(Source: ECI/ABP News/ABP Majha)
CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు
CM Jagan Davos Tour : దావోస్ పర్యటనలో ఉన్న సీఎం జగన్ తొలిరోజు బిజీబిజీగా ఉన్నారు. దావోస్ లో ఏర్పాటుచేసిన ఏపీ పెవిలియన్ ను ప్రారంభించారు. డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో సీఎం సమావేశమయ్యారు.
CM Jagan Davos Tour : స్విట్జర్లాండ్ దావోస్ లో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం జగన్ బృందం దావోస్ లో పర్యటిస్తుంది. మే 22 నుంచి 26 వరకు దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ సదస్సు జరగనుంది. అందులో భాగంగా తొలిరోజు డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో సీఎం జగన్ సమావేశం అయ్యారు. పారిశ్రామిక రంగానికి ఏపీలో ఉన్న అనుకూలతలను ష్వాప్ కు సీఎం జగన్ వివరించారు.
Hon'ble CM Sri @ysjagan met with Prof. Klaus Schwab, Founder WEF @wef #APatWEF22 #CMYSJaganInDavos pic.twitter.com/Kfn3jKMSGm
— YSR Congress Party (@YSRCParty) May 22, 2022
దావోస్ లో పర్యటిస్తున్న సీఎం జగన్ తొలిరోజు బిజీబిజీగా గడిపారు. పలు అంశాలపై చర్చలు జరిపారు. డబ్ల్యూఈఎఫ్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తయారీ రంగంలో అత్యాధునికతకు సంతరించుకోవడానికి వీలుగా, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. కాలుష్యంలేని ఇంధనాల అంశంపైనా దావోస్ చర్చల్లో సీఎం ప్రత్యేక దృష్టిపెట్టారు. పంప్‌డ్డ్‌స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మెనియాల తయారీపై పలువురితో చర్చింరారు. విద్యా, వైద్యరంగాల్లో ఏపీ ప్రగతిపై పలువురు ప్రతినిధులు ప్రశంసించారు. పెట్టుబడులు రావాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా ఇలాంటి విధానాలు దోహదపడతాయని కొనియాడారు.
డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్‌తో సీఎం భేటీ
డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాజ్ ష్వాప్‌తో సీఎం జగన్ సమావేశమయ్యారు. కాంగ్రెస్ సెంటర్ లో ఆయనతో సీఎం భేటీ అయ్యారు. ఏపీలో అపార అవకాశాలు ఉన్నాయిని ప్రొఫెసర్ క్లాజ్ అన్నారు. ఏపీ ఫుడ్ హబ్‌గా మారేందుకు అన్నిరకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో పలు చోట్ల ఆహార కొరత ఏర్పడుతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించగలదన్నారు. అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ భాగస్వామ్యంపై డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ప్రొఫెసర్ ష్వాప్ ఆహ్వానించారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ ష్వాప్ కు వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం అభివృద్ధిపై చర్చించారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ అంశాన్ని చర్చించారు. అందుకు అనువైన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలుష్యంలేని పారిశ్రామిక ప్రగతి వైపుగా అడుగులేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొత్తతరం పరిశ్రమలకు అవసరమైన మానవవనరులను తయారీ, నైపుణ్యాభివృద్ధికోసం ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. కోవిడ్ పరిణామాలతో దెబ్బతిన్న ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థలను తిరిగి గాడిలోపెట్టడం లాంటి అంశాలను చర్చించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికీ సేవలను అందిస్తున్నామని వివరించారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆరోగ్యం, వైద్య విభాగాధిపతి డాక్టర్ శ్యాం బిషేన్‌తో
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆరోగ్యం, వైద్య విభాగాధిపతి డాక్టర్ శ్యాం బిషేన్‌తోనూ కాంగ్రెస్ సెంటర్ లో సీఎం జగన్ సమావేశమయ్యారు. బయోటెక్నాలజీ, వైద్య రంగంలో వస్తున్న వినూత్న ఆవిష్కరణలపై డబ్ల్యూఈఎఫ్‌తో కలిసి పనిచేసే అంశంపైనా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఏపీలో ఆరోగ్య రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులను సీఎం వివరించారు. ప్రతి రెండు వేల జనాభాకు వైయస్సార్ క్లినిక్స్, గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుద్వారా పాలనా వికేంద్రీకరణ తదితర అంశాలను సీఎం వివరించారు. నూతన బోధనాసుపత్రులు, సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని, ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూఈఎఫ్ భాగస్వామ్యం కావాలని సీఎం కోరారు. ఈ సమావేశం తర్వాత సీఎం కాంగ్రెస్ వేదిక నుంచి నేరుగా ఏపీ పెవిలియన్‌కు చేరుకున్నారు. పెవిలియన్‌లో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
డబ్ల్యూఈఎఫ్ మొబిలిటీ, సస్టెయిన్ బిలిటీ విభాగాధిపతి, పెడ్రో గోమెజ్‌తోనూ సీఎం జగన్ ఏపీ పెవిలియన్‌లో సమావేశమయ్యారు. డబ్ల్యూఈఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటికే చేపట్టిన మూవ్‌ఇండియా కార్యక్రమానికి ఏపీని మొదటిసారిగా ఎంపికచేశారు. ఈనేపథ్యంలో వీరి సమావేశానికి కీలక ప్రాధాన్యత ఏర్పడింది. రవాణా రంగంలో వస్తున్న మార్పులపై ఇరువురి మధ్య నిశితంగా చర్చ జరిగింది. భవిష్యత్తులో ఇంధన రంగంపైనా విస్తృతంగా చర్చ జరిగింది. కాలుష్యంలేని రవాణావ్యవస్థ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ చర్చించారు. ప్రస్తుతం వివిధ వాహనాలకు వినియోగిస్తున్న బ్యాటరీలను ఎలాంటి కాలుష్యం లేకుండా డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. లేకపోతే నీటివనరులు, భూమి కాలుష్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మెనియా లాంటి కొత్తతరం ఇంధనాల ఉత్పత్తిపైనా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. తర్వాత డబ్ల్యూఈఎఫ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికత, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్ తగిన సహకారాన్ని అందిస్తుంది.
బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ హాన్స్‌పాల్ బక్నర్‌తో సీఎం జగన్ సమావేశమ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలను సీఎం వివరించారు. అనుమతుల్లో జాప్యం లేకుండా సింగిల్ డెస్క్ విధానంద్వారా పరిశ్రమలు పెట్టాలనుకునేవారికి అనుమతులు ఇస్తున్నామని వివరించారు. ప్రపంచంలో తూర్పుభాగానికి గేట్‌వేగా రాష్ట్రం మారేందుకు అన్నిరకాల అవకాశాలున్నాయని చెప్పుకొచ్చారు. దీనికోసం కొత్తగా 3 పోర్టుల నిర్మాణాన్నికూడా ప్రారంభించామన్నారు. విద్య, వైద్యరంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను బీసీజీ గ్లోబల్ ఛైర్మన్ ప్రశంసించారు. నైపుణ్య మానవవనరులు తయారుచేయడానికి చేపట్టిన కార్యక్రమాల వల్ల పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
మహారాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఆదిత్య థాకరే సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఏపీ పెవిలియన్ సమీపంలోనే మహారాష్ట్ర కూడా పెవిలియన్ ఏర్పాటు చేసింది. తర్వాత సీఎం జగన్ తో అదానీ గ్రూపు సంస్థల ఛైర్మన్ గౌతం అదానీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.