Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
New Sports Policy: రాష్ట్రంలో నూతన స్పోర్ట్స్ పాలసీకి ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
AP Government Approves New Sports Policy: ఏపీ ప్రభుత్వం క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు రాష్ట్రంలో స్పోర్ట్స్ ఫర్ ఆల్ విధానంతో నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆమోదం తెలిపారు. స్పోర్ట్స్ పాలసీపై సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. దేశంలో ఉత్తమ స్పోర్ట్స్ పాలసీగా (Sports Policy) ఏపీ నూతన పాలసీ కావాలని.. రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 లక్ష్యాలతో ఈ విధానం రూపొందించినట్లు సీఎం చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతల ప్రోత్సాహకాన్ని సైతం భారీగా పెంచారు. ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధిస్తే ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచారు. ఈ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవినాయుడు, సీఎస్ నీరబ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అంతకు ముందు స్పోర్ట్స్ ఫర్ ఆల్ క్రీడా విధానాన్ని రూపొందించిన అధికారులు దీనిపై సీఎం చంద్రబాబుకు వివరించారు. పీపీపీ విధానంలో స్టేడియాలు, సంస్థల సహకారంతో క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపైనా చర్చించారు. అందరికీ ఆటలు, టాలెంట్ గుర్తింపు, ప్రపంచ స్థాయి శిక్షణ, ప్రోత్సాహకాలు, క్రీడాకారులకు మద్దతు, ఉద్యోగ భద్రత, ప్రపంచస్థాయి సౌకర్యాలు, క్రీడా సంఘాలతో సమన్వయం, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్స్ నిర్వహణ, స్పోర్ట్స్ టూరిజం వంటి అంశాలకు పాలసీలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన సీఎం.. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగాల్లో క్రీడా కోటా రిజర్వేషన్ పెంపు సహా యూనిఫాం సర్వీసెస్‌లో 3 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పాలసీలో ప్రతిపాదించారు. శాప్‌లో గ్రేడ్ 3 కోచ్‌ల కోసం ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.
వారికి భారీగా ప్రోత్సాహకాలు
పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే వారికి మరింత ప్రోత్సాహంగా ఉంటుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఒలింపిక్స్ ఇతర అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించే వారికి అందించే ప్రోత్సాహకాలను భారీగా పెంచారు. ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించే వారికి ఇచ్చే ప్రోత్సహకాన్ని రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచారు. రజత పతకం సాధించే వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.50 లక్షల నుంచి రూ.5 కోట్లు, కాంస్య పతకం సాధించే వారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.30 లక్షల నుంచి రూ.3 కోట్లకు పెంచారు. అలాగే, ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం సాధిస్తే రూ.4 కోట్లు, రజత పతకం సాధిస్తే రూ.2 కోట్లు, కాంస్య పతకం సాధిస్తే రూ.కోటి చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాలని నిర్ణయించారు.
'స్పోర్ట్స్ సిటీగా అమరావతి'
స్పోర్ట్స్ సిటీగా అమరావతిని రూపొందించడం సహా తిరుపతి, వైజాగ్, అమరావతిలో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. 'కడప, విజయవాడ, విజయనగరంలో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలి. మండల, నియోజకవర్గ స్థాయిల్లో క్రీడా వికాస కేంద్రాలు, గ్రామ పంచాయతీల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో సంప్రదాయ క్రీడలు ప్రోత్సహించాలి. మౌంటెయిన్ బైకింగ్, వాటర్ స్పోర్ట్, నేచర్ ఫోటోగ్రఫీ, ట్రెక్కింగ్ వంటివి ఏర్పాటు చేయాలి.' అని సీఎం అధికారులకు సూచించారు.
Also Read: YS Vijayamma: వైఎస్ విజయమ్మ మరో బహిరంగ లేఖ - జగన్‌కు ఊరట కల్పించే విషయమే !