CM Chandrababu: బుడమేరు ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన - బల్లకట్టుపై ఏలూరు కాలువ దాటి పరిశీలన
Vijayawada News: విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మరోసారి సీఎం చంద్రబాబు పర్యటించారు. ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపు ప్రాంతాల్లో బల్లకట్టుపై వెళ్లి పరిశీలించారు.
dCM Chandrababu Visit Flood Affected Areas In Vijayawada: విజయవాడ (Vijayawada) నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) గురువారం మరోసారి పర్యటించారు. ఎనికేపాడు వద్ద ఏలూరు కాలువ దాటి బుడమేరు (Budameru) ముంపు ప్రాంతాల్లో బల్లకట్టుపై వెళ్లి పరిశీలించారు. గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై ఆయన అధికారులతో చర్చించి.. పంట నష్టం వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసరపల్లి వద్ద బుడమేరు కాల్వపై వరద ఉద్ధృతిని పరిశీలించారు. విజయవాడకు మరోసారి ఇలాంటి విపత్తు రాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. బుడమేరుకు వరద తగ్గనందున బాధ్యతగా పని చేయాలన్నారు. బుడమేరు కాల్వ ప్రక్షాళన చేపడతామని.. గతంలోనే కాల్వ ఆధునీకరణకు నిధులు కూడా కేటాయించామని చెప్పారు. మరోవైపు, విజయవాడలో ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. వరద పూర్తిగా తగ్గిన చోట మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. ఇతర ప్రాంతాల నుంచి పారిశుద్ధ్య కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు. దాదాపు 2 వేల మంది కార్మికులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.
కలెక్టర్ కార్యాలయం నుంచి ఎనికేపాడు మీదుగా పొలాల్లోకి వెళ్లి బుడమేరు ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. పంటు మీద ఏలూరు కాలువ దాటి బుడమేరు ముంపును పరిశీలించిన సీఎం. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనులపై అధికారులతో చర్చించిన సీఎం. దెబ్బతిన్న పంటల… pic.twitter.com/NFUdOMqW1z
— Telugu Desam Party (@JaiTDP) September 5, 2024
కొల్లేరు ఉద్ధృతి
అటు, ఏలూరు జిల్లాలో కొల్లేరు సరస్సు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చిన్నఎడ్లగాడి, పెదఎడ్లగాడి పరిసర ప్రాంతాలతో పాటు ఏలూరు - కైకలూరు రహదారిపైకి వరద నీరు చేరింది. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైవేపై మోకాలి లోతు నీరు చేరడంతో బస్సులు, ఇతర వాహనాలు ప్రమాదకరంగా ముందుకు సాగుతున్నాయి. వరద తీవ్రత దృష్ట్యా లంక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పెనుమాక, ఇంగిలిపాక, నందిగామ లంక, కొవ్వాడలంక, నుచ్చుమిల్లి గ్రామాలకు వరద పోటెత్తడంతో కొల్లేరు వాసులు భయాందోళనకు గురవుతున్నారు. అటు, పాదచారులు, వాహనదారులు కొల్లేరును దాటే ప్రయత్నం చెయ్యొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర సమయాల్లో ప్రజలకు నిత్యావసరాలు, మందులను ప్రభుత్వం సరఫరా చేస్తుందని చెప్పారు.
అటు, విజయవాడ నగరంలో వరద తగ్గిన ప్రాంతాల్లో దాదాపు 50 ఫైరింజన్ల ద్వారా ఇళ్లల్లో చేరిన మట్టి, రోడ్లపై బురదను తొలగిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ఇళ్లు, రోడ్లు, షాపులు ఇలా అన్నింటినీ శుభ్రం చేసిన అనంతరం బ్లీచింగ్ చల్లుతున్నారు. మొత్తం 113 ఫైరింజన్లు అందుబాటులో ఉంచినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. మరోవైపు, పునరావాస కేంద్రాల్లో బాధితులకు ఆహారం, తాగునీరు సరఫరా కొనసాగుతోంది. అటు, విజయవాడలో మళ్లీ వర్షం పడుతున్న క్రమంలో నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. అటు, పైప్ లైన్ ద్వారా సరఫరా చేసిన నీటిని తాగొద్దని.. ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు.
Also Read: Vijayawada Floods: హృదయ విదారకం - నడుము లోతు నీటిలో మృతదేహం తరలింపు, విజయవాడలో కన్నీటి దృశ్యాలు