CM Jagan Letter: విద్యుత్ కొరతపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ... యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి...
ఏపీలో ఇంధన ధరలు, విద్యుత్ సంక్షోభంపై సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు. కొవిడ్ అనంతరం విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. ఓఎన్‌జీసీ, రియలన్స్ ద్వారా ఏపీకి అత్యవసర ప్రాతిపదికన గ్యాస్ సరఫరా చేయాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. విద్యుత్ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని లేఖలో ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. కొవిడ్ అనంతరం విద్యుత్ డిమాండ్ పెరిగిందని సీఎం జగన్ అన్నారు. గత ఆరు నెలల్లో విద్యుత్ డిమాండ్ 15 శాతం పెరిగిందని పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలోనే విద్యుత్ డిమాండ్ 20 శాతానికి పైగా పెరిగిందన్నారు. కొన్నిసార్లు విద్యుత్ కొనుగోలు చేయాలంటే యూనిట్‌కు రూ.20 చెల్లించాల్సి వస్తుందని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.
ఓఎన్‌జీసీ, రియలన్స్ ద్వారా గ్యాస్ సరఫరా
ఏపీ అవసరాల కోసం విద్యుత్ కొనుగోలు చేయాలని భావించినా అందుబాటులో ఉండటం లేదని సీఎం జగన్ అన్నారు. ఏపీ థర్మల్ ప్రాజెక్టులకు 20 ర్యాక్‌ల బొగ్గు కేటాయించాలని లేఖలో సీఎం ప్రధానిని కోరారు. పనిచేయని బొగ్గు ప్లాంట్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. ఓఎన్‌జీసీ, రియలన్స్ ద్వారా ఏపీకి అత్యవసర ప్రాతిపదికన గ్యాస్ సరఫరా చేయాలని లేఖలో సీఎం కోరారు. విద్యుత్ డిస్కంలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయాలన్నారు. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలను పునరుద్ధరించి మరో 500 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని సీఎం జగన్ ప్రధానికి రాసిన లేఖలో కోరారు.
Also Read: విద్యుత్ ట్రూ అప్ చార్జీలపై ఏపీ సర్కార్‌లో గందరగోళం ! నిన్న రద్దు... మళ్లీ వచ్చే నెల నుంచి వసూలు ?
రోజుకు 50 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి
ఏపీలో 185-190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని సీఎం జగన్ లేఖలో పేర్కోన్నారు. కొవిడ్ తర్వాత రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 20 శాతం మేర పెరిగిందన్న సీఎం... బొగ్గు కొరత వల్ల విద్యుత్ ప్లాంట్లు సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని సీఎం అన్నారు. ఏపీ జెన్ కో రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో 45 శాతం మేరకు తీర్చుగలుగుతోందని జగన్ వివరించారు. 1-2 రోజుల బొగ్గుల నిల్వలు మాత్రమే ఉన్నట్టు సీఎం లేఖలో తెలిపారు. బొగ్గు కొరత వల్ల ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు సగం సామార్థ్యంతో పనిచేస్తున్నాయన్నారు. రోజుకు 90 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయాల్సిన థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ప్రస్తుతం 50 శాతం మేర మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయని వెల్లడించారు. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి రోజుకు 75 శాతం మేర మాత్రమే ఉత్పత్తి సాధ్యమవుతుందని సీఎం జగన్ తెలిపారు. 8 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు థర్మల్ విద్యుత్ కేంద్రాలతో ఉన్న ఒప్పందాలను ఏపీ వినియోగించుకోలేని పరిస్థితి ఉందని సీఎం తెలిపారు.
Also Read: అమూల్ ప్రైవేట్ సంస్థ కాదు... పాలు పోసే రైతులే యాజమానులు... వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం జగన్ సమీక్ష
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి