీలో సీఆర్‌డీఏ(CRDA) రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. కీలకమైన మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోనున్నట్లు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. రద్దు ఉపసంహరణ బిల్లులోని విషయాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభకు వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడి ప్రాంతాలుగా ఉత్తరాంధ్ర, రాయలసీమలను శ్రీకృష్ణ కమిటీ గుర్తించిందని బుగ్గన వివరించారు. ఈ రెండు ప్రాంతాలతో పోలిస్తే, హైదరాబాద్ రాజధానిగా కలిగిన తెలంగాణ అభివృద్ధిలో ఒక మెట్టు పైనే ఉందన్నారు. - 22 నవంబర్, 2021:
రాజధాని అంశంపై సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడారు. మళ్లీ పూర్తి సమగ్ర బిల్లుతో సభ ముందుకు వస్తామని తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుపై ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.."ఒకప్పుడు కర్నూలు రాజధానికిగా ఉండేది. 1956లో కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్ కు తరలిపోయింది. నా ఇల్లు అమరావతిలోనే ఉంది. నాకు ఈ ప్రాంతం అంటే ప్రేమ ఉంది. కనీసం రోడ్లేసుకోవడానికి, కరెంట్ ఇవ్వడానికి డబ్బులు లేని పరిస్థితి. చదువుకున్న మన పిల్లలు ఉద్యోగాల కోసం బెంగుళూరు, చెన్నై వెళ్లాల్సిందేనా..?. విశాఖలో ఇప్పటికే రోడ్లు, డ్రైనేజ్ లు , కరెంట్ ఉన్నాయి. విశాఖ మరో ఐదు, పదేళ్లలో హైదరాబాద్ వంటి నగరాలకు పోటీ పడే అవకాశం ఉంది. గత రెండేళ్ల నుంచి రాజధాని విషయంలో రకరకాల ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వికేంద్రీకరణ బిల్లు అమల్లోకి వస్తే ఈ పాటికే మంచి ఫలితాలు అమల్లోకి వచ్చేవి.' అన్నారు.
Also Read: మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం ! కొత్త వ్యూహం ఏమిటి ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion