వెంటనే రోడ్లు వేయండి, అన్ని సంవత్సరాలు పాడవకూడదు: అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
కొత్తగా వేసే రోడ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో రోడ్ల పరిస్థితిపై అధికారులను ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్ లో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా వేసే రోడ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో రోడ్ల పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు.
ఆర్ అండ్ బి శాఖపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. పంచాయితీరాజ్, పురపాలక, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్, అధికారులకు పలు సూచనలు చేశారు. ఏపీ వ్యాప్తంగా ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయాలని జగన్ అధికారులకు సూచించారు. కొత్తగా నిర్మిస్తున్న రోడ్ల నాణ్యత విషయంలో రాజీపడోద్దని అన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత మరలా రెండేళ్లకే రిపేర్లకు వచ్చే అవకాశం ఉండకూడదని స్పష్టం చేశారు. రోడ్డు వేశాక కనీసం ఏడేళ్లపాటు పాడవ్వకుండా ఉండేలా చూసుకోవాలన్నారు. దీని వల్ల క్రమం తప్పకుండా రోడ్లు మెయింటెనెన్స్ అవుతాయని, నిర్వహణకూడా సజావుగా, నాణ్యతతో సాగుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. దీని పై అధికారులు దృష్టిపెట్టాలన్నారు.
నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అందులో ప్రధానమైన రోడ్లన్నింటినీ కూడా పూర్తిచేయాలని సూచించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు వంటి జిల్లాల్లో నేల స్వభావం రీత్యా రోడ్లు త్వరగా పాడైపోతున్నాయని, భారీ వాహనాలు తిరిగే సరికి కుంగిపోతున్నాయని అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఇలాంటి చోట్ల పుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్‌డీఆర్) టెక్నాలజీని వాడాలని అధికారులు జగన్ ముందు ప్రతిపాదనలు చేశారు. ఇందుకు అవసరం అయిన చర్యల తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఖర్చు ఎక్కువైనా నాణ్యత బాగుంటుందంటే, దాన్ని ఫాలో అవటం బెస్ట్ అని జగన్ అభిప్రాయపడ్డారు. మొదటి దశలో వేయి కిలోమీటర్ల మేర ఎఫ్‌డీఆర్ టెక్నాలజీతో రహాదారుల నిర్మాణం చేపట్టాలన్న ముఖ్యమంత్రి.. వచ్చే జూన్, జులైకల్లా ఈ పద్ధతిలో నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అసంపూర్తిగా ఉన్న పనుల లిస్ట్...
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న పలు నిర్మాణాలకు సంబంధించిన లిస్ట్ ను సైతం అధికారులు సీఎం జగన్ ముందు ఉంచారు. అక్కడక్కడా పెండింగ్ లో ఉన్న బ్రిడ్జిలను కూడా పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. కడప, బెంగళూరు రైల్వే లైనుపై దృష్టిపెట్టాలన్న సీఎం, విశాఖ నుంచి భోగాపురానికి వెళ్లే రోడ్డు నిర్మాణంపైనా దృష్టిపెట్టాలన్నారు. రోడ్లు బాగు చేసిన తర్వాత నాడు – నేడు ద్వారా ప్రజల ముందు పెట్టాలని, ఇంత ఖర్చుచేసి రోడ్లు బాగుచేస్తున్నా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని జగన్ అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలో నాడు– నేడు శీర్షిక కింద చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచాలని అన్నారు. ఆయా ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లలో కూడా ఈ వివరాలు ఉంచాలని, దురుద్దేశంతో కొన్ని మీడియా సంస్థలు నెగెటివ్ ప్రచారం చేస్తున్నాయని జగన్ వ్యాఖ్యానించారు.
యాప్ ను ప్రారంభించిన జగన్...
పట్టణాలు, నగరాల్లో ఎప్పటికప్పుడు రోడ్ల రిపేర్లను చేసేందుకు ఉద్దేశించిన ఏపీసీఎం ఎంఎస్ యాప్‌ను సమీక్షా సమావేశంలో అనంతరం సీఎం జగన్ ప్రారంభించారు.స్థానిక ప్రజా ప్రతినిధులు, పౌరులు ఎవరైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని చెప్పారు.యాప్ ద్వారా దీనికి సంబంధించిన ఫొటోలను అప్‌లోడ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని వెంటనే చర్యలు కూడ తీసుకోవటానిక యాప్ ఉపయోగపడుతుందని వివరించారు.