AP Govt : ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై పర్యవేక్షణ, సడెన్ చెకింగ్ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ లు!
AP Govt : ఏపీలో ఉద్యోగులు పనివేళల్లో ఎక్కడ ఉన్నారో చెక్ చేసేందుకు ప్రభుత్వం ఫ్లయింగ్ స్వాడ్ లకు బాధ్యతలు అప్పగించింది. ఈ స్క్వాడ్ లో ప్రతిరోజూ తనిఖీలు చేసి కలెక్టర్ కు నివేదిక అందించనున్నాయి.
AP Govt : ఏపీలో ఉద్యోగులపై పర్యవేక్షణకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఉద్యోగులు డ్యూటీకి వచ్చి మధ్యలో ఇతర పనులకు కార్యాలయ పరిసరాలను దాటి వెళ్లినట్లయితే ఫ్లయింగ్ స్క్వాడ్ చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. సర్ప్రైజ్ విజిట్ చేసి ఉద్యోగుల హాజరును, పని తీరును గమనించాలని అధికారులకు కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఫేస్ ఆధారిత హాజరును అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం తాజాగా కార్యాలయాల్లో ఉద్యోగులుంటున్నారా? లేదా అన్నది పరిశీలించేందుకు చర్యలు చేపట్టింది. ఉద్యోగుల పనితీరు, హాజరుపై సడన్ గా చెక్ చేసేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు అన్ని ప్రభుత్వ ఆఫీసులు, సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల హాజరుపై తనిఖీలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాలో
చిత్తూరు జిల్లాలో డివిజన్ల వారీగా ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. సీఎం జగన్ ఇటీవల సమీక్షలో ఉద్యోగులు ముఖ ఆధారిత హాజరు తర్వాత పనివేళల్లో కార్యాలయాల్లో ఉంటున్నారా? లేదా? అనేది పరిశీలించాలని చిత్తూరు కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో ఉద్యోగులపై పర్యవేక్షణ కోసం తనిఖీ బృందాలు ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ఫ్లయింగ్ స్వ్కాడ్‌లు సడన్ విజిట్ నిర్వహిస్తాయి. కార్యాలయాల పనివేళల్లో హాజరు, రిజిస్టర్ల ప్రకారం సిబ్బంది పని చేస్తున్నారా? లేదా? వంటి అంశాలను ఈ తనిఖీ బృందాలు పరిశీలించనున్నాయి. అనంతరం నివేదికను కలెక్టర్లకు ప్రతి రోజూ అందజేస్తాయి. చిత్తూరు జిల్లాలో ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్వ్కాడ్‌ల నివేదికలను పరిశీలించి బాధ్యత డీఆర్వో, జడ్పీ సీఈవోలదేనని కలెక్టర్ హరినారాయణన్ వెల్లడించారు.