Andhra Pradesh News: ఏపీ చేనేత కార్మికులకు సంక్రాంతి కానుక - లోకేష్, బాలకృష్ణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
Andhra Pradesh News:ఆంధ్రప్రదేశ్‌లో చేనేత కార్మికులకు కేంద్రం సంక్రాతి కానుక ఇచ్చింది. పది క్లస్టర్లు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో రెండు లోకేష్, బాలయ్య నియోజకవర్గానికే.
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో వరాన్ని ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది చేనేత క్లస్టర్లను మంజూరు చేసింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, శ్రీపొట్టి శ్రీరాముల నెల్లూరు, కాకినాడ, తూర్పుగోదావరి, తిరుపతి జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్లస్టర్ల కారణంగా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
పది క్లస్టర్లు ఏర్పాటు
కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటుతో ప్రజలు చాలా మేలు జరుగుతోంది. ఇప్పటికే కేంద్రం చేపట్టన అనేక కార్యక్రమాల్లో రాష్ట్రానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పుడు మరోసారి అలాంటి ప్రయార్టీ ఇచ్చింది కేంద్రం. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏర్పాటు చేస్తున్న క్లస్టర్లను రాష్ట్రానికి కేటాయించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది క్లస్టర్లను ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
పది రోజుల్లో రాష్ట్ర ఖాతాలోకి నిధులు
ఒక్క తిరుపతి జిల్లాలోనే రెండు క్లస్టర్లు ఏర్పాటుకు ఓకే చెప్పింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, శ్రీసత్యసాయి, శ్రీపొట్టి శ్రీరాముల నెల్లూరు, కాకినాడ, తూర్పుగోదావరిజిల్లాలో ఒక్కొక్కటి చొప్పున క్లస్టర్ ఏర్పాటు చేయనుంది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, తిరుపతి పరిధిలో ఏర్పాటు చేయనున్న క్లస్టర్లకు తొలి విడతలో ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసింది. మిగతా క్లస్టర్లకు రెండు కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వారం 10 రోజుల్లో ఈ నిధులు ప్రభుత్వ ఖజానాలో పడనున్నాయి. సంక్రాంతి నాటికి క్లస్టర్ల ఏర్పాటు పనులు ప్రారంభంకానున్నాయి. ఈ చేనేత క్లస్టర్లతో దాదాపు రెండు వేల మంది కార్మికులకు లబ్ధి జరుగుతుంది.
ధర్మవరంలో మెగా క్లస్టర్
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత పేరు చెబితే మొదట గుర్తుకు వచ్చేది ధర్మవరం. అందుకే అక్కడ మెగా క్లస్టర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడ కార్మికులు తయారు చేసే కంచి పట్టు చీరల్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ కల్పించడంతోపాటు వారి పనితనాన్ని విశ్వవ్యాప్తం చేయాలని యోచిస్తోంది. అందుకే 34 కోట్లతో భారీ క్లస్టర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీంతోపాటు పిఠాపురం, అంగరంలో కూడా భారీ క్లస్టర్లు సిద్ధం చేయనుంది. అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి సర్వే చేపట్టి డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. ఒకసారి డీపీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పి కేంద్రానికి పంపిస్తే నిధులు విడుదల అవుతాయి.
క్లస్టర్‌తో యంత్రాాలు, ట్రైనింగ్
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగాన్ని నమ్ముకొని దాదాపు మూడున్నర లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్రంలో 32 క్లస్టర్లు పని చేస్తున్నాయి. ఇప్పుడు వచ్చినవి అదనం. ఒక్కో క్లస్టర్‌లో ఐదు వందల మంది వరకు లబ్ధి పొందుతారు. వాళ్లకు 90 శాతం రాయితీతో ఆధునిక యంత్రాలు కొనిపిస్తారు. షెడ్ కూడా వేయిస్తారు. దీనికి పూర్తి రాయితీ ప్రభుత్వం ఇస్తుంది. కొత్తగా వస్తున్న డిజైన్లు, ఇతర అంశాలపై ట్రైనింగ్ కూడా ఇస్తారు.