AP Liquor Policy: మద్యం పాలసీ నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ సర్కార్
AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్ సర్కార్ లిక్కర్ పాలసీని ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మద్యం విధానాన్ని ప్రకటించింది.
AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్ సర్కార్ లిక్కర్ పాలసీని ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి మద్యం విధానాన్ని ప్రకటించింది. 2019లో జారీ చేసిన ఎక్సైజ్ విధానాన్నే, ఈ ఏడాదికి కొనసాగిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ లో పేర్కొంది. శనివారంతో ఎక్సైజ్ విధానం గడువు ముగియనుండటంతో మరోమారు పాత విధానాన్ని పొడిగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో పేర్కొన్నట్టుగానే తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మార్గంలో ఎలాంటి దుకాణానికి లైసెన్సు మంజూరు చేయబోమని స్పష్టం చేసింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని అబ్కారీ శాఖ వెల్లడించింది.
ఎన్ని దుకాణాలు ఉన్నాయి ?
2023-24లోనూ ఏపీ బెవరేజ్ కార్పోరేషన్ కు చెందిన 2,934 రిటైల్ మద్యం దుకాణాలు కొనసాగనున్నాయి. మద్యం దుకాణాల లైసెన్సు 2023 అక్టోబరు 1 నుంచి 2024 సెప్టెంబరు 30 వరకూ కొనసాగుతుందని అబ్కారీ శాఖ వెల్లడించింది. వార్షిక లైసెన్సు ఫీజు చెల్లించిన తర్వాత రిటైల్ దుకాణాలు, బార్ల లైసెన్సులను ఎక్సైజ్ శాఖ కమిషనర్ పొడిగిస్తారని నోటిఫికేషన్ లో తెలిపింది. ప్రతి ఏటా 25 శాతం మధ్య దుకాణాలను ఎత్తివేసే ప్రణాళికను రూపొందిస్తామని ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే కాలానుగుణంగా వస్తున్న అవసరాలు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో వాటిని తొలగించడంలో వెనకడుగు వేశారు. ప్రభుత్వమే మద్యం అమ్మే విధానాన్ని తీసుకొచ్చారు.
టైల్ అవుట్ లెట్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
2022-23 సంవత్సరానికి రిటైల్ మద్యం విక్రయాల విధానం అమలుకు గతేడాది రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2022 అక్టోబర్ 1 తేదీ నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకూ మద్యం విధానం అమల్లో ఉంటుదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే ఎక్సైజ్ శాఖ నిర్వహణలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది. రిటైల్ అవుట్ లెట్ ల్లో ఇక నుంచి డిజిటల్ చెల్లింపుల కు అనుమతి ఇచ్చింది. మద్యం వాక్ ఇన్ స్టోర్ లు, రిటైల్ అవుట్ లెట్ లను ఏర్పాటు చేసుకునేందుకు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా
8 పెద్ద కార్పొరేట్ మద్యం కంపెనీలు సభ్యులుగా ఉన్న ఇంటర్నేషనల్ స్పిరిట్స్ – వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించాయి. ఏపీ సర్కార్ కు వ్యతిరేకంగా కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించడాన్ని ఆ సంఘం వ్యతిరేకించింది. మద్యం కొనుగోలు, అమ్మకాలు పూర్తిగా బెవరేజస్ కార్పొరేషన్ నిర్వహించడం కాంపిటిషన్ యాక్ట్‌కు విరుద్ధమని వాదించింది. గతేడాది సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానం పూర్తి సహేతుకమైదని కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఏకస్వామ్య విధానాలను నిరోధించేందుకు ఉద్దేశించిన కాంపిటిషన్ యాక్ట్ –2002కు అనుగుణంగానే ఉందని తేల్చి చెప్పింది. దశలవారీ మద్య నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని దేశంలో ప్రముఖ విదేశీ మద్యం తయారీ కంపెనీలు వ్యతిరేకించాయి. ఇంటర్నేషనల్ స్పిరిట్స్ – వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లేవనెత్తిన అభ్యంతరాలు హేతుబద్ధంగా లేవని చెప్పింది. అందువల్ల ఈ కేసును మూసివేస్తున్నట్టు ప్రకటించింది.