![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
(Source: Poll of Polls)
Vijayawada Floods: 2 లక్షల కుటుంబాలకు నిత్యావసర కిట్లు - రేపటి నుంచి పంపిణీ చేస్తామన్న మంత్రి నాదెండ్ల, ఏమేం ఇస్తారంటే?
Vijayawada News: విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం నుంచి నిత్యావసర కిట్లు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్ కార్డు లేని వారి ఆధార్ లేదా బయోమెట్రిక్ ద్వారా ఇస్తామన్నారు.
![Vijayawada Floods: 2 లక్షల కుటుంబాలకు నిత్యావసర కిట్లు - రేపటి నుంచి పంపిణీ చేస్తామన్న మంత్రి నాదెండ్ల, ఏమేం ఇస్తారంటే? ap government distributed 2 lakh essential kits in vijayawada flood victims Vijayawada Floods: 2 లక్షల కుటుంబాలకు నిత్యావసర కిట్లు - రేపటి నుంచి పంపిణీ చేస్తామన్న మంత్రి నాదెండ్ల, ఏమేం ఇస్తారంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/05/252bf9007c0f20bd917317fc9b86d36b1725533902567876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Essential Kits Distributed In Vijayawada Floods: వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు నిత్యావసరాల కిట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నగరంలో కొన్ని ప్రాంతాలు ముంపు నుంచి బయటపడగా.. మరికొన్ని చోట్ల ఇంకా వరద తగ్గలేదు. వరద తగ్గిన ప్రాంతాల్లో నిత్యావసరాలు (Essential Kits) అందించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అటు, పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, తాగునీరు అందిస్తున్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 6) నుంచి నిత్యావసర కిట్లు పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) తెలిపారు. 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ పంచదార, 2 కేజీల ఉల్లిపాయలు, 2 కేజీల బంగాళదుంపలు, లీటర్ వంటనూనెతో కూడిన కిట్లను బాధితులకు అందిస్తామన్నారు. '2 లక్షల కుటుంబాలకు నిత్యావసర కిట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ పోస్ మిషన్ ద్వారా సరుకుల పంపిణీ జరుగుతుంది. తొలి రోజు 50 వేల కుటుంబాలకు కిట్లు పంపిణీ చేస్తాం. రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డు ద్వారా లేదా బయోమెట్రిక్ ఆధారంగా కిట్లు పంపిణీ చేస్తాం. గ్యాస్ కంపెనీలు కూడా సేవ చేసేందుకు ముందుకు వచ్చాయి. ముంపు ప్రాంతాల్లో 12 గ్యాస్ సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.' అని మంత్రి తెలిపారు.
మరోవైపు, నగరంలోని కొన్ని ప్రాంతాలు ఇప్పటికే వరద నుంచి బయటపడగా మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. బురదతో నిండిపోయిన రహదారులు, ఇళ్లు, షాపుల్లో ఫైరింజన్ల సాయంతో బురదను తొలగిస్తున్నారు. దాదాపు 2 వేల మంది సిబ్బంది పారశుద్ధ్య చర్యల్లో నిమగ్నమయ్యారు. అటు, ముంపు తగ్గిన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. చెత్తా చెదారాన్ని తొలగిస్తూ బ్లీచింగ్ చల్లుతున్నారు. గురువారం రాత్రి నుంచి మళ్లీ వర్షం పడుతున్న క్రమంలో నగరవాసుల్లో మళ్లీ భయాందోళన నెలకొంది.
మరోసారి సీఎం పర్యటన
నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి సీఎం చంద్రబాబు (CM Chandrababu) పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ దాటి ముంపు ప్రాంతాల్లో పంటుపై వెళ్లి పరిశీలించారు. కేసరపల్లి వద్ద బుడమేరు కాల్వపై వరద ఉద్ధృతిని పరిశీలించారు. గండ్లు పడిన చోట చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు. పంట నష్టం వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. విజయవాడకు మరోసారి ఇలాంటి విపత్తు లేకుండా చర్యలు చేపడతామని అన్నారు. బుడమేరు కాల్వ ప్రక్షాళన చేపడతామని.. గతంలోనే కాల్వ ఆధునీకరణకు నిధులు కూడా కేటాయించామని చెప్పారు.
మరోవైపు, బుడమేరు వాగుకు మళ్లీ వరద ప్రవాహం పెరుగుతున్న క్రమంలో మళ్లీ ఆందోళన నెలకొంది. జక్కంపూడి, వైఎస్సార్ కాలనీ, పైపుల రోడ్డు ఇతర ప్రాంతాలు జలమయం కాగా.. బాధితులు భయాందోళనకు గురవుతున్నారు. ఏలూరు జిల్లాలో కొల్లేరు సరస్సుకు సైతం వరద ఉద్ధృతి పెరిగింది. చిన్నఎడ్లగాడి, పెదఎడ్లగాడి పరిసర ప్రాంతాలతో పాటు ఏలూరు - కైకలూరు రహదారిపైకి వరద నీరు చేరింది. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)