AP Teachers Good News: ఏపీ టీచర్లు ఇక ఎన్నికల విధులకు దూరం - కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం !
ఏపీ టీచర్లకు బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక వారు ఎన్నికల విధులకూ దూరం కానున్నారు.
AP Teachers Good News: ఆంధ్రప్రదేశ్‌లో టీచర్లకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపునిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వర్చువల్‌గా జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఒక్క ఎన్నికల విధులు మాత్రమే కాకుండా... బోధనేతల విధులు ఇక టీచర్లకు కేటాయించకుండా నిర్మయం తీసుకున్నారు. జనగణన వంటి వాటికి కూడా టీచర్ల సేవలు తీసుకోరు. ఉపాధ్యాయులను బోధనేతర పనులకు దూరంగా ఉంచేలా వారి సర్వీసు రూల్స్‌కు సవరణ చేసే ఆర్డినెన్స్‌కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గవర్నర్ ఆమోదం తర్వాత ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుంది. తర్వాతి అసెంబ్లీ సమావేశాల్లో చట్టం తీసుకు వస్తారు.
జనగణన , టీకాలు సహా ఏ బోధనేతర పనీ ఇక ప్రభుత్వం చెప్పదు !
బోధనేతర పనులు అంటే ఇక ఏ ఇతర పనినీ టీచర్లు చేయకూడదు. అప్పుడు సాధారణ పనులతో కీలకమైన ఎన్నికలు కూడా వారి నుంచి దూరమవుతాయి. సుదీర్ఘకాలంగా ఎన్నికలు అంటే తొలుత టీచర్లే గుర్తుకువచ్చేలా వారిని వినియోగించుకుంటున్నారు. ఓట్ల జాబితాల పరిశీలన నుంచి ఎన్నికల రోజు ఓటింగ్ వరకు వారే ఉంటారు. ఏపీలో ఉపాధ్యాయులు బోధనపై పూర్తిస్దాయిలో దృష్టిపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పొడవునా బోధనతో పాటు ఎన్నికలు, జనగణన, టీకాల పేరుతో బోధనేతర విధుల్లో బిజీగా ఉంటున్న వీరికి ఓ రకంగా ఊరట కల్పించే విషయం అనుకోవచ్చు.
విద్యా సంస్కరణల్లో భాగంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
ఏపీలో విద్యాసంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జాతీయ విద్యావిధానం అమలుతో పాటు పలు విద్యాసంస్కరణల్ని అమలు చేస్తున్న ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై టీచర్లకు సంతోషపరుస్తోంది. చాలా కాలంగా వారు బోధనేతర విధుల పట్ల వ్యతిరకతతో ఉన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి అవసరం వచ్చినా టీచర్లనే వినియోగించుకుంటూ ఉంటుంది. ఇలాంటి పనులన్నీ చేయడంతో ఇకవారికి విద్యార్థుల చదువు గురించి ఆలోచించే తీరిక లేకుండా పోతోంది. బోధనేతర పనుల వల్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తమ అసలు పనిచేసే అవకాశం లేకుండా పోతోంది.
ప్రభుత్వంపై టీచర్లు అసంతృప్తితో ఉన్న కారణంగానేనా ?
అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజకీయ విమర్శలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. టీచర్లకు ఎన్నికల విధులకు దూరం చేయడం లక్ష్యంగానే ఈ నిర్ణయం తీసుకున్నారన్న విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ప్రభుత్వంపై ఉపాధ్యాయులు అసంతృప్తితో ఉన్నారు. సీపీఎస్ రద్దు, పీఆర్సీ విషయంలో వారు పులమార్లు ఆందోళనకు దిగారు. అయితే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటీవల ఉద్యమం చేయాలనకున్న సమయంలో కేసులు పెట్టారు. టీచర్లు ఎన్నికల విధులు నిర్వహిస్తే తమకు వ్యతిరేకంగా పని చేస్తారన్న ఉద్దేశంతోనే .. వారిని హఠాత్తుగా బోధనేతర పనుల నుంచి తప్పించినట్లుగా భావించే చాన్స్ ఉంది. టీచర్లు లేకపోతే ఎన్నికల విధులకు సిబ్బందిని సమీకరంచడం కష్టం. అయితే ఇందు కోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్ని ఎంచుకునే చాన్స్ ఉందంటున్నారు.