ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించారు.. మా పరిస్థితి కూడా చూడాలని చెప్పాం: ఉద్యోగ సంఘాల నేతలు
ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ సమావేశం ముగిసింది. ఆ తర్వాత.. ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడారు.
సీఎం వైఎస్ జగన్.. ఉద్యోగ సానుకూల నిర్ణయాలను ఉద్యోగ సంఘాలు ప్రశంసించాయి. 27 శాతానికి తగ్గకుండా ఫిట్ మెంట్ ఉండాలని సీఎం జగన్‌ను కోరినట్లు బొప్పరాజు వెల్లడించారు. తమ విజ్జప్తులపై సీఎం సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఉద్యోగస్తులను సంతృప్తి చేసేందుకే.. సీఎం ఉన్నారని పేర్కొన్నారు. సానుకూల నిర్ణయం ఉంటుందని సీఎం జగన్ చెప్పినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ఫిట్‌మెంట్ 34 శాతం ఇవ్వాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కోరారు. సచివాలయ వ్యవస్థతో గ్రామ స్వరాజ్యం తెచ్చారని ఉద్యోగ సంఘాలు కొనియాడాయి.
ఉద్యోగ వ్యవస్థ మొత్తానికీ ఒకే జీవో ఇవ్వాలని కోరినట్టు ఉద్యోగ సంఘాలు చెప్పాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై.. ఆర్థికశాఖ కార్యదర్శి ప్రజెంటేషన్ ఇచ్చినట్టు చెప్పారు. గత ఆర్థిక సంఘం ఇచ్చిన ఫిట్‌మెంట్‌లపై వివరించారని చెప్పారు. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని సీఎం జగన్‌ను కోరినట్టు చెప్పారు.
2022లో ఎంత శాతం వేతనాలు పెంచాలో ఆలోచించాలని కోరామని ఉద్యోగ సంఘాలు చెప్పాయి. పింఛనర్లకు ఉన్న రాయితీని తగ్గించే ప్రతిపాదనలు అంగీకరించవద్దని చెప్పినట్టు పేర్కొన్నాయి. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని క్రమబద్ధీకరించలేదని నేతలు చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది జీతభత్యాలు పెరగలేదన్నారు. సిబ్బంది జీతభత్యాలపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరామన్నారు. ఒప్పంద, పొరుగు సేవల సిబ్బంది జీతభత్యాలు పెరగాల్సి ఉందని.. ఉద్యోగ వ్యవస్థ మొత్తానికీ ఒకే జీవో ఇవ్వాలని కోరామని నేతలు వెల్లడించారు. గత ప్రభుత్వం ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని.. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ఉద్యోగులకు కూడా మంచి ఫిట్‌మెంట్ ఇచ్చేలా చూడాలని కోరినట్టు ఉద్యోగ సంఘాలు చెప్పాయి.
గతంలో పలుమార్లు స్టాఫ్ కౌన్సిల్ భేటీ జరిగినప్పటికీ వివాదం తేలలేదు. ఫిట్‌మెంట్ 34 శాతం ఇవ్వాల్సిందేనని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. అయితే ఏపీ ఆర్థిక పరిస్థితిని దాదాపుగా ప్రతి సమావేశంలోనూ అధికారులు వివరిస్తూ వస్తున్నారు. వస్తున్న ఆదాయం అంతా జీత, భత్యాలకే సరిపోతుందని చెబుతున్నారు. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ప్రభుత్వ వాదనతో అంగీకరించడం లేదు. ఇక అధికారులతో చర్చలు జరపబోమని నేరుగా ముఖ్యమంత్రితోనే చర్చలు జరుపుతామని ఉద్యోగులు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ సమావేశమయ్యారు.
ఉద్యోగ సంఘాలు గతంలో ఆందోళన బాట పట్టినా ఇటీవల ఉపసంహరించుకున్నాయి. తొమ్మిదో తేదీ వరకూ చూస్తామని అప్పటిలోపు ప్రభుత్వం స్పందించకపోతే.. ఎక్కడ ఆపామో.. అక్కడి నుంచే ఆందోళనలు చేస్తామని ఉద్యోగ సంఘ నేతలు గతంలో చెప్పారు. ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తారా... పీఆర్సీ ప్రకటనతో సంతృప్తి చెందుతారా అన్నది తెలియాల్సి ఉంది.